అప్పుల కుప్పల కంపెనీల కోసం ఎందుకా పరుగు ?

అప్పుల కుప్పల కంపెనీల కోసం ఎందుకా పరుగు ?


స్టాక్ మార్కెట్లు రోజుకో రికార్డును క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న తరుణమిది. లార్జ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్.. పెన్నీ వరకూ చాలా స్టాక్స్ 52 వారాల గరిష్ట స్థాయిల దగ్గర ట్రేడవుతున్నాయి. ఎప్పుడో ఎనిమిది తొమ్మిదేళ్ల క్రితం ఫోకస్‌లో ఉన్న స్టాక్స్ కూడా ఇప్పుడిప్పుడే మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. ఇదే టైంలో అప్పుల కుప్పల్లో పేరుకుపోయిన చాలా కంపెనీలను కూడా ఇన్వెస్టర్లు, ట్రేడర్లు వెతికి వెతికి మరీ పట్టుకుని పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. వాటిల్లో తరచూ వినిపించే జిఎంఆర్, జివికె, జెపి అసోసియేట్స్, జేపీ ఇన్ఫ్రా, ఎంఈపీ ఇన్ఫ్రా, ఎబిజి షిప్‌యార్డ్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, జెబిఎం ఆటో, రెయిన్ ఇండస్ట్రీస్, జైప్రకాశ్ పవర్ వంటివి ఉన్నాయి. సదరు స్టాక్స్ అన్నీ ఇప్పటికే 25 నుంచి 80 శాతం వరకూ పెరిగి వేడిమీద ఉన్నాయి. అయినా సరే వీటి ప్రైస్‌ చూసో.. గతంలో వీటి ధరలను చూస్తో ఇన్వెస్టర్లు అట్రాక్ట్ అయిపోతున్నారు. వీటి కోసం ఎందుకా తాపత్రయం అని అడిగితే... "ఛీప్‌గా దొరుకుతున్నాయ్‌గా... ఎట్రాక్టివ్ ప్రైస్'' అని చెప్పేసుకుంటున్నారు. ఇంతకీ సదరు కంపెనీల అప్పు ఎంతుందో తెలుసా, వాటిని ఎప్పటిలోపు తీర్చేయగలవో తెలుసా అని అడిగితే మాత్రం... నోరెళ్లబెడ్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురవుతోంది. 

నిజమెంత ?
సదరు రుణగ్రస్త సంస్థలన్నీ మెల్లిగా తమ అప్పులను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎంత తగ్గించుకున్నాయి, ఎంతకాలంలోగా తగ్గించుకుంటాయి అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. 
జూన్ - జూలై మధ్యకాలంలో ఈ స్టాక్స్ అన్నింటిలో వాల్యూమ్స్ రెట్టింపయ్యాయి. అన్నింటికంటే ముఖ్యంగా డెలివరీలు కూడా బాగా పెరిగాయి. దీన్ని బట్టి షేర్ హోల్డర్లలో సదరు సంస్థలపై నమ్మకం పెరిగిందనేందుకు సంకేతంగా భావించాల్సి ఉంటుంది. 

ఇప్పుడుపైన మనం మాట్లాడుకునే కంపెనీల్లో కొన్ని సంస్థలు దివాలా స్థాయికి వెళ్లి కోర్టుల దగ్గర పడిగాపులు గాస్తున్నాయి. సదరు సంస్థల యాజమాన్యాలు ఇప్పటికైనా మేలుకుని ఏదో ఒకటి చేయకపోతే వాళ్లకు మేనేజ్‌మెంట్ కంట్రోల్ పోతుంది అనడంలో సందేహం లేదు. అందుకే ఇలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్లు హై రిస్క్ తీసుకోగలిగితేనే ముందుకు వెళ్లాలి, లేకపోతే పూర్తిగా అవాయిడ్ చేయడమే మంచిదనేది నిపుణుల సలహా. 

తాజాగా రిజర్వు బ్యాంక్ 12 నిరర్ధక ఆస్తులకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వాటి అప్పుల విలువే సుమారు రూ.2.2 లక్షల కోట్లుగా ఉంది. తాజా పరిణామాల నేపధ్యంలో బ్యాంకులు.. కొద్దిగా హెయిర్ కట్ (తనఖాలో ఉన్న ఆస్తి విలువకు రుణం తీసుకున్న సొమ్ముకు మధ్య వ్యత్యాసాన్ని హెయిర్ కట్ అంటారు. ఈ నేపధ్యంలో కొద్దిగా నష్టాన్ని భరించి అయినా అసలు, వడ్డీని రాబట్టుకోవడానికి బ్యాంకులు కృషిచేస్తాయి) తీసుకోవడానికి సిద్ధపడ్తున్నాయి. దీనికి తోడు ప్రమోటర్‌ను మార్చకపోవడం వంటి నిర్ణయాలు డెట్ ఈక్విటీ రేషియోను కొద్దోగొప్పో మెరుగు పరిచే అవకాశం ఉంటుంది. ఇది పరోక్షంగా రుణగ్రస్థ సంస్థలకు కలిసొస్తుంది. 

జిఎంఆర్ ఇన్ఫ్రా - 
గత నెలలో జిఎంఆర్ ఇన్ఫ్రా సంస్థ షేర్లు ఏకంగా 11 శాతం వరకూ పెరిగాయి. ఈ సంస్థ రూ.37480 కోట్ల రుణాన్ని ఈ మధ్యకాలంలో రూ.19856 కోట్లకు తగ్గించుకోగలిగింది. ఫైనాన్స్ సంస్థలు తమ రుణాలను ఈక్విటీగా మార్చడంతో పాటు కొన్ని చోట్ల ఆస్తులను అమ్మి రుణాలను తీర్చడం వల్లే ఇది సాధ్యపడింది.

జెపి గ్రూప్ ఆఫ్ కంపెనీలు - 
గత నెలలో జెపి ఇన్ఫ్రాటెక్ 81 శాతం పెరిగింది. సాధారణంగా రోజుకు ఉండే 12 లక్షల డెలివరీ వాల్యూమ్స్ కూడా 34 లక్షలకు ఆపై 65 లక్షలకు పెరిగాయి. జైప్రకాశ్ అసోసియేట్స్ స్టాక్ నెలలో 77 శాతం పెరిగింది. 
ఈ మధ్య తన రెండు సిమెంట్ ప్లాంట్లను అల్ట్రాటెక్‌కు అమ్మడం వల్ల  జెపి గ్రూప్ రుణం కూడా కాస్త తగ్గింది. 

జివికె పవర్ - 
ఈ స్టాక్ కూడా నెలలో 28 శాతం పెరిగింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కొద్ది వాటాను రూ.1290 కోట్లకు అమ్మి కొద్దిగా రుణభారాన్ని తగ్గించుకుంది. 

ఇది ఆహ్వానించాల్సిన పరిణామమే అయినా హై రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కాంట్రేరియన్ బెట్స్ కింద కొన్ని పొజిషన్స్ తీసుకుని సదరు కంపెనీల టర్న్ ఎరౌండ్ కోసం వేచి చూడాల్సి ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఈ స్టాక్స్ కొద్దొగొప్పో ఇక్కడి నుంచి పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రైస్ తక్కువగా ఉంది కదా అనే ఉద్దేశంతో ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేయడం మాత్రం సరికాదనేది నిపుణుల సలహా. 
 Most Popular