ఇదేం రాజకీయం

ఇదేం రాజకీయం

ఇంకెంత కాలం, ఇంకెంతమంది సలహాలు తీసుకుంటారు. ఇదీ ఇప్పుడు తమిళనాడులో విన్పిస్తున్న ప్రశ్న..తెలుగునాట మీడియాలో బ్రేకింగులతో హడావుడి అవుతున్న ఇన్‌డైరక్ట్  కాన్సెప్ట్. ఐతే ఇది ఎంతో కాలం సాగుతూ పోతే వ్యూయర్స్‌కి కూడా బోర్ కొట్టేస్తుంది.అందుకే ఛానళ్లు కూడా ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టేస్తే తమకీ బావుంటుందని..లేకపోతే తామైనా ఈ వార్త వదిలేసి రెగ్యులర్ బిజినెస్‌లో పడిపోవాలని సిధ్దమయ్యాయ్. ఐతే ఈలోపే వీలైనంతగా ఇందులో జనాలకి ఆసక్తి కలిగిస్తాయనుకుంటూ వార్తలను వండి వార్చుతున్నాయ్. ఆ క్రమంలో శశికళ జైలుజీవితంలో ఏరోజు ఏ ఫుడ్ తినబోతోంది..ఎంత బరువు టిఫిన్  పెడతారులాంటి చవకబారు వార్తలనూ బ్రేకింగుల రూపంలో ఇస్తూ తరించిపోతోంది. అసలు ఓ ఖైదీ ఏ రోజు ఏం తింటాడో ఏం పెడతారో వంటి వార్తలతో విస్త్రతప్రజాప్రయోజనం ఏంటో ఆ బ్రేకింగులు, కథనాలు ఇస్తున్నవారికి తెలియాలి. ఆస్తుల కేసులో అంతా అక్రమసంపాదనే అని తేలడంతో చనిపోయిన జయలలిత బతికిపోతే..బతికున్న శశికళ రాజకీయజీవితం కొన్నాళ్లపాటు సమాధి అయింది..ఐనా ఉక్రోషంతోనో, రోషంతోనో, చెక్కుచెదరని మొండితనంతోనో శశికళ శపథం చేసి మరీ జైలుకి వెళ్లిపోయింది... మరి సీన్ ఇక్కడ కట్ చేస్తే..నెక్ట్స్ ఎవరు ముఖ్యమంత్రి?

ఈ  ప్రశ్నకి సులభమైన సమాధానం కన్పిస్తున్నా..అక్కడి గవర్నర్ మాత్రం ఇంకా చర్చిస్తూనే ఉన్నారట. న్యాయనిపుణులతో సంప్రదింపులు చేస్తున్నారట.ఆయనకి క్లారిటీ లేదో..లేక పైనుంచి ఆదేశాలు అందాలో కానీ రాజీనామా చేసిన తర్వాత కూడా పదిరోజుల పాటు ముఖ్యమంత్రి పీఠంపై పన్నీర్ సెల్వమే ఉన్నారు.పొరుగురాష్ట్రంలో ముఖ్యమంత్రి  ఎవరైనా మనకి ప్రత్యేకంగా ఒరిగేదేం లేదు. ఐనా బిజెపి తాపత్రయం చూస్తే ఆశ్చర్యంతో కూడిన అసహనం కలగకమానదు.వాళ్లు చెప్తున్నట్లే అక్కడ గవర్నర్ పెద్ద గండమే తప్పించారు. నేరచరితులను పీఠంపై కూర్చోనివ్వకుండా వ్యూహాత్మక జాప్యమే చేశారు..మరిప్పుడైనా కాస్త పని చేయాలి కదా. రాజ్ భవన్లో కూర్చుని ఓ నాలుగు కాన్వాయ్‌లలో ఎవరో ఒకరు అడ్డపంచెలు కట్టుకుని రావడం నాకు ఇంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కాగితం చూపించడం..ఆ తర్వాత పన్నీర్ సెల్వం ముందు నాకే అవకాశం ఇప్పించండంటూ వెళ్లడం ఇదే తంతు సాగుతోంది. ఇంకో నాలుగు రోజులు పోతే, ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రే ఫుల్‌టైమ్..ఆయనుండగా ఇంకోరికి అవకాశం లేదనుకునేవరకూ సిచ్యుయేషన్ వెళ్తుందేమో. ఎందుకంటే
రిసార్ట్స్ రాజకీయం క్లైమాక్స్‌కి వచ్చింది. ఎన్ని రోజులు ఇలా మురగబెట్టినా..చివరికి ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వకతప్పదు. మరి ఇది తెలిసి కూడా ఇలా తాత్సారం చేస్తున్నారంటూ ఇంకెంతమంది కృష్ణులు లైన్లో ఉన్నారో అనుకోవాలేమో 

ఈలోపు మన పేపర్లు యధాశక్తి కేంద్రం, గవర్నర్ చర్యలని తెలుగువారి దృష్టిలో ఓ గొప్ప కార్యంగా సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయ్. ఆలస్యం అమృతానికేనా అని ఒకరు వాక్రుస్తే..ఇంకొకరికి అంతా న్యాయనిపుణుల సలహా ప్రకారమే అంటూ శెలవిచ్చేశారు. ఏ తీర్పు వస్తే ఆ తీర్పుకి అనుకూలంగా విశ్లేషణలూ వెల్లువెత్తాయ్. జ్ఞాపకశక్తి బాగా ఉన్నవారికి ఈ వ్యవహారం 1995 ఆగస్ట్‌లో ఎన్టీఆర్-చంద్రబాబు వర్గాలు మొహరించిన తీరు గుర్తుకురాకమానదు. అప్పుడు ఎమ్మెల్యేలంతా చంద్రబాబు వెనుకే ఉన్నారంటూ ముఖ్యమంత్రిని చేస్తే..ఇక్కడ మాత్రం లేదు లేదు జనమంతా పన్నీర్ సెల్వం వెంట ఉన్నారు..ఎమ్మెల్యేలను బంధించారంటూ కథనాలు జనాల మీద దాడి చేస్తున్నాయ్. అలానే వైఎస్ చనిపోయిన తర్వాత జగన్‌కి్ మద్దతుగా 156మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేస్తే..దాన్ని కనీసం సోదిలోకి కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ అధిష్టానం రోశయ్యనే సిఎంని చేసింది. ఆ తర్వాతే శాసనసభాపక్షనేతగా రోశయ్యని ఎన్నుకున్నారు తప్ప ముందు సిఎల్పీ లీడర్‌గా ఎన్నికై తర్వాత సిఎం కాలేదాయన. అచ్చంగా ఇప్పుడు కూడా ఓ అదృశ్య హైకమాండ్ ఏదో ఎమ్మెల్యేల మద్దతున్నవారిని కాకుండా తమకి ఇష్టమైన నేతనే తమిళనాడు సిఎంగా నిలబెట్టాలని చూస్తోందని విమర్శలున్నాయ్. చూద్దాం ఇదెన్నాళ్లు సాగదీస్తారో?Most Popular