చివరికి లాభాలే- ఐటీ హవా

చివరికి లాభాలే- ఐటీ హవా

రోజు మొత్తం హెచ్చుతగ్గుల మధ్య కదిలిన మార్కెట్లు చివర్లో పెరిగిన కొనుగోళ్లతో చెప్పుకోదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 124 పాయింట్లు పుంజుకుని 32,029 వద్ద నిలవగా.. నిఫ్టీ 42 పాయింట్లు ఎగసి 9,915 వద్ధ స్థిరపడింది. అయితే మిడ్ సెషన్లో పెరిగిన అమ్మకాల కారణంగా ఒక దశలో సెన్సెక్స్ కనిష్టంగా 31,809ను చవిచూడగా.. చివర్లో 32,062 వద్ద గరిష్టాన్నీ తాకింది. ఇదేవిధంగా నిఫ్టీ 9,925-9,838 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.
వెలుగులో ఆర్ఐఎల్ 
రూ. 11,000 కోట్లతో షేర్ల బైబ్యాక్ ప్రతిపాదించిన కారణంగా విప్రో కౌంటర్ జోరందుకుని 6 శాతం జంప్ చేసింది. దీంతో ఎన్ఎస్ఈలో ఐటీ రంగం 2 శాతంపైగా ఎగసింది. ఇది మార్కెట్లకు బలాన్నివ్వగా.. జియో ద్వారా కేవలం రూ. 1,500 డిపాజిట్ తో స్మార్ట్ ఫీచర్లున్న హ్యాండ్ సెట్ ను అందించనున్నట్లు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 4 శాతం పురోగమించింది. 40వ వార్షిక సమావేశంలో భాగంగా కంపెనీ చైర్మన్ ముకేష్ అంబానీ వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీని ప్రకటించడం ఇన్వెస్టర్లకు జోష్ నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.  కాగా... ఫార్మా, రియల్టీ రంగాలు 0.8 శాతం చొప్పున నష్టపోయాయి.
బ్లూచిప్స్ తీరిదీ
బ్లూచిప్స్ జీ, కోల్ ఇండియా, కొటక్ బ్యాంక్, టీసీఎస్, అంబుజా, హెచ్ సీఎల్ టెక్, ఐవోసీ, ఇన్ఫోసిస్ 3.3-1 శాతం మధ్య లాభపడ్డాయి. జియో మొబైల్ సెట్ ప్రకటన కారణంగా ఎయిర్ టెల్ 2 శాతం, ఐడియా 4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇతర దిగ్గజాలలో ఐబీహౌసింగ్, పవర్ గ్రిడ్, లుపిన్, హీరోమోటో, ఐషర్, సన్ ఫార్మా, సిప్లా, టాటా స్టీల్, ఓఎన్జీసీ 2-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి.
చిన్న షేర్లు డీలా
చిన్న షేర్లలో అత్యధికం నష్టాలతోనే ముగిశాయి. బీఎస్ఈలో ట్రేడైన మొత్తం షేర్లలో 1412 నీరసిస్తే.. 1272 లాభపడ్డాయి.

 Most Popular