తగ్గనున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య!!

తగ్గనున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య!!

ప్రస్తుతం మన దేశంలో బోలెడన్ని బ్యాంకులు ఉన్నాయి. ఇన్నేసి బ్యాంకులు ఉన్నా అంతర్జాతీయ స్థాయి బ్యాంక్ ఒక్కటి కూడా లేదనే విషయాన్ని మోడీ సర్కార్ సీరియస్‌గానే తీసుకుంది. అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అనుబంధ బ్యాంకుల విలీనాన్ని ఆచరణలో పెట్టేసింది. 
ఇప్పుడు మరిన్ని బ్యాంక్‌లను కన్సాలిడేట్ చేసే యోచనలో ఉంది కేంద్రం. మొత్తం 3-4 ఇంటర్నేషనల్ రేంజ్ బ్యాంక్‌లు ఉండాలన్నది కేంద్రం టార్గెట్. అందుకే ప్రస్తుతం ఉన్న 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను 12కు తగ్గించే ప్రతిపాదనలు రూపు దిద్దుకుంటున్నాయి. 


భౌగోళికంగా ఆయా ప్రాంతాలలో గుర్తింపు పొందిన బ్యాంక్‌లకు ప్రాధాన్యం ఇచ్చి.. మిగిలిన బ్యాంక్‌లను వాటిలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్‌బీఐ స్థాయిలో కనీసం మరో 3-4 బ్యాంకులు ఉండేలా చూసేందుకే ఈ ప్రయత్నాలు అని చెబుతున్నారు బ్యాంకింగ్ నిపుణులు.
ఆయా ప్రాంతాల్లో బలంగా ఉన్న పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ వంటి వాటిని, మిడ్‌సైజ్ బ్యాంక్‌లను యథాతథంగా ఉంచుతారని తెలుస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను కన్సాలిడేట్ చేయడంపై విస్తృతంగా సమాలోచనలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపినా.. వివరాలు వెల్లడించేందుకు మాత్రం ఇష్టపడలేదు. ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం విజయవంతంగా పూర్తి చేయడంతో.. ప్రస్తుతం ఈ అంశంపై కేంద్రం ఫోకస్ పెట్టింది.


ప్రతీ వ్యవస్థకు కొన్ని పెద్ద బ్యాంకులు, కొన్ని చిన్న స్థాయి బ్యాంకులు, కొన్ని ప్రాంతీయ బ్యాంకులు అవసరం అంటున్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్. వ్యవస్థలో వైవిధ్యం ముఖ్యం అన్నది ఈయన వాదన.
పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ వంటి పద్ద బ్యాంకులు.. తాము కొనుగోలు చేసేందుకు సరైన బ్యాంకింగ్ సంస్థలను అన్వేషించవచ్చని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. 


ప్రాంతీయ సమతూకం, భౌగోళిక వ్యాప్తి, ఆర్థిక భారం, సులభంగా మానవ వనరుల బదలాయింపు వంటి పలు అంశాలను పరిశీలించిన తర్వాత విలీనంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని.. మరీ బలహీనంగా ఉన్న బ్యాంక్‌ను, శక్తివంతంగా కనిపిస్తున్న బ్యాంక్‌లో విలీనం చేయడం సాధ్యపడదని చెబుతున్నారు. 
ఏప్రిల్ 1, 2017 నుంచి భారతీయ మహిళా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ హైద్రాబాద్, స్టేట్ బ్యాంక్ ఆప్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కూర్‌లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కావడంతో.. ప్రపంచంలో టాప్50 బ్యాంక్‌లలో ఎస్‌బీఐ చోటు సంపాదించగలిగింది.


ఈ విలీనం కారణంగా ఎస్‌బీఐ కస్టమర్ల సంఖ్య 37 కోట్లకు చేరగా, దేశవ్యాప్తంగా 24వేల శాఖలు, 59 వేల ఏటీఎంల నెట్వర్క్ కలిగిన బ్యాంక్‌గా అవతరించింది. విలీనం తర్వాత ఉమ్మడి బ్యాంక్‌కు రూ. 26 లక్షల కోట్ల డిపాజిట్లు, రూ. 18.50 లక్షల కోట్ల అడ్వాన్స్‌లను కలిగి ఉంది. 2008లో మొదటగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర.. ఎస్‌బీఐలో విలీనం కాగా.. రెండేళ్ల తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ విలీనమైంది.Most Popular