ఓ బిజినెస్ టైకూన్ పాశ్చాత్తాపం అంటే ఇదేనా?

ఓ బిజినెస్ టైకూన్ పాశ్చాత్తాపం అంటే ఇదేనా?

ఓ బిజినెస్ టైకూన్ పాశ్చాత్తాపం అంటే ఇదేనా?
అత్యుత్సాహం కొద్దీ కంపెనీల టేకొవర్
లాక్ డౌన్ దీనికి తోడైంది
అమ్మకం తప్ప మరో మార్గమేది?
కిషోర్ బియాని చెప్పిన వ్యాపార సత్యాలు

కిషోర్ బియానీ.. ఈ వ్యాపారవేత్త గురించి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. దేశీయ వాణిజ్యరంగంలో కింగ్ ఆఫ్ రిటైల్ గా ఎదిగారు. కోల్ కతాలో పాంటలూన్ తో మొదలై.. బిగ్ బజార్, కూపన్, లైఫ్ స్టైల్, నీలగిరీస్, ఫ్యాషన్ బజార్ ఇలా 1800 సంస్థలు స్థాపించి తిరుగులేని రిటైల్ శక్తిగా కంపెనీని తీర్చిదిద్దారు. వేల కోట్ల రిటైల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అలాంటి వ్యక్తి చివరకు అప్పులపాలై... నష్టాలు తట్టుకోలేక మొత్తం వ్యాపారాన్ని రిలయన్స్ కు రూ.24,713 కోట్లకు విక్రయించాల్సి వచ్చింది. అయితే తన కంపెనీని అమ్మడానికి కారణాలు ఓ చోట పంచుకున్నారు... ఓ రకంగా చేసిన తప్పులను ఆయన ఒప్పుకున్నారు. ఆయన మాటలు ఖచ్చితంగా మిగతా కంపెనీలకు ఓ పాఠం అవుతుందనడంలో సందేహం లేదు.

టేకొవర్లు నిండా ముంచాయి

వ్యాపారం చేసేవాళ్లు ముందుచూపుతో ఆలోచించాలంటారు. 30ఏళ్లు ముందుగానే ఉండాలంటారు. కానీ కిషోర్ బియానీ ఇందులో తడబడ్డారు. గడిచిన ఐదారేళ్లలో అత్యుత్సాహంతో చాలా కంపెనీలను టేకొవర్లు చేశారు. చిన్నచిన్న పట్టణాల్లో ఉండే సూపర్ మార్కెట్లను కూడా ఎక్కువ డబ్బుతో కొనడం జరిగింది. దీంతో చేతిలో ఉన్న లిక్విడిటీ కరిగిపోయింది. బ్యాంకుల్లో అప్పులు పెరుకుపోయాయి. కంపెనీలు చేతిలో ఉన్నాయని నమ్మకంతో ముందుకుసాగారు. రెండు మూడేళ్లలో అప్పులు తీర్చి అతిపెద్ద సంస్థగా మారుతుందని అంచనావేశారు. చాలారాష్ట్రాల్లో ఉన్న చిన్న రిటైల్ కంపెనీలను టేకొవర్ చేయడం ద్వారా తిరుగులేదని నమ్మారు. కానీ పరిస్థితులు ఇందుకు భిన్నంగా మారాయి. 
కరోనా కష్టాలు
అప్పటికే అప్పులు భారీగా పెరిగాయి. వడ్డీల భారం పడుతోంది. ఇదే సమయంలో కరోనా రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. లాక్ డౌన్ కారణంగా నష్టాలు మొదలయ్యాయి. అమ్మకాలు పడిపోయాయి. రిటైల్ రంగం నిస్తేజంగా మారింది. ఆదాయం లేదు. కానీ అద్దెలు ఆగలేదు. అప్పులపై వడ్డీలు ఆపలేము. దీంతో కంపెనీకి మూడు నెలల్లోనే రూ.7వేల కోట్ల నష్టాలు వచ్చాయి. 
ఈ కామర్స్ ఎఫెక్ట్
కంపెనీ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. లాక్ డౌన్ తర్వాత అయినా వ్యాపారం ఊపందుకుంటుందని ఆశ లేకుండాపోయింది. కోవిడ్ కారణంగా ఈకామర్స్ వ్యాపారం భారీగా పెరిగింది. అమెజాన్,ఫ్లిప్ కార్ట్, బిగ్ బాస్కెట్ కంపెనీలు రిటైల్ మార్కెట్ తినేస్తున్నాయి. జనాలు ఆన్ లైన్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఫ్యూచర్ గ్రూపు వాటా తగ్గుతోంది. జనాలు రావడం మానేశారు. ఇంకా వ్యాపారం కొనసాగించడం అంటే మరింత అప్పుల్లో కూరుకపోవడమే. ఇప్పటికే మినిమం పేమెంట్స్ కూడా చెల్లించలేని దుస్థితికి వచ్చింది కంపెనీ.

అందుకే అమ్మకం..
టేకొవర్లతో చేతిలో డబ్బులు లేవు. అప్పులు, వడ్డీలు పెరుగుతున్నాయి. టేకొవర్లు చేయకుండా లిక్విడిటీ పెట్టుకుని ఉంటే.. లాక్ డౌన్ గండం నుంచి బయటపడేందుకు అవకాశం ఉండేది. ఈ ఛాన్స్ లేదు. అటు మార్కెట్ ఈకామర్స్ వైపు వెళుతోంది. బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఇంకా జాప్యం చేస్తే మొత్తం కంపెనీయే మునుగుతుంది. అందుకే చెసిన పొరపాట్లు నుంచి బయటపడటానికి ఉన్న మార్గం కంపెనీ అమ్మకం. ఆలస్యం చేయకుండా విక్రయిస్తే మంచిదని నిర్ణయానికి వచ్చినట్టు కిషోర్ బియానీ స్వయంగా తెలిపారు. అలా మూడు దశాబ్ధాలుగా నిర్మించిన రిటైల్ సామ్రాజ్యం ఉనికి కోల్పోయింది. చేసిన పొరపాట్లు కంపెనీని పరాయిపరం చేసింది.
చూశారుగా.. వ్యాపారం విజయానికి, పతనానికి మధ్య వ్యత్యాసం. రిలయన్స్ సంస్థ అధినేత అంబానీ కంపెనీలను స్రుష్టించి అందులో వాటాలు అమ్ముతూ అప్పులు తీర్చి ఆస్తులు పెంచుకున్నారు. కిషోర్ బియానీ టేకోవర్లు విధానం మాత్రమే అనుసరించి పతనమయ్యారు. బియానీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి టేకొవర్లు, వాటాల విక్రయం మధ్య సమన్వయంతో వ్యవహరించి ఉంటే.. బిగ్ బజార్ చెక్కుచెదరకపోయేది... ఆయనే స్వయంగా అంగీకరించిన వాస్తవమిది.