అరబిందో ఫార్మా ఆదాయాలకు కొవిడ్-19 కిక్కు..!

అరబిందో ఫార్మా ఆదాయాలకు కొవిడ్-19 కిక్కు..!

షేర్ ధర: రూ. 818 (02.01.2020 నాడు బీఎస్ఈలో ముగింపు ధర)

మార్కెట్ క్యాప్: రూ.48,000 కోట్లు (దాదాపు)

షేర్ ముఖ విలువ: రూ.1

జారీ మూలధనం: రూ.58.59 కోట్లు (58,59,38,609 షేర్లు)

ప్రమోటర్ల వాటా: 52 శాతం

మ్యూచువల్ ఫండ్లు: 12.2 శాతం

విదేశీ సంస్థలు: 22.63 శాతం

హైదరాబాద్ నుంచి ఒక్కో త్రైమాసికంలో రూ. 600 కోట్లకు పైగా నికరలాభాన్ని ఆర్జిస్తున్న అగ్రశ్రేణి ఔషధ కంపెనీల్లో అరబిందో ఫార్మా ఒకటి. దేశీయ ఔషధ పరిశ్రమలో ఈ కంపెనీది ప్రత్యేకమైన స్థఆనం. రెండు దశాబ్దాల క్రితం ఇతర కంపెనీల మాదిరిగానే చిన్నగా ఈ కంపెనీ ప్రస్థానం మొదలైంది. కానీ అగ్రెసివ్ లీడర్‌షిప్‌తో శరవేగంగా ఎదిగింది. ఎంతగానంటే యూఎస్ మార్కెట్లో ఎన్నో ఏళ్ల నుంచి తిష్ఠ వేసి ఉన్న ఐరోపా, ఇజ్రాయెల్, అమెరికా దేశాలకు చెందిన జనరిక్ ఫార్మా కంపెనీలను సవాలు చసే స్థాయికి ఎదిగింది. ఒక దశలో శాండోజ్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధపడి యూఎస్‌లోని టాప్-10 జనరిక్ కంపెనీల జాబితాలో స్థానం సంపాదించేదే. కానీ ఆ డీల్ వెనక్కి పోవడంతో ఆ అవకాశం మిస్సయింది. అయినప్పటికీ యూఎస్‌తో పాటు ప్రపంచ ఔషధ విపణిలో బలంగా పాగా వేసి వేగంగా విస్తరిస్తున్న కంపెనీగా గుర్తింపు సంపాదించింది.

అన్నిరకాలుగా సత్తా...

  • గత కొన్నేళ్లలో ఫార్మా రంగంలో అన్ని రకాలుగా ఈ కంపెనీ సత్తా సంపాదించుకుంది. ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఎంతగానో పెంచుకుంది. అంతేగాక రెగ్యులేటెడ్ మార్కెట్లలో నియంత్రణ సంస్థల నుంచి (ఉదాహరణకు – యూఎస్ఎఫ్‌డీఏ) ఎదరయ్యే కఠినమైన ప్లాంట్ – ప్రాసెస్ ఆడిట్‌లను పరిగణలోకి తీసుకుని నాణ్యతా ప్రమాణాలను పెంపొందించడంపై కంపెనీ యాజమాన్యం దృష్టి సారించింది. తత్ఫలితంగా యూఎస్ఎఫ్‌డీఏ ఆంక్షల నుంచి బైటకు వచ్చింది.
  • అరబిందో ఫార్మాకు చెందిన ‘ఇంజెక్టబుల్స్ వ్యాపారం’ బాగా కోలుకుని వృద్ధి బాట పడుతోంది.
  • కేన్సర్, ఇన్‌హేలర్స్, బయోసిమిలర్స్, వ్యాక్సిన్స్, ప్యాచెస్.. ఇలా అన్ని రకాలైన ఔషధ విభాగాల్లో కొత్త ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.
  • యూఎస్ మార్కెట్లో ఒక ఎండీఐ (మీటర్డ్ డోస్ ఇన్‌హేలర్), మరొక నాసల్ స్ప్రే విడుదల చేయడం కోసం యూఎస్ఎఫ్‌డీఏ వద్ద దరఖాస్తు దాఖలు చేసింది. అంతేగాక ఈ ఆర్థిక సంవత్సరంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌డెర్మల్ ప్యాచ్ విడుదల చేసే అవకాశం ఉంది.
  • కొవిడ్-19 తో సహా రెండు రకాలైన వైరల్ వ్యాక్సిన్లను విడుదల చేసేందుకు అరబిందో ఫార్మా ప్రయత్నాలు చేస్తోంది.
  • ఐరోపా దేశాల్లో ఇటీవల కలంలో కొవిడ్-19 వల్ల వ్యాపారం మందగించినప్పటికీ మళ్లీ కోలుకుంటున్నట్లు సమాచారం.
  • ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వైరల్ మందుల విక్రయాలు బాగా నమోదయ్యాయి. దీని ప్రకారం అరబిందో ఫార్మా మెరుగైన లాభాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

