గుడ్డిగా వీళ్లను ఫాలో అయినా 250 శాతం ప్రాఫిట్స్ !

గుడ్డిగా వీళ్లను ఫాలో అయినా 250 శాతం ప్రాఫిట్స్ !

 

కొన్ని కంపెనీలు ఎంత అద్భుతమైన పనితీరును కనబర్చినా వాటిల్లో అంత కనిపించదు. ఏళ్లకు ఏళ్లు అలా పడి ఉండడాన్ని మనం ఎన్నో సార్లు గమనించే ఉంటాం. అయితే ఫండమెంటల్స్ అంత గొప్పగా లేకపోయినా, కంపెనీ నష్టాల్లో ఉన్నా సరే కొంత మంది ప్రముఖ ఇన్వెస్టర్లు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలిస్తే చాలు.. ఇక ఆ స్టాక్‌ను పట్టుకోలేం. ఏదో ఒక న్యూస్ లేకపోతే అంత పెద్ద ఇన్వెస్టర్లు ఎందుకు డబ్బులు కుమ్మరిస్తారనే నమ్మకంతో మనమూ ఫాలో అయిన సందర్భాలు ఎన్నో. 

ఒకప్పుడు రాకేష్ జున్‌జున్‌వాలా ఆ కోవలో ఉంటే.. ఇప్పుడు పొరింజు వెలియాత్, డాలీ ఖన్నా, మోహ్నీష్ పాబ్రాయ్ వంటి వాళ్లు బాగా పాపులర్ అయ్యారు. కంపెనీ ఫండమెంటల్స్‌తో సంబంధం లేకుండా వీళ్ల చేయిపడిందనే వార్తొస్తే చాలు స్టాక్స్ పెరిగిపోవడం ఈ మధ్య మనం చూస్తున్నాం. 

ఈ మధ్య స్మాల్ క్యాప్ పికింగ్ స్పెషలిస్ట్ అయిన డాలీ ఖన్నా ఎంపిక చేసిన రెయిన్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ పరుగులు తీశాయి. ఈ కంపెనీలో ఆయనతో పాటు మోహ్నిష్‌కు 1 శాతం వరకూ వాటాలు తీసుకున్నారు. వాళ్లు పిక్ చేసుకున్నప్పటి నుంచి ఈ స్టాక్ సుమారు 250 శాతం వరకూ పెరిగింది అంటే అతిశయోక్తి కాదు. 

డాలీ ఖన్నా రెయిన్ ఇండస్ట్రీస్‌లో 42.68 లక్షల షేర్లను (1.27 శాతం వాటా) జూన్‌ క్వార్టర్లో కొనుగోలు చేశారు. అంతకంటే ముందే మోహ్నిష్ పాబ్రాయ్ ఈ స్టాక్స్ కొన్నారు, అవి ఎప్పుడో మల్టీబ్యాగర్స్ అయిపోయాయి. జూన్ 2015లో ఆయన సుమారు కోటి స్టాక్స్‌ను రూ.40లో కొనుగోలు చేశారు. 

ఈ ఏడాదిగా ఈ స్టాక్‌ 250 శాతం వరకూ పెరిగి ప్రస్తుతానికి రూ.130 రేంజ్‌లో ట్రేడవుతోంది. ఈ కాలంలో సెన్సెక్స్ ఇచ్చిన రిటర్న్ కేవలం 15 శాతమే అయినా ఈ కంపెనీ మాత్రం ఎన్నో లాభాలను పంచింది. అంటే ఏడాది క్రితం ఈ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడది రూ.3.5 లక్షలు అయి ఉండేది. ఇప్పటికీ ఈ స్టాక్‌ ఫండమెంటల్‌గా, టెక్నికల్‌గా పటిష్టంగా ఉందని ఎనలిస్టులు చెబ్తున్నారు. 

హైదరాబాద్‌కు చెందిన రెయిన్ కమాడిటీస్ పేరుతో ఒకప్పుడు ట్రేడ్ అయిన కంపెనీ 2013 నుంచి రెయిన్ ఇండస్ట్రీస్‌గా చెలామణీ అవుతోంది. సిమెంట్ తయారీ, క్యాల్సిన్డ్ పెట్రోలియం కోక్, హై క్వాలిటీ బేసిక్, స్పెషాలిటీ కెమికల్స్ తయారీలో ఉన్న సంస్థ ఇది. సీజనల్ బిజినెస్ కావడంతో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవడం సహజంగానే ఉంటుంది. 2013-15 కాలంలో ఈ సంస్థ తక్కువ డిమాండ్ నేపధ్యంలో బాగా ఇబ్బందులను ఎదుర్కొంది. అయితే ఇప్పుడు గిరాకీ కొద్దిగా పెరగడం, బిజినెస్ సైకిల్ మెరుగవడంతో కుదుటపడింది. 

ఇంతకీ ఎవరీ డాలీ, మోహ్నిష్ పాబ్రాయ్ ? ఏంటి వాళ్ల స్ట్రాటజీ

పాబ్రాయ్... ఇండియన్ అమెరికన్ ఇన్వెస్టర్, బిజినెస్‌మెన్, దానశీలి. క్వాలిటీ స్టాక్స్‌ను మంచి ప్రైస్‌లో ఉన్నప్పుడు గుర్తించి, ఇన్వెస్ట్ చేయడం ఇతని స్టైల్. పాబ్రాయ్ ఫండ్స్ అనే ఓ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్‌నకు ఇతను మేనేజింగ్ పార్ట్‌నర్. వారెన్ బఫెట్ సూత్రాల ఆధారంగా వీళ్లు ఇన్వెస్ట్ చేస్తారు. 1999 నుంచి వార్షికంగా వీళ్ల ఫండ్స్‌ 25 శాతం రాబడిని తక్కువ కాకుండా ఇచ్చాయి. 

డాలీ ఖన్నా.. చెన్నైకి చెందిన ప్రముఖ మహిళా ఇన్వెస్టర్. సుమారు రూ.200 కోట్ల విలువైన పెట్టుబడులను ఆవిడ ఇప్పటికే చేశారు. పెద్దగా ప్రాచుర్యం లేని కంపెనీలను గుర్తించి వాటిల్లో మల్టీబ్యాగర్ సామర్ధ్యం ఉన్న స్టాక్స్‌ను ఎంపిక చేయడం ఈమె స్పెషాలిటీ. నీల్‌కమల్, ట్రైడెంట్, మణప్పురం ఫైనాన్స్‌ స్టాక్స్‌ను గతంలో చవక ధరలో గుర్తించి భారీ పెట్టుబడులను పెట్టి అనూహ్యమైన లాభాలను సొంతం చేసుకున్న ట్రాక్ రికార్డ్ ఆమె సొంతం. 

సైడ్ కార్ ఇన్వెస్టింగ్ - ఇదో రకమైన స్ట్రాటజీ. మనకు అవగాహన లేనప్పుడు ఎవరైనా నిపుణులు వెళ్తున్న బాటలో వాళ్లను అనుసరిస్తూ వెళ్లడాన్ని సైడ్ కార్ ఇన్వెస్టింగ్ అంటారు. 


సలహా - అయితే ప్రతీసారీ వీళ్లను ఫాలో కావడం వల్ల లాభాలు వస్తాయా అంటే మాత్రం చెప్పలేం. ఇప్పటి వరకూ వీళ్లు సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్లు. అయితే వీళ్లను ఫాలో కావడంతో పాటు మనం కూడా సదరు స్టాక్‌పై రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తేనే మంచిది. గుడ్డిగా ఎవరినీ ఫాలో కావడం మంచిది కాదు. Most Popular