వాహ్వా.. ఆర్‌ఐఎల్‌! మార్కెట్‌ క్యాప్‌ @రూ. 5 లక్షల కోట్లు

వాహ్వా.. ఆర్‌ఐఎల్‌! మార్కెట్‌ క్యాప్‌ @రూ. 5 లక్షల కోట్లు

ప్రయివేట్‌ రంగ ఇంధన దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సరికొత్త రికార్డు సాధించింది. పారిశ్రామిక దిగ్గజం ముకేష్‌ అంబానీ ఆధ్వర్యంలో 4జీ సేవలను ప్రారంభించడం ద్వారా దేశవ్యాప్తంగా సంచలనానికి తెరతీసిన సంస్థ తాజాగా రూ. 5 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను(కేపిటలైజేషన్‌) సాధించడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించింది. 
టీసీఎస్‌ ద్వితీయ స్థానంలో
బీఎస్‌ఈలో ప్రస్తుతం ఆర్‌ఐఎల్‌ షేరు 1.4 శాతం పెరిగి రూ. 1553 వద్ద ట్రేడవుతోంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే కంపెనీ మార్కెట్‌ కేపిటలైజేషన్‌ రూ. 5,05,157 కోట్లను తాకింది. తద్వారా మార్కెట్‌ కేప్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని పదిలపరచుకోగా.. సాఫ్ట్‌వేర్‌ సేవల టాటా దిగ్గజం టీసీఎస్‌ రూ. 4,61,114 కోట్లతో ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. టీసీఎస్‌ ప్రస్తుతం 0.4 శాతం బలపడి రూ. 2,409 వద్ద ట్రేడవుతోంది.
కారణాలేమిటంటే..?
ఇటీవల బ్రిటిష్‌ పెట్రోలియంతో జతగా దేశ ఇంధన రంగంలో భారీ పెట్టుబడులకు తెరతీయడం ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు జియో సబ్‌స్క్రైబర్లు పెరుగుతుండటం కూడా ఇందుకు దోహదపడుతున్నట్లు చెబుతున్నారు. కేజీ బేసిన్‌లో రూ. 40,000 కోట్లను ఇన్వెస్ట్‌ చేసేందుకు బీపీతో కలసి ఆర్‌ఐఎల్‌ ప్రణాళికలు వెల్లడించిన విషయం విదితమే. రానున్న మూడేళ్లలో పెట్టుబడులను వెచ్చించడం ద్వారా డీ6 క్షేత్రాల నుంచి ఉత్పత్తిని ఐదు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు జూన్‌లో కార్యాచరణను ప్రకటించింది. కేజీ డీ6 బ్లాకులో ఆర్‌ఐఎల్‌కు 60 శాతం, బీపీకి 30 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. 10 శాతం వాటాను కెనడా సంస్థ నికో రీసోర్సెస్‌ కలిగి ఉంది. వీటికితోడు మరోపక్క రిలయన్స్‌ జియో కస్టమర్ల సంఖ్య 12 కోట్లను మించడంతో ఇన్వెస్టర్లు ఆర్‌ఐఎల్‌ కౌంటర్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు.Most Popular