టర్న్అరౌండ్ స్టోరీ... హెరిటేజ్ ఫుడ్స్...

టర్న్అరౌండ్ స్టోరీ... హెరిటేజ్ ఫుడ్స్...

హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్

మార్కెట్ కేపిటలైజేషన్: రూ. 1403 కోట్లు

షేర్ ధర: రూ. 302

52 వారాల కనిష్ట - గరిష్ట ధర: రూ. 146-407

 

                పాలు, పాల ఉత్పత్తుల విక్రయాల్లో నిమగ్నమై ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వ్యాపారపరంగా గత కొంతకాలంగా ఎదురైన ఇబ్బందుల నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తత్ఫలితంగా కంపెనీ పనితీరు మెరుగుపడి ఆకర్షణీయమైన లాభాలు ఆర్జించే దిశగా ముందుకు సాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే ఈ విషయం స్పష్టమైంది. ఆదాయంలో పెరుగుదల లేకపోయినప్పటికీ ఆకర్షణీయమైన లాభాలు నమోదు చేసింది. ఇక ఈ రెండో త్రైమాసికానికి ఇంకా మెరుగైన ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నికర లాభం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని అంచనా. దీనికి ప్రధాన కారణం పాలు, పాల ఉత్పత్తుల ధరలు పెరగడమే. అదే సమయంలో వ్యయాలు తగ్గినందున నికర మార్జిన్లు పెరిగి అధిక లాభాలు ఆర్జించే పరిస్థితి అన్ని డెయిరీ కంపెనీలకు కనిపిస్తోంది. ఆ కోవలోనే హెరిటేజ్ ఫుడ్స్‌కు మంచి లాభఆలు ఆర్జించే అవకాశం ఉంది. ఈ నెల 28న హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ల బోర్డు సమావేశమై, రెండో త్రైమాసికానికి ఫలితాలు ప్రకటించనుంది.

 

గత ఆర్థిక సంవత్సరంలో...

                2019-2020 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి-మార్చి 2020) కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ. 210 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. దీనివల్ల 2019-20  ఆర్థిక సంవత్సరానికి రూ. 168 కోట్ల నష్టాన్ని భరించాల్సి వచ్చింది. FETPL ఈక్విటీ సెక్యూరిటీస్ మీద వచ్చిన నష్టాన్ని గుర్తించటం వల్ల అప్పట్లో నష్టాలు ప్రకటించాల్సి వచ్చింది. కానీ 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం 8.40 శాతం పెరిగి రూ. 2725.90 కోట్లకు చేరుకుంది (2018-19 వార్షికాదాయం రూ. 2514.75 కోట్లు).

 

మొదటి త్రైమాసికంలో...

 

ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ప్రారంభం... అంటే ఈ ఏప్రిల్ నెల నుంచి కరోనా మహమ్మారి విస్తరించిన విషయం తెలిసిదే. ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో అన్ని రకాలైన కార్యకలాపాలు నిలిచిపోయాయి. సరుకు రవాణా, ఇతరత్రా అవరోధాలతో డెయిరీ పరిశ్రమ కూడా ఇబ్బంది పడింది. కాకపోతే అత్యవసర సేవల్లోకి వచ్చేది కావడంతో డెయిరీ పరిశ్రమ కార్యకలాపాలు కొనసాగాయి. అయినా ఎంతోకొంత ప్రభావం పడింది. వీటన్నింటినీ తట్టుకుని ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి హెరిటేజ్ ఫుడ్స్ కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ. 638 కోట్ల ఆదాయాన్ని, రూ. 96 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆదాయం రూ. 760 కోట్లు ఉండగా, నికరలాభం రూ. 18 కోట్లు మాత్రమే. దీంతో పోల్చితే ఆదయం తగ్గినా, నికరలాభం గణనీయంగా పెరిగింది.

 

వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్...

Heritage Foods reports cons. net loss of Rs209cr in Q4FY20; stock dips 3%హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్తుత రెండో త్రైమాసికంలో లాభాల మార్జిన్ పెరగడానికి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ సైతం దోహదపడనుంది. గత కొంతకాలంగా కంపెనీ ఆదాయాల్లో, లాభాల్లో వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ వాటా పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ విభాగం నుంచి వృద్ధి తగ్గింది. అందుకు 'కరోనా' ప్రధాన కారణం. కానీ అంతకుముందు నాలుగేళ్లుగా మొదటి త్రైమాసిక ఫలితాలను విశ్లేషిస్తే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ నుంచి అధిక వృద్ధి నమోదవుతున్న విషయం స్పష్టమవుతుంది. ఈ రెండో త్రైమాసికం నుంచి ఈ విభాగంలో మళ్లీ వృద్ధి కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఆదాయాలు ఎలా ఉన్నాయి?

