రెండో అతి విలువైన సంస్థ.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌!

రెండో అతి విలువైన సంస్థ.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌!

నేటి ట్రేడింగ్‌లో మార్కెట్‌ క్యాపిటలైజేషన్ రీత్యా రెండో అత్యంత విలువైన కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రికార్డు సృష్టించింది. తొలుత బీఎస్‌ఈలో 7 శాతంపైగా జంప్‌చేయడం ద్వారా షేరు ధర రూ. 1450ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. తద్వారా రూ. 3.64 కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్( విలువ)ను సాధించింది. వెరసి టాటా గ్రూప్‌ దిగ్గజం టీసీఎస్‌ తదుపరి ర్యాంకులో ఈ ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం నిలిచింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో టీసీఎస్‌ మార్కెట్‌ విలువ రూ. 4.76 లక్షల కోట్లుకాగా.. ముకేష్‌ అంబానీ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విలువను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అధిగమించింది. ప్రస్తుతం ఆర్‌ఐఎల్‌ మార్కెట్ క్యాప్‌(విలువ) రూ. 3.45 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువను ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే సంగతి తెలిసిందే.
ఆర్‌బీఐ ఎఫెక్ట్‌
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకున్న పరిమితులను తొలగిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ పేర్కొనడంతో ఈ కౌంటర్‌కు ఉన్నట్టుండి భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ఇంట్రాడేలో రూ. 1450 వద్ద గరిష్టాన్ని తాకింది. దీంతో 2017లో మొత్తంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు 18 శాతం పురోగమించింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 7 శాతమే లాభపడింది. ఇక ఇదే సమయంలో ఆర్‌ఐఎల్‌ 1 శాతం నష్టపోగా.. టీసీఎస్‌ 2 శాతం బలపడింది. కాగా.. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ మొత్తం విలువ రూ. 6 లక్షల కోట్లను దాటింది. గృహ రుణ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్‌ విలువ రూ. 2.25 లక్షల కోట్లుకాగా, గృహ్‌ ఫైనాన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ దాదాపు రూ. 14,000 కోట్లుగా ఉంది.
టాప్‌ ఫైవ్‌...
మార్కెట్‌ క్యాప్‌ రీత్యా టాప్‌ -5 ర్యాంకులు ఎలా ఉన్నాయంటే.. 1. టీసీఎస్‌ (రూ. 4.76 లక్షల కోట్లు), 2. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(రూ. 3.64 లక్షల కోట్లు), 3. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(రూ. 3.45 లక్షల కోట్లు), 4. ఐటీసీ(రూ. 3.24 లక్షల కోట్లు), 5. ఓఎన్‌జీసీ(రూ. 2.48 లక్షల కోట్లు).Most Popular