నేటి నుంచే బిఎస్ఈ ఐపిఓ. మీరు రెడీయా ?

నేటి నుంచే బిఎస్ఈ ఐపిఓ. మీరు రెడీయా ?

ఆసియాలోనే అత్యంత పురాతనమైన బొంబాయి స్టాక్‌  ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ) పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. ఇప్పుడు సంస్థాగత ఇన్వెస్టర్లు, సంపన్న వర్గాలతోపాటు, ఇటు సాధారణ ఇన్వెస్టర్లు కూడా ఎక్స్ఛేంజీలో వాటా పొందవచ్చు. ఈ నెల 23వ తేదీతో ప్రారంభమయ్యే ఇష్యూ 26వ తేదీతో ముగుస్తోంది. ఇందుకు షేరుకి రూ. 805-806 ధరను ప్రైస్‌బ్యాండ్‌గా ప్రకటించింది. తద్వారా రూ. 1,243 కోట్ల(18.2 కోట్ల డాలర్లు)ను సమీకరించే అవకాశముంది. 
2017లో తొలి ఐపీవో
బీఎస్‌ఈలో ఇప్పటికే పెట్టుబడిదారులైన సింగపూర్‌ ఎక్స్ఛేంజీ, ఎటికస్‌ మారిషస్‌, జార్జ్‌సొరోస్‌కు చెందిన క్వాంటమ్‌ వంటి సంస్థలు 15.4 మిలియన్‌ షేర్లను అమ్మకానికి ఉంచనున్నాయి. ఇష్యూ ఈ నెల 23న మొదలై 25న ముగియనుంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా బీఎస్‌ఈ విలువ రూ. 4,400 కోట్లకు చేరనుంది. 2017లో వస్తున్న తొలి పబ్లిక్‌ ఇష్యూ ఇదికాగా, 2016లో వివిధ కంపెనీలు గత ఆరేళ్లలోనే అత్యధికంగా 400 కోట్ల డాలర్లను(సుమారు రూ. 26,000 కోట్లు) సమీకరించిన విషయం విదితమే.
అతిపురాతన ఎక్స్ఛేంజీ
ఆసియాలోనే అతిపురాతనమైన బీఎస్‌ఈ 1875లో ఏర్పాటైంది. ఎక్స్ఛేంజీల లిస్టింగ్‌కు దేశీయంగా స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో బీఎస్‌ఈ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టడం ఆలస్యమైంది. ఎడిల్‌వీజ్‌, యాక్సిస్‌ కేపిటల్‌, నోమురా, మోతీలాల్‌ ఓస్వాల్‌ తదితర సంస్థలు ఐపీవోను నిర్వహించనున్నాయి. బీఎస్‌ఈ షేర్లు తీవ్ర పోటీ ఇస్తున్న ప్రత్యర్థి సంస్థ నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలోనే లిస్ట్‌కానుండటం విశేషం. సొంత ఎక్స్ఛేంజీలో షేర్లు లిస్టయ్యేందుకు చాన్స్‌ లేకపోవడమే దీనికి కారణం. అయితే బీఎస్‌ఈ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ పర్మిటెడ్‌ టు ట్రేడ్‌ విభాగంలో లిస్టింగ్‌కు వీలుంటుంది. ఎన్‌ఎస్‌ఈలో బీఎస్‌ఈ షేర్లు ఫిబ్రవరి 3న లిస్ట్‌కావచ్చని అంచనా. కాగా, బీఎస్‌ఈలో బాటలో డిపాజిటరీ సంస్థ సీడీఎస్‌ఎల్‌, ఎన్‌ఎస్‌ఈ సైతం పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఈ రెండు సంస్థలూ మార్కెట్ల నియంత్రణ సెబీకి ఐపీవో అనుమతి కోరుతూ దరఖాస్తు చేశాయి. సీడీఎస్‌ఎల్‌లో బీఎస్‌ఈకి 50 శాతం వాటా ఉంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 26 శాతం వాటాను విక్రయానికి ఉంచే ప్రణాళికల్లో బీఎస్‌ఈ ఉంది.Most Popular