IPO ఆకర్షణీయం

IPO ఆకర్షణీయం

ఇష్యూ ప్రారంభం : అక్టోబర్‌ 20
ఇష్యూ ముగింపు : అక్టోబర్‌ 22
ప్రైస్‌ బ్యాండ్‌ : రూ.32-33
లిస్టింగ్‌ తేదీ : నవంబర్‌ 2, 2020
కనీస దరఖాస్తు : 450 షేర్లు

మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు వ్యవసాయ రుణాలు, హౌసింగ్‌, వెహికిల్‌ రుణాలు, మైక్రో లెండింగ్‌ అందిస్తున్న ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఇన్వెస్ట్‌ చేసేందుకు అనుకూలంగా ఉంది. రూ.32-33 ప్రైస్‌ బ్యాండ్‌తో 8.5 కోట్ల కొత్త షేర్లను, 7.2 కోట్ల ప్రమోటర్‌ వాటా షేర్లను ఆఫర్‌ చేయడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం సంస్థ షేర్లను స్టాక్‌ ఎక్స్‌ఛేంజిల్లో లిస్ట్‌ చేయడమే. ఐపీఓ తరువాత సంస్థ ఈక్విటీలో ప్రమోటర్‌ ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ వాటా 82శాతానికి తగ్గనుంది. 

చక్కటి పనితీరు..
గత నాలుగేళ్ళలో, అంటే ప్రమోటర్‌ ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ 2016లో లిస్ట్‌ అయినప్పటి నుంచి ఈ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ తన మైక్రోఫైనాన్స్‌ పోర్ట్‌ఫోలియోను 75శాతం నుంచి 23 శాతానికి తగ్గించుకోగలిగింది. ఆ స్థానంలో వెహికిల్‌ లోన్స్‌, హోమ్‌లోన్స్‌, కార్పొరేట్‌ లోన్స్‌కు ప్రాధాన్యం పెంచుకుంటూ లెండింగ్‌ కార్యకలాపాల నాణ్యత మెరుగుపరుచుకుంది. బ్యాంక్‌ కరెంట్‌ అకౌంట్‌, సేవింగ్స్‌ అకౌంట్‌(CASA) నిష్పత్తి, ఇతర పోటీ బ్యాంక్‌లు.. ఉజ్జీవన్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులతో పోల్చితే ఎంతో మెరుగ్గా ఉంది. అదే విధంగా నిధుల సమీకరణ వ్యయం(7.6శాతం), ఆస్తులపై లభించే రాబడి (19శాతం) ఇతర పోటీ బ్యాంకుల కంటే అత్యధికంగా ఆకట్టుకుంటోంది. ప్రత్యేకించి అసెట్‌ డైవర్సిఫికేషన్‌, అత్యున్నత మేనేజ్‌మెంట్‌ నాణ్యత, ఈ ఇష్యూకి సంబంధించి హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. అయితే మారటోరియం రుణాల్లో ఎంతమేరకు వసూలు అవుతాయి, కరోనా సంక్షోభం నేపథ్యంలో చిన్న, మధ్యతరహా క్లయింట్ల నుంచి రుణాల చెల్లింపులకు సంబంధించి ఎటువంటి సవాళ్ళు ఎదురవుతాయి అన్నది అస్పష్టం.

లిస్టింగ్‌ లాభాలుంటాయా?
ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ షేర్లు నవంబర్‌ 2న లిస్ట్‌ అవుతాయి. అంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఒక్కరోజు ముందుగా కాబట్టి మార్కెట్‌ ఒడిడుదుకుల ప్రభావం లిస్టింగ్‌పై ఉండే అవకాశం ఉంది. మారటోరియం సమయంలో వడ్డీ మొత్తాలకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం, వడ్డీ మాఫీలకు సంబంధించి బలహీన వర్గాల డిమాండ్లు వంటివి షేర్‌ ధరపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
అయితే, రూ.32-33 ప్రైస్‌బ్యాండ్‌ వద్ద సంస్థ షేర్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా బుక్‌ వేల్యూతో 1.2 రెట్ల ప్రైస్‌-బుక్‌ వేల్యూ నిష్పత్తితో ఆఫర్‌ చేస్తున్నారు. ఇప్పటికే లిస్టయిన ఏయూ స్మాల్ ఫైనాన్స్‌(5.1 రెట్ల ప్రైస్‌-బుక్‌ వేల్యూ), ఉజ్జీవన్‌ (1.8 రెట్ల ప్రైస్‌-బుక్‌ వేల్యూ)తో పోల్చితే ఈక్విటాస్‌కు నిర్ణయించిన ధర ఆకర్షణీయంగా కనపడుతోంది. మార్కెట్‌ పరిస్థితులు అనుకూలంగా ఉంటే లిస్టింగ్‌ లాభాలకు ఆస్కారం ఉంది. లేనిపక్షంలో దీర్ఘకాలిక లాభాపేక్షతో అప్లయ్‌ చేయదగ్గ ఇష్యూ. కనీసం రెండేళ్ళ వ్యవధి కోసం ఇన్వెస్ట్‌ చేయండి. 



tv5awards