యూఎస్‌లో పాగా

అరబిందో ఫార్మా గత కొన్నేళ్లలో అమెరికా మార్కెట్లో బాగా పాగా వేసిందని చెప్పాలి. తాజాగా ఈ కంపెనీకి యూఎస్‌లో 410 ఔషధాలకు ఏఎన్‌డీఏ అనుమతులు ఉన్నాయి. మరో 28 ఔషధాలకు తాత్కాలిక అనుమతులు లభించాయి. యూఎస్ఎఫ్‌డీఏ వద్ద పెండింగ్‌లో 166 ఔషధాలు ఉన్నాయి. ఇవి కాక ఇంజక్టబుల్స్ విభాగంలో మరికొన్ని అనుమతులు ఉన్నాయి. దీనికి తగ్గట్లుగా యూఎస్‌లో కంపెనీ ఆదాయాలు ఏటేటా పెరుగుతున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికాన్నే తీసుకుంటే, యూఎస్ ఆదాయలు 15.6 శాతం పెరిగి రూ. 3,107 కోట్లకు చేరడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ఆదాయంలో ఇది 52.4 శాతం. ప్రతి త్రైమాసికంలోనూ యూఎస్ మార్కెట్లో కొత్త ఔషధాలు విడుదల చేస్తోంది. ప్రస్తుత మొదటి త్రైమాసికంలో ఒక ఇంజెక్టబుల్ ఔషధంతో సహా 6 కొత్త ఔషధాలను యూఎస్ మార్కెట్‌కు అందించింది. సమీప భవిష్యత్తులో యూఎస్ ఆదాయాలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అరబిందో ఫార్మాకు లభించిన ఔషధ అనుమతులను పరిగణలోకి తీసుకుంటే స్పష్టమవుతుంది.

శాండోజ్ అనే కంపెనీకి యూఎస్‌లో ఉన్న డెర్మటాలజీ ఔషధాలు, ఓరల్ సాలిడ్స్ మందులతో సహా ఆ సంస్థకు చెందిన కొన్ని ఆస్తులను కొనుగోలు చేయడానికి అరబిందో ఫార్మా కొద్దికాలం క్రితం సిద్ధపడింది. అంతా సిద్ధం అయ్యాక ఆ ప్రతిపాదనను విరమించుకుంది. దీనివల్ల యూఎస్‌లో టాప్-10 జనరిక్ ఔషధాల జాబితాలో స్థానం సంపాదించే అవకాశాన్ని అరబిందో కోల్పోయింది. అయినప్పటికీ యూఎస్‌లో జనరిక్ ఫార్ములేషన్ల విభాగంలో ఆర్గానిక్ వృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 20కి పైగా ఔషధాలను యూఎస్ మార్కెట్లోకి ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు యాజమాన్యం స్పష్టం చేస్తోంది. ఇందులో 6 ఔషధాలను ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో విడుదల చేశారు. మరోపక్క శాండోజ్ కొనుగోలుకు కొంత అప్పు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఆ విధంగా రుణభారం పెరగకుండా జాగ్రత్త వహించినట్లు అయింది.

వ్యాక్సిన్ల తయారీ

అరబిందో ఫార్మా అంటే సింథటిక్ ఔషధాలైన ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్, ఇంజక్టబుల్స్ మాత్రమే తయారు చేసే కంపెనీ అని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ కంపెనీ వ్యాక్సిన్ల తయారీలో సమీప భవిష్యత్తులో అత్యంత క్రియాశీలకంగా మారబోతోందనే విషయం ఎక్కువమందికి తెలియదు. ఏది చేసినా ‘జెయింట్’ మాదిరిగా బిగ్ స్కేల్‌లో చేయడం అరబిందోకు అలవాటు. యూఎస్ మార్కెట్‌లో పాగా వేసింది అలాగే. ఇప్పుడు ఇదే పద్ధతిలో వైరల్ వ్యాక్సిన్ల తయారీలో శరవేగంగా ముందుకు అడుగులు వేస్తోంది. దీనికి అనుగుణంగా హైదరాబాద్ సమీపంలో అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. అదే సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ నిమిత్తం అవసరమైన భాగస్వామ్యాలు కుదుర్చుకుని, అనుమతులు సంపాదించే పనిలో పడింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి అనుబంధం ఉన్న బీఐఆర్ఏసీ (బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అరబిందో ఫార్మాకు యూఎస్ సబ్సిడరీ అయిన ఆరో వ్యాక్సిన్స్ ఇప్పటికే వ్యాక్సిన్ల తయారీకి సంబంధించిన పలు రకాలైన ప్లాట్‌ఫామ్‌లను సిద్ధం చేసుకుంటోంది. దీని ద్వారా కేవలం కొవిడ్-19 వ్యాక్సిన్లే కాకుండా పలు రకాలైన వైరల్ వ్యాక్సిన్లు తయారు చేసే అవకాశం ఉంది. ఇటువంటి సహకార ఒప్పందాన్నే (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) సారధ్యంలోని సీసీఎంబీ- హైదరాబాద్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ – చండీఘడ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ – కోల్‌కతా తో కుదుర్చుకుంది. దీని ప్రకారం ఈ సంస్థల్లో ల్యాబ్‌లో ఆవిష్కరించిన వైరల్ వ్యాక్సిన్లను అరబిందో ఫార్మా అభివృద్ధి చేసి, విక్రయించే అవకాశం ఉంటుంది. వ్యాక్సిన్ల విభాగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీ తక్కువ. కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే ఉంటాయి. మన దేశం విషయానికి వస్తే... వ్యాక్సిన్ల తయారీలో నాలుగైదు కంపెనీల కంటే లేవు. దీన్ని బట్టి ఈ విభాగంలో సమీప భవిష్యత్తులో అరబిందో ఫార్మా అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతుంది.

