రెండు నెలల గరిష్టానికి మార్కెట్లు - మెటల్‌, బ్యాంకింగ్‌ హవా!!

రెండు నెలల గరిష్టానికి మార్కెట్లు - మెటల్‌, బ్యాంకింగ్‌ హవా!!

ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందనప్పటికీ దేశీయంగా బలపడిన సెంటిమెంటుతో మార్కెట్లు మరోసారి లాభపడ్డాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్ 241 పాయింట్లు ఎగసి 27,140 వద్ద నిలవగా, నిఫ్టీ 92 పాయింట్లు జంప్‌చేసి 8,381 వద్ద స్థిరపడింది. ఇది రెండు నెలల గరిష్టంకాగా, మెటల్‌, బ్యాంకింగ్‌ దిగ్గజాలు మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. నెల రోజుల ముందుగానే సార్వత్రిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో అంచనాలు కూడా పెరిగాయని, దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, చివర్లో నిఫ్టీ 100 పాయింట్లకుపైగా పురోగమించడం విశేషం!
ఐటీ మినహా... అన్ని రంగాలూ!
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ యథాతథంగా నిలవగా, మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మెటల్‌ 4.3 శాతం జంప్‌చేసింది. మొత్తం స్టీల్‌ సామర్థ్యంలో 9 శాతానికి సమానమైన మధ్యస్థాయి ఫర్నేస్‌లను దేశవ్యాప్తంగా మూసివేసేందుకు చైనా నిర్ణయించడంతో మెటల్‌ షేర్లకు కిక్‌ లభించింది. దీనికి 2.3 శాతం జంప్‌చేసిన బ్యాంక్‌ నిఫ్టీ జత కలవడంతో మార్కెట్లు లాభాలతో పురోగమించాయి. కాగా, ఇటీవల లాభాల దౌడు తీస్తున్న షుగర్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనడం గమనించదగ్గ విషయం. 
ఇదీ లాభాల జోరు...
మెటల్‌ షేర్లలో జిందాల్‌ స్టీల్‌ 9.4 శాతం దూసుకెళ్లగా, నాల్కో, హిందాల్కో, సెయిల్‌, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌,  భూషణ్‌ స్టీల్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌, వేదాంతా, హిందుస్తాన్‌ జింక్‌, ఎన్‌ఎండీసీ 6-1.6 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇక వడ్డీ రేట్లు తగ్గుతున్న కారణంగా రుణాలకు డిమాండ్‌ ఊపందుకుంటుందన్న అంచనాలతో బ్యాంక్‌ షేర్లు లాభాల దౌడు తీశాయి. అటు ప్రయివేట్‌, ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు పుంజుకోవడంతో ఇండస్‌ఇండ్ 6.4 శాతం జంప్‌చేసింది. క్యూ3లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడం ఇందుకు దోహదపడగా.. బీవోబీ, యస్‌బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్, పీఎన్‌బీ, కెనరా, బీవోఐ,  కొటక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ, స్టేట్‌బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్ 4-1 శాతం మధ్య ఎగశాయి. కాగా, బ్లూచిప్స్‌లో బజాజ్‌ఆటో, హెచ్‌సీఎల్ టెక్‌, ఐటీసీ, ఆర్‌ఐఎల్‌ మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో 1-0.5 శాతం మధ్య నష్టపోయాయి.Most Popular