ఫండ్స్‌‌ పెట్టుబడుల్లో ఈ తప్పులు చేయకండి!!

ఫండ్స్‌‌ పెట్టుబడుల్లో ఈ తప్పులు చేయకండి!!


మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు ఇప్పుడు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లను నిరంతరం గమనిస్తూ, పోర్ట్‌ఫోలియోలోని  ప్రతీ స్టాక్‌ను గమనించలేకపోవడం, ఈక్విటీ పెట్టుబడులు చేయాలనే ఉత్సాహం ఉన్నా మార్కెట్లపై అంతగా అవగాహన లేకపోవడం వంటివి మదుపర్లను మ్యూచువల్ ఫండ్స్‌ వైపు నడిపిస్తున్నాయి.

 

మరోవైపు ఎస్ఐపీ ద్వారా పెట్టుబడులు చేసే అవకాశం ఉండడం, ఈ విధానం ద్వారా నష్టపోయే పరిస్థితులు తక్కువగా ఉండడం వంటివి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు గణనీయంగా పెరిగేందుకు కారణం అవుతున్నాయి. అయితే ఇలా ఫండ్స్‌లో పెట్టుబడులు చేయడంలో కొన్ని తప్పిదాలు ఉంటాయి. వీటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. సహజంగా మ్యూచువల్ ఫండ్ మదుపర్లు చేసే మిస్టేక్స్ జాబితా ఓసారి చూద్దాం.

 

పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ ఫండ్స్
నేను సరైనా ఫండ్‌నే ఎంపిక చేసుకున్నానా? చాలా మందికి ఎదురయ్యే ప్రధానమైన ప్రశ్న ఇదే. పోర్ట్‌ఫోలియోను పరిశీలిస్తే టాప్ పెర్ఫామింగ్ మ్యూచువల్ ఫండ్స్ కొన్ని కనిపిస్తాయి. కొన్ని సార్లు ప్రతీ విభాగంలోను ఇలాంటివి ఉండొచ్చు. మంచి రాబుడులు ఇచ్చినా కొన్నిసార్లు ఇలాంటివి ఇన్వెస్టర్ ప్రొఫైల్‌కు తగినవి కాకపోవచ్చు. 


ప్రతీ వారం విభిన్నమైన ఫండ్స్‌ను పరిశీలించడం, మరీ ఎక్కువగా పోర్ట్‌ఫోలియోను రీస్ట్రక్చర్ చేయడం సరికాదు. కొన్ని ఫండ్స్ మాత్రమే, అంటే నాలుగైదు ఫండ్స్ మాత్రమే ఎక్కువగా ప్రయోజనం చేకూర్చవచ్చు.

 

ఈ ఫండ్‌ని ఏం చేయాలి?
ప్రస్తుతం ఈ ఫండ్‌ను అమ్మేయాలా? తరచుగా వినిపించే మరో ప్రశ్న ఇది. ఓ వారం పాటో.. నెల రోజుల సమయానికో ఓ ఫండ్ సరిగా పెర్ఫామ్ చేయకపోవచ్చు. ఆ ఫండ్‌కు చెందిన సెక్టార్‌కు ఏదైనా ప్రతికూలమైన వార్త వచ్చినపుడు నెగిటివ్‌గా రియాక్ట్ కావచ్చు. అలాంటపుడు మార్కెట్ ప్రాథమిక సూత్రాలను గుర్తు చేసుకోవాలి. 

 

ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు చేసేటపుడు 5 నుంచి 7 సంవత్సరాల పాటు ఎదురుచూసేందుకు సిద్ధంగా ఉండాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక వారం పాటు అండర్‌పెర్ఫామ్ చేస్తే.. దానికి భయపడకూడదు. ఈ పరిస్థితి ఏడాదికి పైగా కొనసాగితే మాత్రమే, ఫండ్ మార్పు విషయంలో ఆలోచన-నిర్ణయం చేయాలి. 

 

రాబడులు ఇచ్చే ఫండ్స్‌ వెంటపడడం
ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ మైక్రోక్యాప్ ఫండ్స్ కోరుకుంటున్నారు. అప్పుడే మార్కెట్లలో అడుగు పెట్టిన వ్యక్తి నుంచి, అనుభవజ్ఞుడైన ఇన్వెస్టర్ వరకు ప్రతీ ఒక్కరూ కళ్లు చెదిరే రిటర్న్స్ ఇచ్చే మైక్రో క్యాప్ స్కీమ్స్‌ కోసం చూస్తున్నారు.

 

అయితే, ఇందుకు అవకాశం ఉన్నా తీవ్రమైన ఒఢిదుడుకులకు సిద్ధంగా ఉండి, సుదీర్ఘ కాలం ఎదురు చూడగల సామర్ధ్యం ఉండాలి. లేకపోతే ఇలాంటి ఫండ్స్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. 

 

మనీ మ్యాజిక్ ఫార్ములా 
లాభాలు బుక్ చేసుకోవడం, క్యాష్‌తో సిద్ధంగా ఉండడం, ఎస్‌టీపీలను ప్రారంభించడం.. చాలామంది అడ్వైజర్లు ఇలాంటి రకరకాల సలహాలతో కొత్త ఫార్ములాలను కనిపెట్టేసి, సంపదను వీలైనంతగా పెంచేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతుంటారు. కొందరు ఇన్వెస్టర్లు వీటి ఉచ్చులో పడిపోతుంటారు కూడా. ఇలాంటి కొన్ని ఫార్ములాలు అందరికీ వర్తించకపోవచ్చు.

 
నిజానికి సంపదను సృష్టించేందుకు ఒకే ఒక మ్యాజిక్ ఫార్ములా ఉంది. రెగ్యులర్‌గా మదుపు చేయడం, చిన్న మొత్తమైనా పొదుపు చేయడం, మార్కెట్ల పరిస్థితులు-మార్పులతో సంబంధం లేకుండా సుదీర్ఘ కాలంపాటు ఎదురుచూడడం. ఇదే మనీ మేకింగ్ మ్యాజిక్ ఫార్ములా. మిగిలినవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు.

 

పర్ఫెక్ట్ టైం కోసం ఎదురుచూడడం
మార్కెట్ ఆల్‌టైం హై స్థాయిలో ఉంది కదా! ఇప్పుడు నేను మార్కెట్ పడే వరకూ ఎదురుచూడాలా? మార్కెట్ ఊగిసలాడుతోంది.. పెట్టుబడులను వాయిదా వేసుకోవాలా వంటి అనుమానాలు తలెత్తుతూనేఉంటాయి. పెట్టుబడులను ప్రారంభించడానికి ఇదే పర్ఫెక్ట్ టైం అనేందుకు ఏ సమయమూ ఉండదు. మీరు ఒక ఆర్థిక లక్ష్యం కోసం పెట్టుబడి చేస్తున్నపుడు, ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. 

 

ముఖ్యంగా రిటైర్‌మెంట్ ప్లాన్‌ను ఎప్పటికీ వాయిదా వేసుకోకూడదు. కార్పస్ ఫండ్ సృష్టించుకునేందుకు మీకు 15-20 ఏళ్ల కాలం మాత్రమే ఉంటే, మీరు మార్కెట్ పరిస్థితుల గురించి ఆలోచించకూడదు.

 

క్రమంగా పెట్టుబడులు చేయడం.. సుదీర్ఘ కాలం ఎదురు చూడాలని ముందే నిర్ణయించుకుని అమలు చేయడం.. కార్పస్‌ను క్రియేట్ చేసేందుకు ఇదొక్కటే మార్గం.Most Popular