రాబోయే ఐపీఓల్లో ఇవి ఆకర్షణీయం

రాబోయే ఐపీఓల్లో ఇవి ఆకర్షణీయం


మార్కెట్లను ఐపీఓలు ముంచెత్తుతున్నాయ్. వరుసగా లిస్ట్ పబ్లిక్ ఆఫర్లలో.. మదుపర్లకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నవి కూడా అనేకం ఉన్నాయి. ఇక రాబోయే కొన్ని నెలలు కూడా ఈ ఐపీఓ సీజన్ కొనసాగనుంది. 
రాబోయే నెలల్లో ప్రైమరీ మార్కెట్ల ద్వారా నిధులు సేకరించేందుకు సిద్ధమైన 6 కంపెనీలకు సంబంధించిన వివరాలను పరిశీలిద్దాం. 

ప్రతాప్ స్నాక్స్:
యెల్లో డైమండ్ చిప్స్‌ను తయారు చేసే ఈ కంపెనీ.. డిసెంబర్‌ నెలలో ఐపీఓ ద్వారా రూ. 400 -500 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఏప్రిల్ నెలలోనే సెబీ నుంచి ఇందుకు అనుమతులు పొందగా.. షేర్ల ఇష్యూ చేయడం ద్వారా తాజాగా రూ. 250 కోట్లను సమీకరించే యోచనలో ఉంది. 
ఎడెల్‌వీస్, జేఎం ఫైనాన్షియల్, స్పార్క్ కేపిటల్ సంస్థలు లీడ్ మేనేజర్స్‌గా వ్యవహరించనున్నాయి. 
ఇండోర్ కేంద్రగా పని చేసే ప్రతాప్ స్నాక్స్.. మూలధన అవసరాలు, రుణాల చెల్లింపులు, నిర్మాణ సంబంధిత కార్యకలాపాల కోసం ఐపీఓకు వస్తోంది.

 

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ:
ఈ ఆర్థిక సంవత్సరం నాటికి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తమ ఏజంట్ల సంఖ్యను 45వేల నుంచి 50000లకు పెంచుకుంది ఎన్ఐసీ.
గతేడాది రూ. 8764 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ నెట్వర్త్.. ఈ ఏడాది 9 శాతం పెరిగి రూ. 9544 కోట్లకు చేరుకుంది. కంబైన్డ్ రేషియా 133.7 శాతంగా ఉండగా.. అండర్ రైటింగ్ నష్టాలు రూ. 3633 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ. 3680 కోట్లకు చేరుకున్నాయి.

 

యూటీఐ అస్సెట్ మేనేజ్‌మెంట్:
2018 మార్చ్ నాటికి ఐపీఓకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న యూటీఐ అస్సెట్ మేనేజ్‌మెంట్, మరో మూడు నెలల కాలంలో సెబీకి ఐపీఓ దరఖాస్తు సమర్పించే అవకాశాలున్నాయి. ఐపీఓకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న తొలి దేశీయ మ్యూచువల్ ఫండ్ కంపెనీగా.. యూటీఐ అస్సెట్ మేనేజ్‌మెంట్ రికార్డ సృష్టించనుంది.
యూటీఐ ఎంఎఫ్‌లో ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్‌ఐసీలకు 18.3 శాతం చొప్పున వాటాలున్నాయి. ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు తమ పూర్తి వాటాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిర్వహణ ఆస్తులుగా ఈ కంపెనీకి కింద రూ. 1.5 లక్షల కోట్ల ఆస్తులున్నాయి.

 

ఎస్‌బీఐ లైఫ్:
ఐపీఓ ద్వారా ఎస్‌బీఐ లైఫ్‌లో 8 కోట్ల షేర్లను విక్రయించేందుకు ప్రయత్నించనున్నట్లు ఎస్‌బీఐ ఇప్పటికే ప్రకటించింది. రూ. 7 వేల కోట్లను సమీకరించేదుకు ఎస్‌బీఐ లైఫ్ దాఖలు చేసిన ఐపీఓ దరఖస్తుకు.. ఇప్పటికే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ నుంచి ఆమోదం లభించింది. దేశీయ బీమా సంస్థల్లో ఇది అతి పెద్ద ఐపీఓ కావడం విశేషం. 
బీఎన్‌పీ పరిబాస్, సిటి, కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, యాక్సిస్ క్యాపిటల్‌లు లీడ్ మేనేజర్స్‌గా ఉండగా.. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ రూ. 15200 కోట్లుగా ఉంది. మార్చ్ 2016నాటి స్థాయి రూ. 12999 కోట్లతో పోల్చితే ఇది 17 శాతం శాతం ఎక్కువ. గతేడాది నికర లాభం రూ. 861.03 కోట్లనుంచి 10 శాతం పెరిగి రూ. 954.65 కోట్లకు చేరుకుంది.

 

రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అస్సెట్ మేనేజ్‌మెంట్:
ఈ ఏడాది జనవరి 8న జరిగిన సమావేశంలో.. ఐపీఓకు వచ్చేందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతి లభించింది. రాబోయే నాలుగు ఏళ్లలో.. అంటే 2021నాటికి 10 నుంచి 25 శాతం మేర వాటాలు విక్రయించే యోచన ఉంది.
రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ నిర్వహణ ఆస్తుల వార్షిక విలువ రూ. 3.58 లక్షల కోట్లుగా ఉంది. ఏటా 5 శాతం చొప్పున ఇది పెరుగుతోంది. 

 

లెన్స్‌కార్ట్:
రాబోయే 3 సంవత్సరాల్లో ఐపీఓకు వచ్చేందుకు ఈ ఆన్‌లైన్ ఐవేర్ విక్రయాల సంస్థ ప్రయత్నిస్తోంది. 2017-18 చివరినాటికి ఆదాయం 100 శాతం పెరిగి రూ. 600 కోట్లకు చేరనుందని కంపెనీ అంచనా వేస్తోంది. 
లెన్స్‌కార్ట్‌లో లీడ్ ఇన్వెస్టర్‌గా టీపీజీ గ్లోబల్ ఉండగా.. ఇప్పటికే పలు సంస్థల నుంచి రూ. 700 కోట్ల మేర నిధులను సమీకరించింది. 
 Most Popular