పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి ?

పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి ?

    కొత్త ఆశలకు.. కొత్త లక్ష్యాలకు ఇది తొలి అడుగు కావాలి. జీవితానికి కొత్త రంగులద్ది.. ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలంటే మొదట మీరు మీ ఇంటి బడ్జెట్‍‌ను తయారు చేయాలి. ఆర్థిక మంత్రిలా మారిపోయి.. నిక్కచ్చిగా చిట్టాపద్దులు తయారు చేసుకోవాలి. సాధారణంగా సంపాదించే సొమ్ముకు.. చేసే ఖర్చుకూ ఎప్పుడూ పొంతన ఉండదు. అది కార్మికుడికైనా.. కోటీశ్వరుడికైనా..... ! ఎవరి స్థాయిలో వాళ్లకు ఖర్చులుంటాయి, అందుకు తగ్గట్టే పొదుపూ ఉంటుంది, ఉండాలి కూడా. అలా అని ఎవరికైనా రాబడి పెరిగే అవకాశాలూ ప్రతీ ఏడాదీ కొత్తగా ఏమీ పుట్టుకురావు. ఖర్చుల్లోనూ భారీగా కోతలూ కుదిరే పనికాదు. అవునన్నా.. కాదన్నా.. ఉన్నదానిలో సర్దుకుపోతూ.. బతకడానికి మనమంతా ఎప్పటి నుంచో అలవాటుపడిపోయాం. పెరిగిన నిత్యావసరాల ధరలు, పిల్లల చదువులు, వైద్యం, పిల్లల పెళ్లి... ఇలా ప్రతీ కుటుంబంలో ఇవన్నీ అత్యంత సాధారణమైన, ముఖ్యమైన ఖర్చులు. ఇవి కాక ఇల్లు, టూ వీలర్/ఫోర్ వీలర్ ప్లాన్లు కూడా చాలా మందికి ఉండనే ఉంటాయి. కానీ లెక్క పక్కాగా ప్లాన్ చేసుకుంటే మన జీతంలో కాకపోయినా జీవితంలోనైనా కొద్దిగా మార్పు తెచ్చుకోవచ్చు. అందులో సందేహమే లేదు. నమ్మకం లేదా.. అయితే.. ఓ సారి మీరు అరుణ్ జైట్లీ అవతారమెత్తి ఆ రహస్యాన్ని కనుక్కునే ప్రయత్నం చేయండి ! 

లక్ష్యం లేకపోతే దండగే !         
    ఖర్చులు ఏ రోజుకు ఆ రోజు పెరుగుతూనే ఉన్నాయి. వాటిని చూస్తూ భయపడితే ఇంకా కుంగిపోతాం. అందుకే ఉన్నంతలోనే మన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఈ రోజు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. సొంత ఇల్లు, పిల్లల ఉన్నత చదువులు, ఆడపిల్ల పెళ్లి, ఆరోగ్యం, రిటైర్మెంటు వరకూ అన్నింటికీ ప్లానింగ్ అవసరం. మనం సంపాదించే ప్రతీ వందలో కనీసం 30 నుంచి 35 రూపాయలైనా భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలి. అప్పుడే మెరుగైన జీవితం సాధ్యం. ఈ రోజే బతకలేకపోతే రేపటి గురించి పొదుపేంటంటూ అప్పుడే నిట్టూర్పు వద్దు. మన ముందున్న లక్ష్యాలేంటో నిర్దేశించుకున్న తర్వాత దాన్ని చేరుకునేందుకు ఉండే మార్గాలు వెతకాలి. మెరుగైన రాబడితో పాటు పెట్టుబడి కూడా సురక్షితంగా ఉండే విధంగా చూసుకోవాలి. వచ్చే జీతంలో ఒకేసారి అవసరాలన్నీ తీర్చడం సగటు జీవికి అసాధ్యం. అందుకే ముఖ్యమైన వాటిల్లోనూ అతిముఖ్యమైన వాటిని ముందుగా గుర్తించాలి. 

