బడ్జెట్‌లో ఇవే కావాలట

బడ్జెట్‌లో ఇవే కావాలట

ఈ బడ్జెట్ లో ఎవరికేం కావాలి? చూడటానికి చిన్న ప్రశ్నే అయినా..భారతదేశమంతా విన్పించే ప్రశ్న ఇది. కొత్త బడ్జెట్‌లో సగటున చూస్తే ఉద్యోగాలు..లక్షలాది ఉద్యోగాలు కావాలనే స్వరాలే ఇపుడు ఎక్కువ విన్పిస్తున్నాయ్. బడ్జెట్‌ ప్రవేశానికి ఇంకా మూడు వారాల సమయం ఉంది..ఈ దశలో ఆర్ధికమంత్రిత్వశాఖకి హల్వా వండే ముహుర్తానికి ముందే దేశప్రజల్లో నెటిజన్లైన వారిలో చాలామంది తమ అభిప్రాయాలు ప్రతిపాదనలు పంపించారు..వాటన్నింటినీ వండివార్చగా తేలిందేంటి అంటే..ఆర్ధికమంత్రి రైతులపై ఎక్కువ దృష్టి పెట్టడంతో పాటుగా..ఏ రంగాల్లో ఉద్యోగాల కల్పన ఎక్కువగా కుదురుతుందో ఆయారంగాలకు కేటాయింపులు ఎక్కువ చేసి అభివృధ్ది బాటలో పయనించాలని కోరారు.


అలానే ట్విట్టర్ ‌పోల్ సంగతి చూసినా..వ్యవసాయరంగంపై ఎక్కువ  దృష్టి పెట్టాలనే ట్వీట్లే వచ్చాయ్. ఆ తర్వాతి రంగాల్లో యువత, పేదమహిళలు, చిన్నారుల సంక్షేమంపై ఫోకస్ పెట్టాలని కోరారు..ఈ ట్విట్టర్ పోల్‌లో ఎవరైనా తమ అభిప్రాయాలు ప్రతిపాదనలు పంపవచ్చు..ఇంకో రెండురోజుల పాటు ఈ అభిప్రాయసేకరణ ఉంటుంది. గ్రామీణ భారతం దేశంలో 50శాతం జనాభా గ్రామీణ భారతంలోనే ఉంది..ఆటోమేటిగ్గా వారికి మేలు చేకూరే రంగాలపై దృష్టి పెట్టాలనే అంశం అందరూ చెప్పేదే..ఐతే ఈసారి అరుణ్‌జైట్లీవారికేం చేయబోతున్నారన్నది ఆసక్తి కలిగించకమానదు.ఎందుకంటే డీమానిటైజేషన్ ఎఫెక్ట్‌తో రైతాంగం అల్లాడుతున్నదంటే అతిశయోక్తి కాదు..ఈరోజుకీ బ్యాంకుల దగ్గర పడిగాపులు గాస్తున్న జనంలో రైతులే ఎక్కువ.అలానే బ్యాంకింగ్ వ్యవస్థ తక్కువగా ఉన్నది కూడా ఈ ప్రాంతాల్లోనే..అందుకే వారికి ఊరటనిచ్చే పైపై పూతల బడ్జెట్ ఖచ్చితంగా ఆశిస్తున్నారు


మత్స్యసంపద,అటవీశాఖతో కలిసిన వ్యవసాయానికి జిడిపిలో సింహభాగం వాటా ఉన్నది. ఈ రంగాల శాతాన్ని లెక్కగడితే గత ఏడాది జిడిపిలో 15.35శాతంగా తెలుస్తోంది. మరి ఈ రంగాన్ని ఖచ్చితంగా ఆదుకుంటారనే వాదనలు విన్పిస్తున్నా..మితిమీరిన సబ్సిడీలు ఫిస్కల్ డెఫిసిట్‌ని పెంచుతాయనే వాదనా ఉంది..ఋణమాఫీలు, వడ్డీరద్దు వంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రపంచరేటింగ్ సంస్థలు డౌన్ గ్రేడ్ చేస్తాయనే భయాలు వెంటాడుతున్నాయ్. వచ్చే ఏడాదికి ఫిస్కల్ డెఫిసిట్‌ను 3.5శాతం(రూ.5.34లక్షలకోట్లు)గా నియంత్రించాలనే లక్ష్యం కేంద్రం ఇప్పటికే నిర్దేశించుకుంది. అలానే ఉద్యోగిత పెంచడానికి ఏ రంగాలపై దృష్టి పెట్టాలనే ప్రశ్నకి చాలామంది సూక్ష్మ,చిన్నతరహా వ్యాపార సంస్థలకు ఊతమివ్వాలని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఖర్చు తక్కువైన గృహనిర్మాణం, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ తయారీ, దుస్తుల తయారీ రంగాలకు ఆర్ధికసాయం చేస్తే ఆ రంగాల్లో ఉపాధి అవకాశాలు  ఎక్కువ అవుతాయని కూడా నెటిజన్లు  ట్విట్టర్లో ఓటింగ్ చేశారు.

ఐతే గత సంవత్సరం చివరి రోజునే ప్రధాని మోడీ ఈ దిశగా కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించారు..వాటికే ఇప్పుడు బడ్జెట్‌లో కేటాయింపులు ఉండొచ్చని అంచనాలున్నాయి. చిన్నతరహా వ్యాపార పరిశ్రమలకు ఆ ప్రోత్సాహకాలు మరింత పెరుగుతాయంటున్నారు. క్రెడిట్ గ్యారంటీని రెండుకోట్లకి పెంచుతామన్న ప్రధాని ప్రకటించిన నేపధ్యంలో ట్రస్టుల ద్వారా బ్యాంకుల్లో ఈ మూలధనం వ్యాపారసంస్థలకు ఋణాల రూపంలో అందవచ్చు. ప్రస్తుతానికి బడ్జెట్‌పై జనాలు వెల్లిబుచ్చిన అభిప్రాయాలు ఇవి..వీటికి ఏ మేర ప్రాతినిధ్యం దక్కుతుందో చూడాలి

 Most Popular