10న ఏయూ స్మాల్‌ బ్యాంక్‌ లిస్టింగ్‌!

10న ఏయూ స్మాల్‌ బ్యాంక్‌ లిస్టింగ్‌!

ఇటీవల విజయవంతంగా పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌(ఎస్‌ఎఫ్‌సీ) సోమవారం(10న) స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. ఐపీవోకు ధరల శ్రేణి రూ. 355-358కాగా.. ఇష్యూకి ఏకంగా 54 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. తద్వారా కంపెనీ రూ. 1,912 కోట్లను సమీకరించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 3.7 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా.. 20 కోట్ల షేర్లకు బిడ్స్‌ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్‌) విభాగంలో దాదాపు 79 రెట్లు అధికంగా, సంపన్న వర్గాల కోటాలో 143 రెట్లకంటే అధికంగా బిడ్స్‌ వెల్లువెత్తాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగం నుంచి కూడా 3.4 రెట్లు ఎక్కువగా దరఖాస్తులు లభించాయి. ఇష్యూలో భాగంగా షేరుకి రూ. 358 ధరలో యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 563 కోట్లను సమీకరించింది. 
అనధికార మార్కెట్లో ప్రీమియం
ఏయూ ఎస్ఎఫ్‌సీ షేర్లకు ప్రస్తుతం అనధికార(గ్రే) మార్కెట్లో రూ. 75-80 ప్రీమియం పలుకుతోంది. ఇష్యూ తుది ధర రూ. 358 కాగా.. రూ. 430 వరకూ పలుకుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సోమవారం ఈ స్టాక్‌ రూ. 400 వద్ద లిస్ట్‌కాగలదని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. సెంటిమెంటు సానుకూలంగా ఉంటే తదుపరిమరింత పెరిగే వీలున్నట్లు భావిస్తున్నారు.Most Popular