ఆరోగ్య బీమా లేకపోతే ఆవిరైపోతాం ! 
    వైద్య ఖర్చుల కోసం మన దేశంలో అధిక శాతం మంది అప్పు చేస్తున్నారని, అంత వరకూ దాచుకున్న సొమ్మంతా కరిగిపోతోందని ఈ మధ్యే ఓ సర్వేలో మరోసారి తేలింది. ఈ రోజుల్లో ఆసుపత్రిలో చేరితే ఎంత ఖర్చవుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ప్రతీ కుటుంబానికి అనుభవంలో ఉన్న విషయమే. అందుకే ప్రతీ కుటుంబానికీ ఆరోగ్య బీమా అతి ముఖ్యం. ప్రస్తుతం చిన్న జ్వరం వస్తేనే కనీసం వెయ్యి రూపాయలు వదిలించుకోవాల్సి వస్తోంది. ముప్ఫై ఏళ్లు దాటకుండానే బిపి, గుండె జబ్బులు, డయాబెటిస్ చుట్టుముడ్తున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఆరోగ్య బీమా తీసుకోవడం ఉత్తమం. కనీసం రెండు, మూడు లక్షలకు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే కుటుంబ సభ్యలందరికీ ఎంతో కొంత బీమా అండ ఉంటుంది. అపోలో మ్యూనిచ్, స్టార్ హెల్త్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ వంటి కంపెనీలు ప్రస్తుతం మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. 34 ఏళ్లలోపు ఉన్న భార్యాభర్తలు, 18 ఏళ్ల లోపు ఉన్న ఇద్దరు పిల్లల కోసం రూ. 3 లక్షలకు ఆరోగ్య బీమా తీసుకోవాలంటే రూ. 10 వేల నుంచి రూ. 11 వేల వరకూ ఖర్చవుతోంది. ఏదో విధంగా నెలకు వెయ్యి రూపాయలు పొదుపు చేసినా ఈ సౌకర్యాన్ని మనం పొందొచ్చు. 

జీవిత బీమా కుటుంబానికి ధీమా ! 
    ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీ వ్యవస్థలో భార్యాభర్త ఇద్దరూ సంపాదిస్తుంటేనే ఇల్లు అంతంతమాత్రంగా నడుస్తోంది. కానీ అనుకోని పరిస్థితుల్లో కుటుంబ పెద్ద అకాల మరణం పాలైతే ఇక సభ్యులు పడే బాధ మాటల్లో చెప్పలేం. రేపు ఏంటో అర్థం కాని అగమ్యగోచర స్థితి ఉంటుంది. అందుకే మనం లేకపోయినా మన కుటుంబం ధైర్యంగా జీవించేందుకు అవసరమైన నిధులను సమకూర్చాల్సిన బాధ్యతా మనదే. అది కూడా ఐదు లక్షలో, పది లక్షలకు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏ మాత్రం సరిపోదు. ఇప్పుడు వస్తున్న వార్షిక ఆదాయంలో కనీసం పది రెట్లు ఉండేలా కవర్ ఉండాలి. అంటే ఇప్పుడు ఏడాదికి ఐదు లక్షల ఆదాయం ఉంటే కనీసం రూ. 50 లక్షలకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటే మంచిది. ఒక వేళ ఆస్తులు ఏవైనా ఉంటే వాటి విలువను ఇందులో నుంచి తగ్గించవచ్చనేది మరికొందరి నిపుణుల సలహా. ప్రస్తుతం మార్కెట్లో 30 ఏళ్ల వ్యక్తికి రూ. 30 లక్షల వరకూ బీమా కావాలంటే ఐదారు వేల రూపాయల వరకూ ప్రీమియం భరించాలి. హెచ్.డి.ఎఫ్.సి. లైఫ్ క్లిక్2ప్రొటెక్ట్ , ఎగాన్ రెలిగేర్ ఐటర్మ్ ప్లాన్  వంటి ఆన్ లైన్ ప్లాన్స్ ప్రస్తుతం మార్కెట్లో బాగా అమ్ముడవుతున్నాయి. మీ అవసరాన్ని గుర్తించడంతో పాటు క్లైం సెటిల్మెంట్ మెరుగ్గా ఉన్న సంస్థను ఎంచుకోవడం ఉత్తమం.

పిల్లల చదువులే పెద్ద ఖర్చు 
    మన దేశంలో విద్య రానురాను మరింత భారమైపోతోంది. డిజిటల్ స్కూల్స్, కాన్సెప్ట్ స్కూల్స్, టెక్నో స్కూల్స్ పేరుతో రోజుకో కొత్త రకం స్కూల్ పుట్టుకొస్తుంటే.. తల్లిదండ్రులు వాటి వెంట పరుగులు తీస్తూ తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు తాపత్రయపడ్తున్నారు. చివరకు వాళ్ల చిన్న చిన్న కోరికలను కూడా అదుపులో పెట్టుకుని పిల్లల భవిష్యత్ కోసం సర్వం ధారపోస్తున్నారు. కానీ రేపటి రోజున మనం మోయలేనంత స్థాయిలో విద్య భారమవుతుంది. అందుకే చిన్న పిల్లలప్పటి నుంచే వాళ్ల రేపటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పొదుపు చేయాలి. పిల్లల వయస్సును బట్టి నెలకు వెయ్యితో మొదలుపెట్టి ఆ తర్వాత ప్రతీ ఏడాదీ కనీసం పదిశాతం చొప్పున పెంచుకుంటూ పోతేనే మన లక్ష్యం నెరవేరొచ్చు. వాళ్లకు ఆస్తిపాస్తులు ఇవ్వలేకపోవచ్చు కనీసం మంచి చదువు చెప్పించామన్న తృప్తి ఉంటే చాలనేది ఇప్పుడు చాలామంది తల్లిదండ్రుల ఆలోచన. ఇక ఆడ పిల్ల ఉన్నవాళ్లు వాళ్లు పెళ్లి గురించి కూడా ఎంతో కొంత ప్లానింగ్ అవసరం. రాబోయే రోజుల్లో ఆడపిల్లలు దొరకడమే కష్టమై కన్యాశుల్కం ఇచ్చి మరీ చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చేమో చెప్పలేం కానీ ముందు నుంచి ఎంతో కొంత ప్లానింగ్ ముఖ్యం. 

