గ్రాన్యూల్స్‌ ఇండియా ఆకర్షణీయ ఫలితాలు..

గ్రాన్యూల్స్‌ ఇండియా ఆకర్షణీయ ఫలితాలు..
  • Q2లో రూ.167 కోట్ల నికరలాభం
  • వాటాదారులకు మధ్యతర డివిడెండ్‌

గ్రాన్యూల్స్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. త్రైమాసికాదాయం రూ.858 కోట్లు ఉండగా, దానిపై రూ.164 కోట్ల నికరలాభం నమైదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.700 కోట్లు, నికరలాభం రూ.96 కోట్లుగా ఉన్నాయి. దీంతో పోల్చితే ఈ రెండో త్రైమాసికంలో ఆదాయం 22.7 శాతం, నికరలాభం 70.8శాతం పెరిగినట్లు అవుతోంది. ఆపరేటింగ్‌ లాభాల శాతం 29.9శాతం, నికరలాభాల శాతం 70.8 శాతం ఉండటం గమనార్హం. ఆదాయాల్లో వృద్ధికి కొత్త ఔషధాలు దోహదపడ్డాయి. అదే విధంగా ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఈ కంపెనీకి సంబంధించిన ఔషధాలు అధిక అమ్మకాలను నమోదు చేశాయి. అంతేకాకుండా అధిక ధరలకు విక్రయించే అవకాశం కలగడంతో నికరలాభం బాగా పెరిగే అవకాశం ఏర్పడింది.

యూఎస్‌లో కొత్త ఔషధాలకు అనుమతి..
ఈ రెండో త్రైమాసికంలో గ్రాన్యూల్స్‌ ఇండియా యూఎస్‌ మార్కెట్లో రామెల్టీయన్‌ 8ఎంజీ ట్యాబ్లెట్‌, డెక్స్‌మెథైల్‌ ఫెనిడేట్‌ హెచ్‌సీఎల్‌ క్యాప్యూల్స్‌, నాప్రాగ్జిన్‌ సోడియం-డైఫెన్‌ హైడ్రమైన్‌  ట్యాబ్లెట్లను విక్రయించడానికి అనుమతి సంపాదించింది.

తగ్గిన రుణభారం..
కంపెనీపై రుణభారం కూడా కొంత తగ్గినట్లు స్పష్టమవుతోంది. క్రితం ఏడాది ఇదే కాలం నాటితో పోల్చితే నికరలాభం 25.8శాతం తగ్గినట్లు, ప్రస్తుతం ఎబిటాలో నికర అప్పు శాతం 0.7శాతం ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

25శాతం మధ్యంతర డివిడెండ్‌..
గ్రాన్యూల్స్‌ ఇండియా తన వాటాదార్లకు ఒక్కో షేర్‌పై 25 పైసల చొప్పున(25శాతం) మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కంపెనీ షేర్‌ ముఖ విలువ రూ.1 అంటే 25శాతం మధ్యంతర డివిడెండ్‌ ఇస్తున్నట్లు అవుతుంది. మధ్యంతర డివిడెండ్‌ చెల్లించటానికి ఈనెల 30వ తేదీని రికార్డు తేదీగా ప్రతిపాదించారు. ప్రస్తుత రెండో త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ పనితీరు ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

Related Story:

(కరోనా స్టాక్).. పారాసెట్మాల్‌ ప్లే... గ్రాన్యూల్స్ ఇండియాtv5awards