ఐపీఓకి వచ్చే ముందు నేషనల్ ఇన్సూరెన్స్ వ్యూహాలు

ఐపీఓకి వచ్చే ముందు నేషనల్ ఇన్సూరెన్స్ వ్యూహాలు


నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వచ్చే ఏడాది ఐపీఓకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి ముందుగా బ్యాలెన్స్ షీట్‌ను క్లీన్ చేసుకునే ప్రణాళికలు ఇప్పటికే ముమ్మురం చేసింది.
2017 మార్చ్ చివరకు నేషనల్ ఇన్సూరెన్స్ సాల్వెన్సీ రేషియో 1.9కు చేరుకుంది. ఆరు నెలల క్రితం అంటే 2016  సెప్టెంబర్ ఆఖరు నాటికి ఇది 1.26గా మాత్రమే ఉంది. 6 నెలల సమయంలోనే సాల్వెన్సీ రేషియోను గణనీయంగా పెంచుకోవడం విశేషం. మూలధన స్థాయి మెరుగవడంతో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీఓకు వచ్చేందుకు కేంద్రం అనుమతి కోరింది నేషనల్ ఇన్సూరెన్స్.

షార్ట్ టెర్మ్, లాంగ్ టెర్మ్ బాధ్యతలకు సంబంధించి, ఒక బీమా కంపెనీకి చెందిన ఆర్థిక స్థితిని సాల్వెన్సీ రేషియో సూచిస్తుంది. తీవ్ర పరిస్థితుల్లో కూడా క్లెయిమ్‌లను పరిష్కరించగలిగే స్థాయి ఉందా లేదా అని చెప్పడమే దీని ఉద్దేశ్యం. ఇన్సూరెన్స్ కంపెనీలకు 1.5 సాల్వెన్సీ రేషియో ఉండాలని బీమా నియంత్రణ మరియు అభివృద్ధి మండలి(ఐఆర్‌డీఏఐ) నిబంధన విధించింది. ఇది 1 కంటే తక్కువగా ఉంటే, ఆ కంపెనీ వ్యాపారం చేయడం దుర్లభం అవుతుందని.. అలాగే 1.5 కంటే ఎక్కువగా ఉంటే కంపెనీ స్థితి ఆరోగ్యకరంగా ఉన్నట్లు అర్థం.
ఐపీఓకు వచ్చే ముందు బ్యాలెన్స్ షీట్‌ను ఆరోగ్యకరంగా మార్చుకునేందుకు, నష్టాలకు గురి చేస్తున్న 119 గ్రూప్ హెల్త్ పాలసీల నుంచి నేషనల్ ఇన్సూరెన్స్ వైదొలగింది. రీ-ఇన్సూరెన్స్, హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్ పాలసీల కోసం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు రూ. 895 కోట్ల రుణాన్ని జారీ చేయడం, మూలధన స్థితి మెరుగయ్యేందుకు తోడ్పడింది.

2016-17లో 90.53 శాతంగా ఉన్న కోర్ క్లెయిమ్స్ నిష్పత్తిని 85.98కి తగ్గించుకున్నామని నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సీఎండీ సనత్ కుమార్ చెబుతున్నారు. అయితే, రూ. 2126 కోట్ల ఐబీఎన్ఆర్(అడిషనల్ ఇన్‌కర్డ్ బట్ నాట్ రిజిస్టర్డ్) క్లెయిమ్స్ కారణంగా స్థూల క్లెయిమ్స్ నిష్పత్తి మాత్రం పెరిగింది. 2019 నాటికి మరో రూ. 2276 కోట్ల ఐబీఎన్ఆర్ క్లెయిమ్స్‌ను పరిష్కరించాల్సి ఉందని ఐఆర్‌డీఏఐ తెలిపింది.

వచ్చే ప్రీమియంలు, చెల్లించాల్సిన క్లెయిమ్‌లను పరిశీలిస్తే 2016-17 ఆర్థిక సంవత్సరంలో 134 శాతం గా ఉంది. ఇది 2015-16లో నమోదైన 132.27 శాతం కంటే అధికం. 2016-17లో ప్రీమియంలు 18.8 శాతం పెరగగా, అంతకు ముందు ఏడాది ఇది 6.5 శాతంగా మాత్రమే ఉంది. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరంలో రూ. 14282 కోట్ల ప్రీమియం ఆదాయం వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.
లిస్టింగ్‌కు ముందే కంపెనీ నెట్‌వర్త్ 9 శాతం పెరిగి రూ. 9544 కోట్లకు చేరుకుంది. అయితే, పన్ను తర్వాత లాభం రూ. 150 కోట్ల నుంచి రూ.49 కోట్లకు పరిమితమైంది.
2016 ఆర్థిక సంవత్సరంలో రూ. 25413 కోట్లుగా ఉన్న పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో గత ఆర్థిక సంవత్సరం చివరకు రూ. 21760 కోట్లకు చేరుకుంది. అయితే, పెట్టుబడుల ఆదాయం మాత్రం రూ. 20-30 కోట్లు తగ్గింది.

ప్రస్తుతం మోటార్, హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం 77 శాతంగా ఉండగా, దీన్ని 72 శాతానికి తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఆరోగ్య బీమాపై ఫోకస్ తగ్గించి ఇప్పటికే రూ. 840 కోట్ల విలువైన పాలసీలు కలిగిన పంట బీమా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఆరోగ్య బీమా వ్యాపారంలో నష్టాల నిష్పత్తి 114 శాతంగా ఉండగా, వాహన బీమా రంగంలో ఇది 100 శాతం కంటే తక్కువగానే ఉంది.Most Popular