టైగర్‌ ప్రాన్‌ లాంటి షేర్‌ : అవంతి ఫీడ్స్‌

టైగర్‌ ప్రాన్‌ లాంటి షేర్‌ : అవంతి ఫీడ్స్‌

అవంతీ ఫీడ్స్ లిమిటెడ్
షేర్ ముఖ విలువ రూ.1
ప్రస్తుత ధర: రూ.506
52వారాల కనిష్ట- గరిష్ట ధర: రూ.250- రూ.769
పీఈ: 23
ప్రైస్ టు బుక్ వాల్యూ: 5.74

ప్రతిరంగంలో అగ్రగామి కంపెనీలుంటాయి. వాటిని మార్కెట్ లీడర్స్ అంటారు. అటువంటి కంపెనీయే అవంతీ ఫీడ్స్.  S&P BSE500 సూచీలో ఉన్న ఈ కంపెనీ రొయ్యల మేత తయారీలో అగ్రగామి సంస్థ. రొయ్యల మేతతో పాటు, రొయ్యల ప్రాసెస్ చేసి ఎగుమతి చేసే సంస్థ కూడా అయినా అవంతి ఫీడ్స్ కు ఈ విభాగంలో పరిమితమైన పోటీ మాత్రమే ఉంది. అంతేగాక రొయ్యల, చేపల పెంపకం, ఎగుమతుల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఈసంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. అందుకే స్థిరంగా ఆదాయాలు, లాభాలు ఆర్జిస్తూ ముందుకు సాగుతోంది. గత పదేళ్ల కాలంలో ఫీడ్ తయారీలో, రొయ్యల చేపలు, రొయ్యల చెరువులు సాగుచేసే రైతులతో బలమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుంది. అంతేగాక థాయ్ ల్యాండ్ కు చెందిన థాయ్ యూనియన్ PCLతో వ్యాపార భాగస్వామ్యం ఉంది. ఒక్కో త్రైమాసికానికి దాదాపు రూ.100 కోట్ల నికరలాభాన్ని ఆర్జిస్తున్న ఫలితంగా కంపెనీ బ్యాలెన్స్ షీట్ బలంగా కనిపిస్తోంది. కంపెనీకి దీర్ఘకాలిక రుణభారం లేదు. ఈ నేపథ్యంలో అవంతీ ఫీడ్స్, కేవలం స్వల్ప కాలానికే కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడికి కూడా ఆకర్షణీయమేనని చెప్పవచ్చు.కాబట్టి ఇన్వెస్టర్లు దీన్ని తప్పనిసరిగా పరిశీలించాలి.

కంపెనీ పనితీరు..
*2019-20 ఆర్థిక సంవత్సరానికి అవంతీ పీడస్ రూ.4185.52 కోట్ల ఆదాయాన్ని, 346.48 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వార్షిక ఈపీఎస్ రూ.25.43 నమోదు అయింది.
*ప్రస్తుతం ఆర్లిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఆదాయం 982.75 కోట్లు, నికరలాభం రూ.115.71 కోట్లుగా నమోదైంది. త్రైమాసిక ఈపీఎస్ రూ.7.64 ఉంది. మొదటి త్రైమాసికం నాటికి కోవిడ్ -19 మహమ్మారి తీవ్రంగా అధికంగా ఉండి అన్ని రకాలైన కార్యకాలాపాలు నిలిచిపోయినప్పటికీ అవంతీ ఫీడ్స్ ఆ సవాళ్లను అధిగమించి మెరుగైన లాభాలు నమోదు చేయగలిగింది.
*మొదటి త్రైమాసికంలో ఆదాయం అంతకుముందు ఏడాది ఇదే కాలంలో పోల్చితే స్వల్పంగా తగ్గినప్పటికీ, ఏబిటా( వడ్డీ, పన్ను, తరుగుదల, కేటాయింపుల కంటే ముందు ఆదాయం) మిగులు 100 బేసిస్ పాయింట్లు పెరగడం గమనార్హం.
*ష్రింప్ పీడ్ వ్యాపారంలో అవంతీ పీడ్స్ కు ఇంత పోటీ మార్కెట్లోనూ 48శాతం మార్కెట్ ఉండటం ప్రత్యేకత. 
*ఇటీవల కంపెనీ ఆదాయాలను విశ్లేషిస్తే, యూఎస్ విక్రమాలు తగ్గినట్టు, అదే సమయంలో ఆసియా దేశాల నుంచి ఆదాయాలు పెరిగినట్టు స్పష్టమవుతుంది. కానీ ప్రస్తుతం రెండో త్రైమాసికంలో పరిస్థితి మారుతుందని, US అమ్మకాలు మళ్లీ పెరుగుతాయని కంపెనీ యాజమాన్యం ఇటీవల స్పష్టం చేసింది.
*కంపెనీ ఆదాయాల్లో వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ వాటా ఏటేటా పెరుగుతోంది. ఇదొక సానుకూలత.
*కంపెనీ కొత్త ష్రింప్  హేచరీ ఒకదాన్ని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు మొదటిదశ దాదాపు పూర్తి కావొస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి అయినా దీన్ని ఉత్పత్తి దశలోకి తీసుకరావాలని యాజమాన్యం ప్రయత్నిస్తోంది.
*ఈ కంపెనీకి అప్పు లేదు. బుక్స్ లో రూ.1000 కోట్లుకు పైగా నగదు కనిపిస్తోంది.

