నవంబర్‌ 8 గరిష్టాలను అందుకున్న 182 స్టాక్స్‌!!

నవంబర్‌ 8 గరిష్టాలను అందుకున్న 182 స్టాక్స్‌!!

ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు(డీమానిటైజేషన్‌) చేపట్టిన 2016 నవంబర్‌ 8 నాటి గరిష్ట స్థాయిలకు తాజాగా బీఎస్‌ఈ-500 సూచీలో 182 స్టాక్స్‌ చేరుకున్నాయి. వీటిలో చంబల్‌ ఫెర్టిలైజర్స్‌, జీఎన్‌ఎఫ్‌సీ, ఆర్‌సీఎఫ్‌ వంటి ఎరువుల షేర్లతోపాటు ఫార్మా, షుగర్‌, ఆయిల్‌ షేర్లూ ఉన్నాయి. ఇటు డీమానిటైజేషన్‌, అటు అమెరికా ప్రెసిడెంట్‌గా ట్రంప్‌ ఎన్నిక, ఫెడ్‌ వడ్డీ పెంపు వంటి అంశాలు నవంబర్‌ తొలి వారం వరకూ బుల్‌ జోరులో సాగుతున్నదేశీ మార్కెట్లను ఉన్నట్టుండి దెబ్బకొట్టిన సంగతి తెలిసిందే. 
రెండు నెలల్లో...
గత రెండు నెలల్లో ఫార్మాస్యూటికల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, షుగర్‌, ఫెర్టిలైజర్‌ రంగ షేర్లు అత్యధికంగా 40 శాతం వరకూ లాభపడ్డాయి. నవంబర్‌ 8న ముగింపు 27,591తో పోలిస్తే సెన్సెక్స్ ఇప్పటికీ 3 శాతం వెనుకబడే ఉంది. నిజానికి సెన్సెక్స్‌ నవంబర్‌ 8 తరువాత దేశ, విదేశీ ప్రతికూల అంశాల కారణంగా ఆ నెల 21కల్లా దాదాపు 7 శాతం పతనమైంది. కనిష్టంగా 25,765ను తాకింది.
బ్లూచిప్స్‌లో...
రెండు నెలల క్రితంతో పోలిస్తే మార్కెట్లు వెనకబడి ఉన్నప్పటికీ ప్రస్తుతం కొన్ని బ్లూచిప్స్‌ నవంబర్‌ 8నాటి స్థాయిలకంటే అధిక స్థాయిలకు చేరి ట్రేడవుతుండటం చెప్పుకోదగ్గ విశేషం. వీటిలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మారుతీ సుజుకీ, యస్‌బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా పవర్‌ తదితర 16 స్టాక్స్‌ ఉన్నాయి. కాగా, అదానీ గ్రూప్‌లోని అదానీ పవర్‌, ట్రాన్స్‌మిషన్‌, ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు ఈ రెండు నెలల్లో 20 శాతానికిపైగా లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్‌ మాత్రం 2 శాతం క్షీణతలో ఉంది. 
ఎరువుల షేర్ల జోరు
ఎరువుల షేర్లు చంబల్‌, గుజరాత్‌ నర్మద(జీఎన్‌ఎఫ్‌సీ), కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, రాష్ట్రీయ కెమికల్స్‌(ఆర్‌సీఎఫ్‌) అయితే 20-40 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇక ఆయిల్‌, గ్యాస్‌ రంగంలో ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా, చెన్నై పెట్రోలియం, మహానగర్‌ గ్యాస్, ఐవోసీ, మంగళూర్‌ రిఫైనరీ 10 శాతానికిపైబడ్డ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఈ బాటలో పీఎస్‌యూ సంస్థలు ఎంఎంటీసీ, బామర్‌ లారీ, బీఈఎంఎల్‌, నాల్కో, ఎంవోఐఎల్‌, విజయా బ్యాంక్‌, ఇంజినీర్స్‌ ఇండియా, పవర్‌ ఫైనాన్స్‌ కార్ప్‌, ఐఎఫ్‌సీఐ, హిందుస్తాన్‌ కాపర్‌, బీఈఎల్‌, ఎన్‌బీసీసీ నవంబర్‌ 8 స్థాయిలకంటే ఎగువనే ట్రేడవుతున్నాయి.   
నీరసించినవీ ఉన్నాయ్‌
బీఎస్‌ఈ-500 సూచీలో 316 స్టాక్స్ నవంబర్‌ 8న నమోదైన స్థాయిలకంటే ఇప్పటికీ దిగువనే ట్రేడవుతుండటం గమనించదగ్గ అంశం. వీటిలో దివీస్‌ లేబ్స్‌, మణప్పురం, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌, ఆర్‌కామ్‌, శ్రీరామ్‌ సిటీ యూనియన్‌, భారత్‌ ఫైనాన్షియల్‌ తదితరాలున్నాయి. ఇవన్నీ 25-40 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా, సన్‌ ఫార్మా, గెయిల్‌ రెండు నెలల క్రితం నమోదైన స్థాయిలవద్దే కదులుతుండటం విశేషం!   Most Popular