ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్... ఎంతవరకూ పెరగొచ్చంటే?

ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్... ఎంతవరకూ పెరగొచ్చంటే?

ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్

షేర్ ధర: రూ. 129

52 వారాల గరిష్ఠ – కనిష్ఠ ధర: రూ. 142 -48

మార్కెట్ కేపిటలైజేషన్: రూ. 585 కోట్లు

షేర్ ధర లక్ష్యం: రూ. 160-180

 

తెలుగు రాష్ట్రాల్లో, ఆ మాటకొస్తే... తమిళనాడు, కర్నాటక, కేరళ పట్టణాల్లో మెయిన్ రోడ్ల వెంట గోడలపై మొనగాడు సిమెంట్ అని రాసి ఉండే ప్రచార బోర్డులు ఎన్నో కనిపిస్తాయి. ఆ సిమెంట్ ఎవరిదో కాదు... ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్‌దే. మొదట ఈ సంస్థ పేరు నాగార్జునా సిమెంట్ లిమిటెడ్. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం చిన్నగా ఏర్పాటైన ఈ కంపెనీ పేరు తర్వాత ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ అయింది. దీనికి కృష్ణా, నల్గొండ జిల్లాల్లోని రెండు సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వార్షిక సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం 2.70 మిలియన్ టన్నులు. ఓపీసీ, పీవీసీ సిమెంట్ మాత్రమే కాకుండా రైల్వే సిమెంటు స్లీపర్ల తయారీ నిమిత్తం రైల్వేలకు ప్రత్యేకంగా ఐఆర్ఎస్ గ్రేడ్ 53 ఎస్- స్పెషల్ సిమెంట్ తయారు చేసి సరఫరా చేసే కంపెనీ ఇది. తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిసా, అస్సాం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, పాండిచ్చేరి, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో సిమెంటు విక్రయిస్తోంది.

 

బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీ!

కేవలం సిమెంట్ తయారీకి మాత్రమే పరిమితం కాకుండా గత పది – పదిహేనేళ్ల కాలంలో రెడీమిక్స్ కాంక్రీట్, పార్టికల్ బోర్డులు, తలుపులు, స్టీల్ ప్రొఫైల్స్ తయారీలోకి ఈ కంపెనీ విస్తరించింది. ఎన్‌సీఎల్‌కు ఒక ఎనర్జీ డివిజన్ కూడా ఉంది. దీని కింద 7.5 మెగావాట్లు, 8.25 మెగావాట్ల సామర్థ్యం కల రెండు జల విద్యుత్తు యూనిట్లు ఉన్నాయి.ఈ కంపెనీ ప్రధానంగా సిమెంటు తయారీలో ఉన్నప్పటికీ దీన్ని సిమెంటు కంపెనీ మాత్రమే అనలేం. ఒకరకంగా చెప్పాలంటే... ఇది బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీ.

 

నిర్మాణాలు షురూ...

కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ కొద్దిగొద్దిగా కోలుకుంటోంది. కరోనా పూర్తి తగ్గిపోనప్పటికీ లాక్‌డౌన్ వంటి ఆంక్షలు లేకపోవడంతో ప్రజలు అంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నం అవుతున్నారు. దీంతో నిర్మాణ కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. నగరాలలో రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుంటోంది. దీంతో సిమెంటుకు గిరాకీ పెరిగి సిమెంటు కంపెనీలు మంచి ఆదాయాలు ఆర్జించే పరిస్థితి వస్తోంది. ఇప్పటికే రెండో త్రైమాసికానికి కొన్ని సిమెంటు కంపెనీలు ప్రకటించిన ఆర్థిక ఫలితాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆర్జించిన నికరలాభాన్ని కొన్ని సిమెంటు కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికే సంపాదించాయి. మరోపక్క ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ కేవలం సిమెంటు విక్రయాలకు పరిమితం కాకుండా పలు రకాలైన బిల్డింగ్ మెటీరియల్స్ సరఫరా చేస్తోంది కాబట్టి అన్ని రకాలుగా మంచి ఆదాయాలు నమోదు చేయవచ్చు.

 

2019-20 ఫలితాలు

ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రూ. 937 కోట్ల ఆదాయాన్ని రూ. 50.84 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. వార్షిక ఈపీఎస్ రూ. 11.26 ఉంది.

 

మొదటి త్రైమాసికానికి...

కరోనా మహమ్మారి రూపంలో సవాలు ఎదురైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి త్రైమాసికానికి ఈ కంపెనీ పనితీరు బాగానే ఉంది. కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ. 261 కోట్ల ఆదాయం, రూ. 32 కోట్ల నికర లాభం నమోదయ్యాయి. త్రైమాసిక ఈపీఎస్ రూ. 7.06 ఉంది. ముఖ్యంగా సిమెంటు విభాగంలో అధిక లాభాలు నమోదయ్యాయి. అధఇక సిమెంటు ధర దీనికి ప్రధాన కారణం.

