ఐటీ స్టాక్స్‌పై హెచ్1బీ వీసా బిల్ ఎఫెక్ట్!!

ఐటీ స్టాక్స్‌పై హెచ్1బీ వీసా బిల్ ఎఫెక్ట్!!


వీసా బిల్లును అమెరికన్ కాంగ్రెస్ మరోసారి చేపట్టడం భారత ఐటీ కంపెనీలపై ప్రభావం చూపుతోంది. హెచ్‌1బీ వీసాల జారీలో కీలక మార్పులను డిమాండ్ చేస్తుండడంతో, ఐటీ కంపెనీల స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క శుక్రవారం నాటి ట్రేడింగ్‌లోనే ప్రధాన ఐటీ కంపెనీల మార్కెట్ కేపిటలైజేషన్ రూ. 22వేల కోట్ల మేర పతనమైందంటే.. మదుపర్లు ఈ స్టాక్స్‌పై ఏ స్థాయిలో భయాందోళనల్లో ఉన్నారో అర్ధమవుతుంది. 

మన దేశంలో ఉన్న ఐటీ కంపెనీల ఆదాయాల్లో సగానికిపైగా అమెరికాలో నిర్వహిస్తున్న కార్యకలాపాల నుంచే వస్తోంది. అందుకే అమెరికాలో వీసా బిల్లు అనగానే ఇక్కడ అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్1బీ వీసా ప్రోగ్రాంలో భాగంగా కీలక మార్పులను పలువురు సభ్యులు సూచించారు. ఇండియా వంటి ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో పని చేసేందుకు నైపుణ్యం గల పనివారికి అవకాశం కల్పించాలన్నది ఇందులో ప్రధాన సూచన. 

వర్క్ వీసాలను దుర్వనియోగం చేయకుండా ఉండడం కోసం ఈ సూచన చేశారు. ఇది ఒకరకంగా మన కంపెనీలకు సానుకూలమే అయినా.. ఆయా సంస్థల ఆదాయంపై ప్రభావం చూపే ప్రధానమైన మరొక సూచనపై కూడా కాంగ్రెస్ పట్టుపడుతోంది.

హెచ్‍‌1బీ వీసా గలవారికి కనీస వేతనం 1లక్ష డాలర్లుగా ఉండాలనే ప్రతిపాదన కారణంగా ఐటీ సంస్థల శాలరీ బిల్లు గణనీయంగా పెరిగిపోనుంది. హెచ్1బీ వీసా ఉన్న ప్రతీ వారికీ ఈ స్థాయి వేతనం చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తితే మాత్రం.. కంపెనీలకు పెను భారంగా పరిణమించనుంది. 

అయితే ఖర్చు పెరిగినంత మాత్రాన ఈ మొత్తాన్ని పూర్తిగా క్లయింట్లపై ఒక్కసారిగా రుద్దే అవకాశం ఉండదు. మెల్లగా ఆయా సేవలకు వసూలు చేస్తున్న రుసుములను పెంచుతూ.. భారం తగ్గించుకోవాల్సిం ఉంటుంది. అంత కాలంపాటు మన ఐటీ కంపెనీల బ్యాలెన్స్ షీట్‌లో విపరీతమైన తేడాలు రావడం అయితే ఖాయమే. అందుకే కొంత కాలం పాటు భారతీయ ఐటీ కంపెనీలపై ఒత్తిడి తప్పదని ఫారిన్ బ్రోకరేజ్ సంస్థలు అంటున్నాయి. 
 Most Popular