లారస్ ల్యాబ్స్.. లాభాల జోరు

లారస్ ల్యాబ్స్.. లాభాల జోరు
  • లారస్ ల్యాబ్స్.. లాభాల జోరు
  • రెండో త్రైమాసికంలో రూ. 242 కోట్ల నికరలాభం!

 

అంచనాలకు తగ్గట్లుగానే ఉంది. లేదు లేదు.. అంచనాలను మించిపోయింది. లారస్ ల్యాబ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి అత్యంత ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. (ఈ విషాయన్ని ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్.ఇన్ పది రోజుల క్రితమే చెప్పింది. ఆ వార్త చదవాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి.) ఆదాయంలో అనూహ్యమైన వృద్ధి ఉంటే, లాభాల మార్జిన్లు ఇంకా ఆసక్తికరంగా ఉన్నాయి.

 

ప్రస్తుత రెండో త్రైమాసికంలో ఆదాయం రూ. 1139 కోట్లు ఉండగా, దీనిపై రూ. 242 కోట్ల నికరలాభం నమోదైంది. త్రైమాసిక ఈపీఎస్ రూ. 4.5గా ఉంది. ఎబిటా మార్జిన్లు 33 శాతం నికర లాభాల మార్జిన్లు 21 శాతం ఉండడం ప్రత్యేకత.

 

గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆదాయం రూ. 712 కోట్లు కాగా, నికరలాభం రూ. 56.55 కోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రస్తుత రెండో త్రైమాసిక ఫలితాలను పోల్చి చూస్తే.. ఆదాయం 60 శాతం, నికరలాభం 325 శాతం పెరిగిన విషయం స్పష్టమవుతుంది.

 

ఫార్ములేషన్స్ జోరు

ఇంత ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. తాను తయారు చేసే ఔషధాలను కొవిడ్-19 వల్ల ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున అమ్ముకునే అవకాశం లారస్‌ ల్యాబ్స్‌కు లభించింది. మరీ ముఖ్యంగా ఫార్ములేషన్ల (ట్యాబ్లెట్లు, క్యాప్యూల్స్ వంటి తుది ఔషధాలు) విభాగంలో ఎంతో అధిక వృద్ధి కనిపించింది.

 

ఈ రెండో త్రైమాసికంలో ఫార్ములేషన్ల విభాగం నుంచి ఆదాయం గత ఆర్థిక సంవత్సరం ఇదేకాలంతో పోల్చితే 180 శాతం పెరిగింది. దీంతో ఆదాయంలో ఫార్ములేషన్ల వాటా 40 శాతానికి చేరింది. ఇక జనరిక్ ఏపీఐ విబాగంలో 22 శాతం వృద్ధి నమోదైంది.

 

ఆకర్షణీయంగా లాభనష్టాల ఖాతా

ప్రస్తుత ఫలితాలతో ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థానికి లారస్ ల్యాబ్స్ లాభనష్టాల ఖాతా ఆకర్షణీయంగా మారింది. మొత్తం ఆదాయం రూ. 2113 కోట్ల ఉండగా, దీనిపై రూ. 414 కోట్ల నికరలాభం, రూ. 7.7 ఈపీఎస్ కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ. 1263 కోట్లు, నికరలాభం రూ. 71.65 కోట్లు మాత్రమే. అసలు గత ఏడాదిలో ఆర్జించిన నికర లాభం రూ. 255 కోట్లు కాగా, దాదాపు ఆ లాభాన్ని ఈ రెండో త్రైమాసికంలోనే సంపాదించడం కొసమెరుపు.

 

సీఎఫ్ఓ ఏమన్నారంటే

మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం జోరు పెంచింది. పెద్దఎత్తున ఉత్పత్తి సామర్ధ్యాన్ని విస్తరించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుత యూనిట్లలో ఉత్పత్తి సామర్ధ్యాన్ని విస్తరించడంతో పాటు కొత్త యూనిట్లు (గ్రీన్‌ఫీల్డ్) ఏర్పాటు చేయడానికి మేం సిద్ధమవుతున్నాం - అని లారస్ ల్యాబ్స్ సీఎఫ్ఓ వీవీ రవికుమార్ వెల్లడించారు.

 

దీని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇదే వృద్ధి బాటలో ముందుకు వెళ్లడంతో పాటు వచ్చే కొన్నేళ్ల పాటు అధిక ఆదాయాలు, లాభాలు ఆర్జించాలని కంపెనీ యాజమాన్యం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

 

ఫౌండర్ మెసేజ్

"మాకు స్పష్టమైన దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాల సాధనకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మూలధన కేటాయింపులు చేస్తున్నాం," అని లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ చావా సత్యనారాయణ పేర్కొన్నారు. దానివల్ల భవిష్యత్తులో ఎంతో వృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

 

40 శాతం మధ్యంతర డివిడెండ్

మంచి ఫలితాలు నమోదు చేయడమే కాదు, మంచి డివిడెండ్ కూడా లారస్ ల్యాబ్స్ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 40 శాతం మధ్యంతర డివిడెండ్ (రూ. 2 ముఖ విలువ కల ఒక్కో షేర్‌కు 80 పైసల చొప్పున) ఇవ్వాలని ప్రతిపాదించింది. దీనికి వచ్చే నెల 11వ తేదీని రికార్డు తేదీగా నిర్ణయించింది. వాటాదార్ల బ్యాంకు ఖాతాల్లో వచ్చే నెల 19 నాడు కానీ, లేదా ఆ తర్వాత కానీ డివిడెండ్ సొమ్ము జమ అవుతుంది.tv5awards