బీఈఎంఎల్‌లో వాటా విక్రయానికి కేంద్రం సై!

బీఈఎంఎల్‌లో వాటా విక్రయానికి కేంద్రం సై!


ప్రభుత్వ రంగ సంస్థ బీఈఎంఎల్‌(భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్)లో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కేంద్రం, డిఫెన్స్ మినిస్ట్రీల నుంచి అనుమతులు లభించినట్లు స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లకు బీఈఎంఎల్ వర్గాలు సమాచారం అందించాయి. ఈ పీఎస్‌యూ కంపెనీలో 26శాతం వాటా విక్రయానికి రంగం సిద్ధమైంది. 

2017-18 తొలి త్రైమాసికంలో బీఈఎంఎల్‌లో 26 శాతం వాటాను విక్రయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నుంచి అనుమతులు లభించడంతో.. ఈ పీఎస్‌యూలో వాటా విక్రయానికి సర్వం సిద్ధం అయినట్లే. ఈ విక్రయం ద్వారా రూ. 1000 కోట్లు సమకూరతాయని కేంద్రం ఆశిస్తోంది.

ప్రస్తుతం బీఈఎంఎల్‌లో ప్రభుత్వానికి 54.03శాతం వాటా ఉంది. అయితే.. ఓపెన్ మార్కెట్ విధానంలో కాకుండా వ్యూహాత్మక పెట్టుబడిదారులకు ఈ వాటా విక్రయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. శుక్రవారం నాడు ట్రేడింగ్ ముగిసేసరికి బీఎస్ఈలో బీఈఎంఎల్ స్టాక్ ధర రూ. 993.95 దగ్గర ఉంది.

వ్యూహాత్మక అమ్మకాలకు సంబంధించిన విధి విధానాలను ఇప్పటికే కేంద్రం సిద్ధం చేసుకున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి. త్వరలో ఈ వాటా విక్రయ ప్రణాళికను కేంద్రం ప్రారంభించబోతోంది. 

వాల్యుయేషన్ పూర్తి చేసి బిడ్లను ఆహ్వానించి, రిజర్వ్ ప్రైస్ ఆధారంగా బీఈఎంఎల్ లో వాటా విక్రయించనుంది కేంద్రం. ప్రస్తుతం ప్రాధమిక అనుమతులు లభించడంతో ఇతర విధి విధానాలను సంపూర్తి చేసి.. సీసీఈఓ తుది అనుమతులకు ప్రతిపాదనలు పంపబోతున్నట్లు డిజిన్వెస్ట్‌మెంట్ గ్రూప్ చెబుతోంది. 

అయితే, ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. జనవరి 28న అన్ని యూనియన్ల ఉద్యోగుల నుంచి, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టబోతున్నట్లు వర్కర్ యూనియన్లు చెబుతున్నాయి. Most Popular