ఇటీవల కాలంలో కంపెనీ ఆదాయాలు స్థిరంగా ఉన్నప్పటికీ, లాభాల్లో పెరుగుదల కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరానికి, ప్రస్తుత మొదటి త్రైమాసికానికి కంపెనీ ఆదాయాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

 

ఆదాయం, లాభం( రూ. కోట్లలో), ఈపీఎస్ (రూ.లో)
  2020-21 క్యూ1 2019-20 క్యూ1 2019-20 ఆర్థిక సంవత్సరం
ఆదాయం 707 760 3029
నికరలాభం 96 20 -160
ఈపీఎస్ 20.78 4.31 -34.55

మూలధనం, వాటాదార్లు...

షేర్ ముఖ విలువ: రూ. 5

జారీ చేసిన షేర్లు: 4,63,98,000

  • ప్రమోటర్ల వాటా: 39.90 శాతం
  • మ్యూచువల్ ఫండ్లు: 14.86 శాతం
  • విదేశీ పెట్టుబడి సంస్థలు: 2.53 శాతం
  • వ్యక్తులు:
    • విఎస్ శారద: 3.56 శాతం
    • వీకేహెచ్ డాగా: 1.91 శాతం
    • డాలీ ఖన్నా: 1.07 శాతం

 

ఫ్యూచర్ రిటైల్ షేర్లు...

హెరిటేజ్ ఫుడ్స్‌కు హెరిటేజ్ ఫ్రెష్ పేరుతో రిటైల్ స్టోర్ల వ్యాపారం ఉండేది. రిలయన్స్ ఫ్రెష్, స్పెన్సర్, మోర్, విజేత... తరహాలో హెరిటేజ్ ఫ్రెష్ స్టోర్లను విస్తరించినప్పటికీ రిటైల్ విభాగంలో బ్రేక్-ఈవెన్ స్థాయికి రావటానికే చాలా ఏళ్లు పట్టింది. పైగా నష్టాలు పేరుకుపోయాయి. దీన్ని భరించలేక హెరిటేజ్ ఫ్రెష్ స్టోర్లను ఫ్రూచర్ గ్రూప్‌నకు చెందిన ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్‌కు మూడేళ్ల క్రితం యాజమాన్యం విక్రయించింది. దీనికి ప్రతిఫలంగా ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌కు 1,78,47,429 ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ ఈక్విటీ షేర్లను కేటాయించింది. అదే విధంగా ప్రాగ్జిస్ హోమ్ రిటైల్ లిమిటెడ్ అనే కంపెనీకి చెందిన 8,92,371 షేర్లను కూడా జారీ చేసింది. ఈ షేర్లపై 3 ఏళ్ల కాలం పాటు ఉన్న లాకిన్ ఈ ఏడాది జూలై 26వ తేదీన పూర్తయింది. దీంతో ఈ షేర్లను విక్రయించాలని హెరిటేజ్ ఫుడ్స డైరెక్టర్ల బోర్డు ఈ ఏడాది సెప్టెంబర్ 11న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించింది. ఈ షేర్ల మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 140 కోట్ల వరకూ ఉంది. ఒకవేళ ఈ షేర్లను విక్రయించకుండా ఉంచినా నష్టం లేదు. రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ విలీనం అవుతున్నందున ఈ షేర్లు రిలయన్స్ రిటైల్ షేర్లుగా మారతాయి. నాలుగైదేళ్లకు రిలయన్స్ రిటైల్ ఎటూ పబ్లిక్ ఇష్యూకు వస్తుంది. అప్పుడు ఇంకా విలువ లభిస్తుంది.

 

షేర్ ధర టార్గెట్

మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించిన తర్వాత హెరిటేజ్ షేర్ ధర రూ. 370కి పెరిగింది. ఆ తర్వాత కరెక్షన్‌తో రూ. 325కు పడిపోయింది. గత పది రోజుల్లో స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గుల ఫలితంగా రూ. 300కు దిగివచ్చింది. రెండో త్రైమాసిక ఫలితాలు అనుకున్నట్లుగా ఆకర్షణీయంగా వస్తే.. మళ్లీ రూ. 370 ధర పలికే అవకాశం ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే ఇంకా పెరిగేందుకు కూడా వీలుంది. ఇది స్వల్పకాలానికి మాత్రమే.

 

కానీ అంతర్లీనంగా కంపెనీకి ఉన్న విలువను పరిగణలోకి తీసుకుంటే, వచ్చే రెండు-మూడేళ్లలో హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ఇన్వెస్టర్లకు ఎంతో ఆకర్షణీయమైన లాభాలు తెచ్చిపెట్టే అవకాశం లేకపోలేదు.tv5awards