ముందస్తుగా ఆరోగ్య బీమా తీసుకుంటే ఏంటి ఉపయోగం?

ముందస్తుగా ఆరోగ్య బీమా తీసుకుంటే ఏంటి ఉపయోగం?


కాలం ఎవరి కోసం ఆగదు.. ఎవరూ అనారోగ్యం రావాలని కోరుకోరు. యాక్సిడెంట్లు.. గాయాలు, హాస్పిటల్స్ లాంటివి కావాలని అనుకోరు. అయినా సరే అందరికీ ఆరోగ్య బీమా అత్యంత అవసరాల్లో ఒకటి. మన జీవనశైలి కారణంగా క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, ట్యూమర్, పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి. అంటే మన జీవితం ప్రమాదంలో కూరుకుపోతోందని అర్ధం. ఆరోగ్య బీమా పొందాలంటే మీ వయసు 50 ఏళ్లకు మించి ఉండకూడదనే ప్రాథమిక సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వస్తున్న అనేక వ్యాధులకు అసలు సిసలైన కారణం.. మన జీవన విధానంలో వచ్చిన మార్పులే. ఆరోగ్య బీమా కొనుగోలు చేసేందుకు మంచి సమయం అంటే.. అప్పటికప్పుడే తీసుకోవడమే.

అవాంఛిత పరిస్థితులను ఎదుర్కునేందుకు, ఆరోగ్యంపై ప్రభావం చూపే అనుకోని శత్రువులను అడ్డుకునేందుకు ఆరోగ్య బీమా ఎంతో అవసరం. ఇది 60 ఏళ్ల వయసు గురించి మీరు ఆలోచిస్తున్నట్లు అయితే, అప్పటి అనారోగ్యానికి ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నట్లు అయితే, 40లలోనే బీమా పాలసీ తీసుకుంటే సరిపోతుందని భావిస్తే.. మీ ఆలోచన సరికాదు. వయసు పైబడ్డ కొద్దీ వారికి కవరేజ్ తగ్గిపోతుంది. వారిలో ప్రమాద సంభావ్యత ఎక్కువగా ఉండడంతోనే.. కంపెనీలు ఇలాంటి విధానం పాటిస్తాయి. ఆరోగ్య బీమాను మీరు ఆరోగ్యంగా ఉన్నపుడు.. ఎంత చిన్న వయసులో వీలైతే అప్పుడు.. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నపుడే తీసుకోవాల్సి ఉంటుంది. మన జీవన శైలిలో మార్పులు, తీవ్ర ఒత్తిడితో కూడుకున్న షెడ్యూల్స్ కారణంగా ఏకంగా ప్రాణానికి ప్రమాదం చేకూర్చే వ్యాధులు రాగల సంభావ్యత పెరిగిపోతోంది. అందుకే, ఎలాంటి పరిస్థితిని అయినా ఎదిరించేందుకు ముందు సిద్ధంగా ఉండాలి. 

ముందస్తుగా ఆరోగ్య బీమా తీసుకోవడం ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చుతుందో తెలుసుకుందాం.

అత్యవసర పరిస్థితుల కోసం ప్రణాళికలు
చిన్న వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం అంటే, మీ జీవితంపై పెను ప్రభావం చూపేవాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే. రాబోయే క్షణాన్ని కూడా ముందుగా ఊహించే అవకాశం లేకపోవడంతో, మనిషి జీవితం ఏ సమయంలో అయినా తీవ్రమైన మార్పులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాటి పరిస్థితుల్లో ఆరోగ్య బీమా పథకాన్ని కొనుగోలు చేయడం అంటే, వైద్యపరంగా అత్యవసర పరిస్థితికి ముందస్తుగా సిద్ధంగా ఉండడమే. జీవిత కాలం వరకూ రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండడంతో, మొత్తం జీవితంలో ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. ముందస్తుగా తీసుకున్న పాలసీ, మీకు జీవితంపై భరోసాను అందించగలదు.