తగ్గుతున్న రుణభారం

ఈ కంపెనీ గత కొంతకాలంగా రుణ భారాన్ని తగ్గించుకుంటూ వస్తోంది. 2018 మార్చి నెలాఖరు నాటికి స్థూల అప్పు 731 మిలియన్ డాలర్లు ఉండగా, 2020 జున్ నెలాఖరు నాటికి ఇది 633 మిలియన్ డాలర్లకు తగ్గింది. అంటే రెండేళ్లలో దాదాపు 100 మిలియన్ డాలర్ల మేరకు అప్పు తగ్గినట్లు స్పష్టమవుతోంది. అంతేగాక ప్రస్తుతం ఉన్న 633 మిలియన్ డాలర్ల అప్పులో 450 మిలియన్ డాలర్లు వర్కింగ్ కేపిటల్ రుణమే. మిగిలిన 183 మిలియన్ డాలర్లు మాత్రమే దీర్ఘకాలిక రుణం. అందువల్ల ఇంకా అప్పు చేసే అవకాశం లేదు. పైగా సమీప భవిష్యత్తులో కంపెనీ ఆదాయాలను పరిగణలోకి తీసుకుంటే వచ్చే రెండేళ్లలో రుణభారం పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది.

అరబిందో ఫార్మా షేర్ ధర, వాల్యుయేషన్

ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరానికి రూ. 49 ఈపీఎస్ నమోదు చేసింది. వచ్చే రెండేళ్ల కాలంలో వృద్ధి బాట కొనసాగించే అవకాశం ఉంది. ఈపీఎస్ వృద్ధి ఏటా సగటున 15-20 శాతం నమోదు కావచ్చు. దీని ప్రకారం ఆదాయాలు ఇలా ఉండవచ్చు.

ఆర్థిక సంవత్సరం

ఆదాయం

నికర లాభం

ఈపీఎస్

పీఈ

2019-20

23,100

2,800

49

16

2020-21

25,500

3,450

59

13

2021-22

27,500

3,800

65

12

(ఆదాయం, నికర లాభం రూ. కోట్లలో., ఈపీఎస్ రూపాయల్లో...)

 

ప్రస్తుత స్టాక్‌మార్కెట్లో దేశీయ ఫార్మా కంపెనీల షేర్ల ధరలు 30 పీఈ (ప్రైస్ ఎర్నింగ్స్) నిష్పత్తిలో కనిపిస్తున్నాయి. దీంతో పోల్చితే అరబిందో ఫార్మా షేర్ ధర చౌకే అనుకోవాలి. కనీసం 20 పీఈ ప్రకారం లెక్కించినా ఈ షేర్ ధర రూ. 1,000 ఉండాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం తర్వాత ఈ షేర్‌ను, ఫార్వార్డ్ ఈపీఎస్ ప్రకారం లెక్కిస్తే రూ. 1,200 పలకవచ్చు. అందువల్ల ఇన్వెస్టర్లు ధర తగ్గిన ప్రతిసారీ ఈ షేర్‌ను కొనుగోలు చేసి ఒక ఏడాదికాలం పాటు ఎదురుచూస్తే, మంచి లాభాలు దక్కుతాయి. ఇక్కడి నుంచి కనీసం 50 శాతం ప్రతిఫలం తప్పనిసరిగా లభిస్తుంది. గత కొద్ది మాసాలుగా ఈ షేర్ రూ. 800కు అటుఇటుగా కన్సాలిడేట్ అయింది. ఏదో ఒక సందర్భంలో  బ్రేక్అవుట్ వచ్చే అవకాశం ఉంది. రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా అటువంటి అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే షేర్ ధర రూ. 1,000కి మించిపోతుంది.