ఐదు నెలల గరిష్టానికి మార్కెట్లు....! బ్యాంక్‌ నిఫ్టీ రికార్డ్‌!!

ఐదు నెలల గరిష్టానికి మార్కెట్లు....! బ్యాంక్‌ నిఫ్టీ రికార్డ్‌!!

రోజు మొత్త సానుకూలంగా కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి పటిష్ట లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి 167 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్‌ 28,469 వద్ద నిలిచింది. ఇది ఐదు నెలల గరిష్టంకాగా.. తొలుత ఒక దశలోలో 28,721 వరకూ జంప్‌చేసింది. నిఫ్టీ సైతం 44 పాయింట్లు జమ చేసుకుని 8,822 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో దాదాపు 8,900కు చేరువైంది. ప్రధానంగా ప్రయివేట్‌ రంగ బ్యాంకు షేర్లకు డిమాండ్‌ ఏర్పడటంతో ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ బ్యాంక్‌ తొలిసారి 21,000 మార్కును తాకింది. చివరికి 20,551 వద్ద ముగిసింది. మరోపక్క బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌ 12,127 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది.  
ఫార్మా జోరు 
నేటి ట్రేడింగ్‌లో ఫార్మా కౌంటర్లకు భారీ డిమాండ్‌ కనిపించింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా రంగం అత్యధికంగా 2 శాతం జంప్‌చేయగా.. బ్యాంక్‌ నిఫ్టీ 1.5 శాతం ఎగసింది. అయితే ఐటీ 1 శాతం, మెటల్‌ 0.7 శాతం చొప్పున క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో సన్‌ ఫార్మా 3.7 శాతం జంప్‌చేయగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3.6 శాతం ఎగసింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ఉన్న నిషేధాన్ని తాజాగా ఆర్‌బీఐ ఎత్తివేయడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒక దశలో 7 శాతం దూసుకెళ్లింది. తద్వారా బ్యాంక్‌ మార్కెట్ విలువ రీత్యా రెండో ర్యాంకుకు చేరింది. కాగా, మిగిలిన బ్లూచిప్స్‌లో ఐసీఐసీఐ, గెయిల్‌, సిప్లా, బీపీసీఎల్‌, భారతీ తదితరాలు 2-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇన్ఫ్రాటెల్‌, హిందాల్కో, ఐడియా, విప్రో, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హీరోమోటో తదితరాలు 4-1 శాతం మధ్య డీలాపడ్డాయి.Most Popular