రెండవ త్రైమాసికం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికానికి (జులై-సెప్టెంబరు) వచ్చే నెల మొదటివారంలో అవంతీ ఫీడ్స్ ఫలితాలు వెలువడవచ్చు.ఆదాయం, నికరలాభం మెరుగ్గా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాల ద్వారా తెలిస్తోంది. యూఎస్ మార్కెట్ నుంచి ఆదాయాలు పెరుగుతాయని ఇంతకుముందే యాజమాన్యం స్పష్టం చేసింది. దాని ప్రకారం నికరలాభం 10 నుంచి 15శాతం పెరిగే అవకాశం ఉంది.
మార్కెట్ క్యాప్
ప్రస్తుతం షేరు ధర ప్రకారం అవంతీ ఫీడ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,890 కోట్ల వరకూ ఉంది. గరిష్టంగా ఓ దశలో దీనికి రూ.10వేల కోట్ల వరకూ మార్కెట్ విలువ లభించిన విషయం గమనార్హం. 
షేర్ హోల్డింగ్ పాట్రన్
అవంతీ ఫీడ్స్ జారీ మూలధనం రూ.13.62 కోట్లు ( రూ.1 ముఖ విలువ కల 13,62,45,630 ఈక్విటీ షేర్లు)

ప్రమోటర్ల వాటా: 43.69
విదేశీ సంస్థలు : 32.7
దేశీయ సంస్థలు : 17.4
ఏపీఐడీసీ: 2.72

షేర్ ధర లక్ష్యం
ఒక్కో త్రైమాసికానికి రూ.1000 కోట్ల వరకూ ఆదాయాన్ని, రూ.100 కోట్లకు పైగా నికరలాభాన్ని ఆర్జిస్తున్న కంపెనీ అవంతీ ఫీడ్స్ పరిస్థితులను బట్టి వ్యాపారం కాస్త అటూ ఇటూ కావొచ్చు కానీ, మొత్తం మీద చూస్తే వ్యాపార పరంగా పెద్దగా ఇబ్బందులు లేని సంస్థ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఈ సంస్థ రూ.450 కోట్ల నుంచి 500 కోట్ల నికరలాభాన్ని సంపాదించే అవకాశం ఉంది. దాని ప్రకారం చూస్తే రూ.30కి పైగా ఈపీఎస్ నమోదు అవుతుంది. దీనికి 25 పీఈ ప్రకారం లెక్కించినా ఈ కంపెనీ షేర్ ధర రూ.750 ఉండాలి. అందువల్ల ప్రస్తుతం రూ.500 దగ్గర ఉన్న అవంతీ ఫీడ్స్ షేరును ధర తగ్గినా ప్రతిసారీ కొనుగోలు చేస్తే ఇన్వెస్టర్లకు మంచి ఫలితం ఉంటుంది. ప్రస్తుతం రెండో త్రైమాసిక ఫలితాల తర్వాత అవంతీ ఫీడ్స్ షేర్ ధర రూ.600 మంచిపోయే అవకాశం లేకపోలేదు.