వారెన్ బఫెట్‌కు ఈ రంగంపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొస్తోంది !

వారెన్ బఫెట్‌కు ఈ రంగంపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొస్తోంది !

ఇన్వెస్ట్‌మెంట్ గురుగా ప్రపంచం మొత్తం కీర్తించే వారెన్ బఫెట్ తాజాగా ఒక రంగంపై అమితమైన మక్కువను పెంచుకుంటున్నారు. ఇంతకాలం ఆ రంగాన్ని ఆయన ఓ 'డెత్ ట్రాప్'గా అభివర్ణించారు. 
తాజాగా అమెరికన్ ఎయిర్‌లైన్ కంపెనీ అయిన సౌత్ వెస్ట్‌లో 2.15 బిలియన్ డాలర్లు, డెల్టా అనే సంస్థలో మరో 3 బిలియన్ డాలర్ల నిధులను కుమ్మరించారు. తాజాగా బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథ్‌వే అనే సంస్థ ఎయిర్ లైన్ సంస్థల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులను వెచ్చిస్తోంది. ఇప్పటికే యునైటెడ్ అనే సంస్థలో
 ఆయన చాలాకాలం క్రితం పెట్టుబడి పెట్టినప్పటికీ అది పెద్దగా ఫలితాన్ని అందించలేదు. అందుకే 2013లో జరిగిన ఓ యాన్యువల్ మీటింగ్‌లో ఈ ఇండస్ట్రీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

మరి ఇప్పుడేం మారింది ?
అన్నింటికంటే ముఖ్యంగా 2016 నుంచి క్రూడాయిల్ ధరలు 50 శాతం వరకూ పతనమయ్యాయి. ఇది 2013లో ఉన్న ధరల కంటే తక్కువే కావడం గమనించాల్సిన అంశం. సాధారణంగా చౌకగా వచ్చే జెట్ ఫ్యూయల్ ఎయిర్ లైన్ కంపెనీల లాభాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. అందుకే వివిధ ఎయిర్ లైన్ సంస్థలు ఈ మధ్య మంచి లాభాలను ప్రకటించాయి. 

గత రెండేళ్ల కాలంలో అమెరికన్, డెల్టా, యునైటెడ్, సౌత్ వెస్ట్ అనే సంస్థలు రికార్డ్ స్థాయి లాభాలను నమోదు చేశాయి. వీటితో పాటు వివిధ యూఎస్ ఎయిర్ లైన్ సంస్థలు తర్వాతి తరం ఎయిర్‌క్రాఫ్టులు(నెక్స్ జెన్), ఇంటీరియర్స్, టెక్నాలజీలపై భారీగా పెట్టుబడులు పెట్టాయి. తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించగలిగే ఫ్యూయల్ ఎఫిషియంట్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ ఎ350, బోయింగ్ 737 మ్యాక్స్, బొంబార్డియర్ సి సిరీస్‌లను కొనుగోలు చేస్తున్నారు. వీటికి అదనంగా బిజినెస్ క్లాస్ ట్రావెలర్స్ కోసం  అమెరికన్, డెల్టా, యునైటెడ్ సంస్థలు ప్రీమియం క్యాబిన్ సీటింగ్, ఇతర అధునాతన సౌకర్యాలకూ ఎక్కువగానే ఖర్చు చేశాయి. ఇవన్నీ కలిసి లగ్జరీ, ఎఫిషియన్సీ, కనెక్టివిటీ విషయంలో గతంతో పోలిస్తే... మెరుగైన పనితీరునే కనబరుస్తూ వస్తున్నాయి. మొత్తానికి యూఎస్ ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ ఎవరూ ఊహించనంత వేగంగా, ఊహించనంత స్థాయిలో వృద్ధి చెందింది. 


అయితే ఇదే సీన్‌ ఇండియా లాంటి దేశంలో కూడా రిపీట్ అవుతుందా ? తక్కువ మార్జిన్లతో కొట్టుమిట్టాడుతున్న కంపెనీలు అధిక లాభాల బాటలో పయనించగలవా ? ప్రస్తుతానికైతే ఇది చిక్కు ప్రశ్నే. అయితే ఇన్వెస్ట్‌మెంట్‌కు ఈ రంగం ఎప్పటికీ పనికిరాదు.. అని నిపుణులంతా ఒకప్పుడు పక్కనపారేసిన సెక్టార్ ఇప్పుడు తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. సైకిల్‌లో ట్రెండ్ రివర్స్ చేసేందుకు చూస్తోంది. 


 Most Popular