ముసలితనంలో మనశ్శాంతి కావాలంటే ! 
    పిల్లల చదువులు, పెళ్లిళ్లు.. బాధ్యతలన్నీ తీరిపోయి మలి సంధ్యలో మనశ్శాంతిగా జీవించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. రిటైర్ అయిన తర్వాత ఖర్చులు ఎక్కువ ఉండవనుకోవడం పొరపాటు. వృద్ధాప్యం మీదపడే కొద్దీ ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అప్పుడు పెన్షన్ (అది కూడా ప్రభుత్వ ఉద్యోగులైతేనే...) మినహా పెద్దగా ఆర్థిక చేయూత ఉండదు. పిల్లలపై ఆధారపడేందుకు నామోషీగా ఉండొచ్చు. తీర్థయాత్రలు, మనుమలకు ఏదో ఒకటి ఇవ్వాలనే తాపత్రయం, ఇతరులకు భారం కావొద్దనే భావన ఎమోషనల్ ఎటాచ్‌మెంట్స్ మలివయస్సులో ఇబ్బందిపెడ్తూ ఉంటాయి. వాటన్నింటికీ ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి. రేపటికి ఇప్పటి నుంచే ఎంతో కొంత దాచుకోవాలి. 

    చెప్పుకుంటూ పోతే.. ఇలా అనేక ఖర్చులుంటాయి. అన్నీ ముఖ్యమనే అనిపిస్తాయి. కానీ మన మనీ పర్స్ అందుకు సహకరించదు. ఇవన్నీ మనతో కాదులే అని మొత్తానికే చాపచుట్టేయకుండా ఎక్కడో ఒక చోట స్పష్టమైన ప్రణాళిక మొదలుపెట్టాలి. నెలకు వేలకు వేలు దాయాల్సిన పరిస్థితి లేకపోతే.. మొదట కనీసం  రూ. 2-3 వేల రూపాయలతో పొదుపు మొదలుపెట్టండి. మనపై ఆధారపడ్డ కుటుంబానికి మెరుగైన జీవితం అందించడంతో పాటు మనమూ తలెత్తుకు జీవించడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోండి. ఆదాయం పెరగని పరిస్థితుల్లో ఖర్చులను కొద్దిగా అయినా తగ్గించుకుని పొదుపు మొదలుపెట్టాలి. మ్యుచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను ఎంపిక చేసుకుని.. వాటిల్లో నెలనెలా ఇన్వెస్ట్ చేస్తే అధిక ప్రయోజనం ఉంటుంది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరడం ఇబ్బంది కాకపోవచ్చు. 

కోటీశ్వరుడి కల ఎలా తీరుతుంది ! 
    నెలకు రూ. 8 వేల చొప్పున 21 సంవత్సరాల పాటు కనీసం 13 శాతం ఆదాయం వచ్చేలా పొదుపు చేస్తే రూ. 1,04,19,265 మొత్తం సమకూరుతుంది. అదే రూ.5 వేలను 23 ఏళ్ల పాటు కనీసం 14 శాతం తగ్గకుండా రాబడి వచ్చే విధంగా పొదుపు చేస్తే రూ. 1,00,99,695 అవుతుంది. అయితే ఈ స్థాయిలో రాబడి రావాలంటే మాత్రం మనం పూర్తిగా ఈక్విటీ మార్కెట్స్ పైనో, లేకపోతే ఫిక్సెడ్ డిపాజిట్ పైనో ఆధారపడడం మంచిది కాదు. వయస్సులో ఉన్నప్పుడు రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మన డబ్బులో 60 - 70 శాతం మ్యూచువల్ ఫండ్స్ కు మిగిలిన సొమ్మును నేషనల్ పెన్షన్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి సురక్షిత సాధనాలవైపు మళ్లించాలి. వయస్సు పెరుగుతున్న కొద్దీ మన రిస్కును తగ్గించుకుంటూ పెట్టుబడి సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ వైపు దృష్టిసారించాలి. అప్పుడే కనీసం 14 నుంచి 16 శాతం వరకూ రాబడి వచ్చేందుకు వీలుంది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం మన లాభాలను కరిగించేస్తుంది కాబట్టి జీతం పెరిగినప్పుడల్లా  పెట్టుబడిని పెంచుకోవాలి. అప్పుడే కోటీశ్వరుడి కల నెరవేరుతుంది. Most Popular