మీరు ఉద్యోగం చేసే సంస్థ నుంచి ఆరోగ్య బీమా సదుపాయం ఉన్నా సరే, అది సరిపోకపోవచ్చు. వైద్యపరమైన మార్కెట్ చాలా వేగంగా మారిపోతోంది. దీంతో వైద్య ఖర్చులు కూడా తీవ్రంగా పెరుగుతున్నాయి. అందుకే ఆరోగ్య బీమాను ఏ సమయంలో తక్కువగా అంచనా వేయకూడదు. ఏదైనా మంచి ఆస్పత్రి నుంచి మెడికల్ బిల్స్ తీసుకుని పరిశీలించండి, వాటిని మీ కంపెనీ అందిస్తున్న బీమా కవరేజ్‌తో పోల్చి చూడండి. మీరు కంపెనీ ఇస్తున్న పాలసీ ఏ మాత్రం సరిపోతుందనే విషయం మీకే అర్ధమవుతుంది. గ్రూప్ మెడిక్లెయిమ్ కవరేజ్ పథకాల కంటే, మీరు సొంతగా తీసుకున్న బీమా పథకాలే మెడికల్ ఎమర్జెన్సీ సమయాల్లో అధికంగా ఉపయోగపడతాయి.

వెయిటింగ్ పీరియడ్ పూర్తి కావడం
సహజంగా, ఆరోగ్య బీమా పాలసీకి 30 రోజుల నిరీక్షణ సమయం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది 90 రోజులు కూడా ఉండచ్చు. ఈ వెయిటింగ్ పీరియడ్‌లో ఎంతటి అత్యవసర పరిస్థితి అయినా మీరు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. అంటే ముందుగా తీసుకున్న బీమా పథకాలలో ఈ వెయిటింగ్ పీరియడ్, ఆరోగ్యంగా ఉన్నపుడే పూర్తయిపోతుంది. ఉదాహరణకు వయసు పెరిగిన కొద్దీ శుక్లాలు(కేటరాక్ట్), చక్కెర వ్యాధి(డయాబెటిస్), మోకీళ్ల మార్పిడి(Knee Replacement), గుండె జబ్బులు, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కునేందుకు ముందుగా సిద్ధం కావాలంటే, చిన్న వయసులోనే ఆరోగ్య బీమా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లో కూడా మీకు కవరేజ్ ఉంటుంది. వీటితో పాటు, అప్పటికే ఉన్న వ్యాధులకు(ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్‌నెస్) కవరేజ్, దంతాలు, మెటర్నిటీ ప్రయోజనాలు కూడా దక్కుతాయి. అనేక కంపెనీలు నో క్లెయిమ్ బోనస్‌ కూడా అందిస్తుంటాయి. మీ భవిష్యత్తును మీరు కాపాడుకునేందుకు అత్యంత చవకైన మార్గం ఆరోగ్య బీమా తీసుకోవడమే. 

మీకు కానీ, మీ ప్రియమైన వ్యక్తులకు ఏదైనా ప్రమాదం సంభవించే వరకూ మిన్నకుండిపోకూడదు. ఇప్పుడు తీసుకునే త్వరిత నిర్ణయం రాబోయే కాలంలో మిమ్మల్ని కాపాడుతుంది, కవరేజ్ అందిస్తుంది. 'హెల్త్ ఈజ్ వెల్త్', 'ఆరోగ్యమే మహాభాగ్యం' లాంటి సామెతలను అందరూ వినే ఉంటారు. ప్రస్తుత కాలంలో మన కోసం మనం ఏదైనా చేసుకుని తీరాలి. తీవ్రమైన ఒత్తిడి జీవితం, కాలుష్యంతో నిండిన పర్యావరణం మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. జీవితంలో రాబోయే మధురమైన క్షణాలను మహోన్నతంగా గడపాలంటే అవసరమైన సాధనం ఆరోగ్య బీమా. వీలైనంత త్వరగా తీసుకోవడం అనేది మరింత ముఖ్యమైన విషయం. 
 Most Popular