 

రెండో త్రైమాసికం ఎలా ఉంటుంది?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి ఈ కంపెనీ ఈ నెల 9న ఫలితాలు ప్రకటించబోతోంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ ఫలితాలు ఎంతో మెరుగ్గా ఉండాలి. సిమెంటు విభాగంలో అధిక లాభాలు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి త్రైమాసికంతో పల్చితే రెండో త్రైమాసికంలో సిమెంటు డిస్పాచెస్ పెరిగాయి. అదే సమయంలో ధర ఆకర్షణీయంగానే ఉంది. అందువల్ల రూ. 45 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకూ నికరలాభం ఉండవచ్చని సమాచారం. దీంతో రిజల్ట్స్ తర్వాత ఈ షేర్‌కు స్టాక్ మార్కెట్లో ఆకర్షణ ఏర్పడే అవకాశం ఉంది.

 

కంపెనీ మూలధనం

ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ జారీ మూలధనం రూ. 45.23 కోట్లు(ఒక్కొక్కటీ రూ.10 ముఖ విలువ కల 4.52 కోట్ల షేర్లు).

  • ప్రమోటర్ల వాటా: 43.70 శాతం
  • మ్యూచువల్ ఫండ్లు: 6.07 శాతం
  • ఐఈపీఎఫ్ అథారిటీ: 1.76 శాతం
  • రిటైల్ ఇన్వెస్టర్లు: 48.47 శాతం

 

ఇతర ప్రత్యేకతలు

  1. కేవలం సిమెంటు కంపెనీ మాత్రమే అని కాకుండా ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీ.
  2. కొత్త కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంతో ఈ కంపెనీ యాజమాన్యం ఎంతో ముందుంటుంది. బిల్డింగ్ మెటీరియల్స్ సంబంధించిన టెక్నాలజీలను జర్మనీ, టర్కీ దేశాలకు చెందిన అగ్రగామి కంపెనీల నుంచి తెచ్చుకుంది. ఈ విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది.
  3. గతంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ తట్టుకుని నిలిచిన కంపెనీ. అప్పులు అదుపులోనే ఉన్నాయి. సమీప భవిష్యత్తులో సిమెంటుతో పాటు బిల్డింగ్ మెటీరియల్స్ విభాగంలో ఆదాయాలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బిల్డింగ్ మెటీరియల్స్ (అంటే యూపీవీసీ కిటికీలు, రెడీమేడ్ తలుపులు, దర్వాజాలు... వంటివి)కు మన దేశంలో ఇప్పుడిప్పుడే యాక్సెప్టెన్స్ పెరుగుతోంది.
  4. క్రమం తప్పకుండా డివిడెండ్ చెల్లిస్తున్న కంపెనీ.
  5. వర్షాకాలం సీజన్ పూర్తయినందున ఇక ఇప్పటి నుంచి వచ్చే ఎండాకాలం వరకూ నిర్మాణాలు జోరుగా సాగుతాయి. అందువల్ల సిమెంటుకు, ఈ కంపెనీకి చెందిన ఇతర ఉత్పత్తులకు గిరాకీ అధికంగా ఉండవచ్చు. అందువల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు త్రైమాసికాల్లోనూ కంపెనీ మెరుగైన పనితీరు ప్రదర్శించి ఆకర్షణీయమైన ఆదాయాలు, లాభాలు నమోదు చేసేందుకు వీలుంది.
  6. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాదికి బాగా కోలుకోవచ్చు. అదే జరిగితే మళ్లీ కోర్ ఎకానమీలో రికవరీ వస్తుంది. ఉత్పత్తి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ఎస్టేట్ – ప్రాపర్టీ డెవలప్మెంట్ రంగాలు మెరుగవుతాయి. అందువల్ల సిమెంటు కంపెనీలకు అమ్మకాలు పెరిగి అధికాదాయాలు ఆర్జించే అవకాశం ఏర్పడుతుంది. ఆ రకంగా ఈ కంపెనీని ఇన్వెస్టర్లు ఏడాది – రెండేళ్ల పెట్టుబడికి పరిశీలించవచ్చు.

 

షేర్ ధర ఎంత కావచ్చు?

మొదటి త్రైమాసిక ఫలితాల కంటే ముందు ఈ కంపెనీ షేర్ రూ. 60-70 దరిదాల్లో ట్రేడ్ అయింది. కానీ మొదటి త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్‌పై ఆసక్తి చూపించారు. అందువల్ల షేర్ ధర రూ. 142 వరకూ పెరిగింది. ఆ తర్వాత కొంత కరెక్ట్ అయింది. ప్రస్తతం రూ. 129 వద్ద కనిపిస్తోంది. రెండో త్రైమాసిక ఫలితాల తేదీని కంపెనీ ప్రకటించింది. అనుకున్నట్లుగా మంచి ఫలితాలు ప్రకటిస్తే, మళ్లీ ఈ షేర్‌పై ఇన్వెసటర్లకు ఆసక్తి ఏర్పడవచ్చు. అందువల్ల షేర్ ధర పెరిగే అవకాశం ఉంది. స్వల్ప కాలంలో ఈ షేర్ రూ. 160 వరకూ పెరిగే ఛాన్స్ ఉంది. ఒక ఏడాది కాలం ఎదురుచూసే పక్షంలో, రూ. 180 వరకూ ధర లభిస్తుంది. ఒక ఏడాది – ఏడాదిన్నర కాలం ఎదురుచూడగలిగే ఇన్వెస్టర్లు అయితే ఒకేసారి కాకుండా నాలుగైదు దఫాలుగా ధర తగ్గిన ప్రతిసారి ఈ షేర్‌ను కొనుగోలు చస్తే ఎక్కువ లాభాన్ని కళ్లచూడవచ్చు.tv5awards