స్టాక్స్‌లో పెట్టుబడులపై రామాయణం నుంచి ఏం నేర్చుకోవాలి ?

స్టాక్స్‌లో పెట్టుబడులపై రామాయణం నుంచి ఏం నేర్చుకోవాలి ?


స్టాక్ మార్కెట్‌ను ఒక బాక్సింగ్ రింగ్‌తో పోల్చుతున్నారు కోటక్ మ్యూచువల్ ఫండ్ ఎండీ నీలేష్ షా. ఎలాంటి దెబ్బలు తగలవు అనే ఆశలు, అంచనాలతో రింగ్‌లోకి ప్రవేశిస్తే, ఎప్పటికీ మ్యాచ్ గెలవడం సాధ్యం కాదని నీలేష్ అంటున్నారు. ఎందుకంటే ప్రత్యర్ధి నుంచి పారిపోవడం ప్రారంభించి, చివరకు ఆట వదిలేయడమే జరుగుతుందన్నది ఆయన వాదన.

“స్టాక్ మార్కెట్‌లో ప్రవేశించడం అంటేనే డౌన్‌సైడ్ రిస్క్‌కు కూడా సిద్ధపడినట్లే. దీనికి సిద్ధంగా లేకపోతే అసలు మార్కెట్ వైపే చూడద్దు. డౌన్‌సైడ్ చూడలేకపోతే, ఇది మీకు తగిన ప్లేస్ కాదని అర్ధం. మొదట మీకు నష్టాలను తీసుకునే మెచ్యూరిటీ ఉండాలి. ఆ తర్వాతే మార్కెట్ల నుంచి మీరు లాభాలు పొందగలరు” అని చెప్పారు నీలేష్ షా.

 

మార్కెట్లలోకి ప్రవేశించేందుకు ప్రధాన నియమం
మీరు రామాయణం తప్పకుండా చదవాలి, ఎందుకంటే దానిలో ఎలా డబ్బులు చేసుకోవాలనే విషయం రాసి ఉంటుంది. రామాయణంలో లంక.. అయోధ్యలలో ఖరీదైన నగరం ఏది? ఖచ్చితంగా లంక. అది బంగారు తాపడంతో చేసిన నగరం. లంకేయులు అంత సంపన్నులుగా మారడానికి కారణం ఏంటంటే.. వారు కుంభకర్ణుడి మాదిరిగా పెట్టుబడి చేశారు. కుంభకర్ణుడు మాదిరిగా ఈక్విటీలో పెట్టుబడి చేసి 14 ఏళ్ల పాటు దాన్ని వదిలిపెట్టారు. అందుకే వారు సంపన్నులుగా మారారు. ఇక్కడే రామాయణం ఒక పరిష్కారం అందించింది. 

 

99 శాతం పడిపోయిన స్టాక్స్
అవును, లంక దహనం అయిపోయింది. కానీ ఎప్పుడు? పూర్తిగా వాటి స్థాయి, పరపతి కోల్పోయిన స్టాక్స్ ఎంచుకున్నపుడు.. చెడ్డ ప్రమోటర్‌తో ప్రయాణం చేసినపుడు.. సరికాని రంగాన్ని ఎంచుకున్నపుడు మాత్రమే. ఇలాంటివి చేస్తూ డబ్బులు నష్టపోతున్నపుడు, ఆ భగవంతుడు కాపాడలేకపోవచ్చు.

 

బ్యాడ్ న్యూస్‌కి రెడీగా ఉండాలా?
జీవితంలో మనం స్కోర్ చేసేందుకు ఎప్పుడూ ఒక అవకాశం వస్తుంది. ఉదాహరణకు క్రికెట్ మ్యాచ్‌లను తీసుకుంటే.. సచిన్ టెండూల్కర్ ఆ స్థాయికి చేరాడంటే.. ఆయనకు సిక్స్‌లు, ఫోర్‌లు కొట్టడానికి అన్ని హాఫ్-వాలీ బాల్స్ ఎదురయ్యాయా? లేదు కదా! తనను గాయపరిచే బౌన్సర్స్‌ను కూడా సచిన్ కూడా ఎదుర్కొన్నాడు. ఆయా బౌన్సర్లు ఆయన ప్రాణాలు తీసే స్థాయిలో వచ్చినా, స్థైర్యంగా ఎదుర్కొన్నాడు. ఒక వేళ మీరు క్రికెట్ పిచ్‌ను స్టాక్ మార్కెట్ మాదిరిగా భావిస్తే, కేవలం హాఫ్-వ్యాలీలు మాత్రమే రావాలి.. వచ్చినపుడల్లా షాట్స్ కొట్టాలంటే సాధ్యం కాదు. మీరు బౌన్సర్లను ఫేస్ చేయాలి. ఒకవేళ మీరు ఏకలవ్యులు కాకుంటే, మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండడమే నయం.

