గణాంకాలు, ఫలితాలే ఇక ట్రెండ్‌ నిర్దేశకులు !!

గణాంకాలు, ఫలితాలే ఇక ట్రెండ్‌ నిర్దేశకులు !!

వచ్చే వారం ఆర్థిక గణాంకాలు, క్యూ3'(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలే దేశీ స్టాక్ మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించే అవకాశముంది. వీటితోపాటు విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు, విదేశీ ఇన్వెస్టర్లు, దేశీ ఫండ్స్‌ పెట్టుబడుల తీరు తదితర అంశాలు కూడా సెంటిమెంటును ప్రభావితం చేసే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వచ్చే వారం నుంచి దేశీ కంపెనీల మూడో త్రైమాసిక(క్యూ3) ఫలితాలు విడుదల కానున్నాయి. తొలిగా మంగళవారం(10న) ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, తదుపరి గురువారం ఐటీ దిగ్గజం టీసీఎస్‌, శుక్రవారం(13న) ఇన్ఫోసిస్‌ ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ బాటలో ఎంసీఎక్స్‌, 8కే మైల్స్‌, బజాజ్‌ కార్ప్‌ సైతం ఫలితాలు వెల్లడించనున్నాయి.
జీడీపీ గణాంకాల ఎఫెక్ట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2016-17) స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 7.1 శాతంగా నమోదుకావచ్చని తాజాగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇది గతంలో వేసిన అంచనా 7.6 శాతం కంటే తక్కువకావడం గమనించదగ్గ అంశం. గత శుక్రవారం(6న) మార్కెట్లు ముగిశాక కేంద్ర గణాంకాల సంస్థ(సీఎస్‌వో) ఈ వివరాలు ప్రకటించింది. కాగా, పెద్ద నోట్ల రద్దు(డీమానిటైజేషన్‌) చేపట్టిన నవంబర్‌ నుంచి వాస్తవిక గణాంకాలు వెల్లడైతే అంచనాలు మరింత తగ్గే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వాస్తవిక అంశాల ఆధారంగానే అంచనాలు రూపొందించినట్లు సీఎస్‌వో పేర్కొంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో తొలుత వేసిన 7.2 శాతం జీడీపీ వృద్ధి అంచనాలు కూడా 7 శాతానికి తగ్గిస్తున్నట్లు సీఎస్‌వో తెలియజేసింది. అంచనాలకంటే జీడీపీ నెమ్మదిస్తే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పై ప్రభావం పడగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. 
ఇతర గణాంకాలూ...
నవంబర్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) వివరాలు గురువారం(12న) విడుదలకానున్నాయి. అక్టోబర్‌లో ఐఐపీ 1.9 శాతం క్షీణించింది. ఇక డిసెంబర్‌ నెలకు రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) కూడా వెల్లడికానుంది. నవంబర్‌లో సీపీఐ 3.63 శాతం పెరిగింది. కాగా, ఎఫ్‌ఐఐలు అమ్మకాలు కొనసాగిస్తుంటే.. దేశీ ఫండ్స్‌ పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయి. ఈ ట్రెండ్‌ ఎంతకాలం కొనసాగుతుందనేది గమనించదగ్గ అంశమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 
చమురు ధరలూ కీలకమే
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలూ కీలకంగా నిలిచే అవకాశముంది. నాన్‌ఒపెక్‌, ఒపెక్‌ దేశాల మధ్య ఒప్పందం ప్రకారం జనవరి నుంచి రోజుకి 1.8 మిలియన్‌ డాలర్ల చొప్పున చమురు ఉత్పత్తిలో కోతపడనుంది. దీంతో ఇప్పటికే ఏడాదిన్నర గరిష్టానికి చేరిన ముడిచమురు ధరలు మరింత బలపడితే భారత్‌ వంటి వర్ధమాన మార్కెట్లకు సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. మరోపక్క గత వారం విడుదలైన అమెరికా ఫెడ్‌ మినిట్స్‌లో ఈ ఏడాది మూడుసార్లు వడ్డీ రేట్లలో కోత పెట్టేందుకు ఫెడ్‌ కమిటీ ఆసక్తిగా ఉన్నట్లు వ్యక్తమయ్యింది. ఇది జరిగితే విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు మరింత ఊపందుకునే చాన్స్‌ ఉంది. ఇది దేశీ కరెన్సీ రూపాయిని బలహీనపరచవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. Most Popular