 

సెస్సెక్స్ రోజూ చూడండి లేదా ఎస్ఐపీ చేసి మిన్నకుండండి !
ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ బాగా ఊపందుకుంది. ఎంతో కఠోర శ్రమ అనంతరం లాంగ్-టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అనుకూలంగా మారింది. ఇవాల్టి రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నుంచి వాచ్‌మన్ వరకూ ప్రతీ ఒక్కరూ టీవీల్లో కనిపించే ఎనలిస్టులను గుర్తు పడుతున్నారు. అలాగే ఎస్ఐపీల గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నారంటే.. దీని విస్తృతి అర్ధమవుతుంది.

 

సంపద సృష్టి
ఏదైనా వార్షిక సర్వ సభ్య సమావేశానికి వెళ్లినపుడు, స్టాక్ పెర్ఫామెన్స్‌పై మేనేజ్మెంట్‌ను అభినందించే వ్యక్తులను అరుదుగా చూస్తాం. స్టాక్ పెర్ఫామెన్స్ గత 25 ఏళ్లలో మంచి కంపెనీలు సృష్టించిన సంపద విలువ తెలుసుకుంటే ఆశ్చర్యం వేయడమే కాదు.. మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇన్ఫోసిస్, మాస్టెక్ వంటివాటిని చూస్తే 4250 రెట్లు రాబడులు వచ్చాయంటే.. అదేమీ చిన్న సంఖ్య కాదు. దీర్ఘ కాల సంపద సృష్టికి దీర్ఘకాల పెట్టుబడులు ఒక్కటే మార్గం. ఈ తరంలో పుట్టినందుకు మనకి మనం అదృష్టవంతులుగా భావించాలి. ప్రస్తుతం మన ఆర్థిక రంగం 200 బిలియన్ డాలర్ల నుంచి 2 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. ఒక తరంలో ఒక దేశం 10 రెట్లు పెరగడం ఎంతో అరుదైన విషయం.

 

క్రమం తప్పకుండా పెట్టుబడులు చేయాల్సిన అవసరం
మొదటగా మార్కెట్ ఎక్కడికి వెళుతుందనే విషయం మీకు తెలియదనే వాస్తవాన్ని అంగీకరించాలి. ఈ విషయం అర్ధమైతే, క్రమం తప్పకుండే చేసే పెట్టుబడుల ద్వారా ప్రయోజనం పొందవచ్చు. మన ఆరోగ్యం కోసం బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం. ఇది శరీరం కోసం చేసే క్రమం తప్పని పెట్టుబడి. వారానికి ఒక రోజు తిని.. మిగిలిన అన్ని రోజులు ఉత్పాదకత కోసం ప్రయత్నించేవారు ఎవరూ ఉండరు. శారీరక ఆరోగ్యం కోసం ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో, ఆర్థిక ఆరోగ్యం కూడా అదే చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్రేక్‌ఫాస్ట్ పెట్టుబడి, లంచ్ పెట్టుబడి, డిన్నర్ పెట్టుబడి చేయాలి. ఇది రోజు వారీ ట్రేడింగ్ గురించి చెబుతున్న విషయం కాదు.. నెలవారీ ఎస్ఐపీల గురించి అని అర్ధం చేసుకోవాలి.

 

ఆస్తుల కేటాయింపు ప్రాముఖ్యత
సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఎలాంటిదో ఆస్తుల కేటాయింపు అంతే ముఖ్యం. మన సంస్కృతి, మన ఆహారం, ఇంటి భోజనాలను పరిశీలిస్తే సమతుల్యమైన ఆహారం కనిపిస్తుంది. పప్పు, అన్నం, రోటి, కూరలతో పాటు కొందరు స్వీట్ కూడా తీసుకుంటారు. కొందరు మాత్రం స్వీట్ ఒక్కటే ఆహారంగా తీసుకుంటామంటారు. కానీ ప్రొటీన్స్, కార్బొహైడ్రేట్స్, విటమిన్స్ అన్నీ సరిపడేలా ఉంటేనే రుచితో పాటు ఆరోగ్యం కూడా అందుతుంది.

 

పెట్టుబడిలో ఆస్తుల కేటాయింపునకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అభివృద్ధిని సృష్టించేందుకు కొంత ఈక్విటీ అవసరం. నిలకడ చూపే కొంత ఫిక్సెడ్ ఆదాయం అవసరం. ఒకవేళ దేశంలో ఏదైనా అనుకోని అవాంతరం ఏర్పడితే, గ్లోబల్ కరెన్సీ ఆధారంగా రిటర్న్ ఇచ్చే కొంత బంగారం అవసరం. నిలకడగా రాబడి అందించేందుకు పెట్టుబడి సాధనం అయిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా అవసరం. అందుకనే రియల్ ఎస్టేట్, బంగారం, ఇతర కమాడిటీలు, స్థిరమైన ఆదాయం, ఈక్విటీలలో పెట్టుబడుల ద్వారా నిలకడగా ఆదాయం పొందంచ్చు. మార్కెట్ ఒడుదుడుకులను మించి సంపద సృష్టించుకోవచ్చు.
 Most Popular