ఈనెల 29 నుంచి లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఐపీఓ

ఈనెల 29 నుంచి లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఐపీఓ

             సెప్టెంబర్‌లో ఐపీఓల జోరు కొనసాగుతోంది. ఈనెల్లో ఇప్పటికే హ్యాపియెస్ట్‌ మైడ్స్‌, కెమ్‌ స్పెషాలిటీ కెమికల్స్‌, క్యామ్స్‌ ఐపీఓలు క్లిక్‌ కావడంతో మరిన్ని కంపెనీలు ఐపీఓ బాట పడుతోన్నాయి. తాజాగా హైదరాబాద్‌ కంపెనీ కూడా పబ్లిక్‌ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించనున్నట్టు ప్రకటించింది. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

             ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్‌ లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఐపీఓకు వస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఈ కంపెనీ ఐపీఓ సెప్టెంబర్ 29న ప్రారంభమై, అక్టోబర్‌ 1న ముగియనుంది. ఇష్యూలో భాగంగా బుక్‌ బిల్డింగ్‌ పద్ధతిలో కొత్తగా 51 లక్షల షేర్లను కంపెనీ జారీ చేయనుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.61.20 కోట్ల నిధులను సమీకరించనుంది. ప్రస్తుతం ఈ సంస్థలో ప్రమోటర్లకు 99.96 శాతం వాటా ఉండగా... ఐపీఓ తర్వాత వీరి షేర్‌ హోల్డింగ్‌ 74.11 శాతానికి తగ్గనుంది. 

             ఇష్యూ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.117 నుంచి 120గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఇష్యూకు అప్లయ్‌ చేయాలంటే కనీసం 125 షేర్లకు దరఖాస్తు చేయాలి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో తమ సంస్థ లిస్ట్‌ అవుతుందని, ఈ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను సంస్థ మూలధన అవసరాల కోసం వినియోగించనున్నట్టు లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.

 కంపెనీ ప్రత్యేకతలు..
             లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్ల  నిర్మాణ ప్రాజెక్టులతో పాటు సిటీ గ్యాస్‌ పంపిణీ ప్రాజెక్టుల నిర్వహణ సేవలను సైతం విజయవంతంగా అందిస్తోంది. భారత్‌- నేపాల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ నిర్మించిన ప్రత్యేకత ఈ కంపెనీ సొంతం. 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 600 కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్లను నిర్మించిన అనుభవం ఈ కంపెనీకి ఉంది. ఈ ఏడాది జులై నెలాఖరు నాటికి కంపెనీ చేతిలో రూ.663 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఉన్నాయి. 

    కంపెనీ బలాలు..
             ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ ఇండస్ట్రీపై మేనేజ్‌మెంట్‌కు ఎంతో పట్టుఉండటం, కంపెనీ ట్రాక్‌ రికార్డ్ ఎంతో మెరుగ్గా ఉండటం‌, కస్టమర్లతో సత్సంబంధాలు, స్ట్రాంగ్‌ ఫైనాన్షియల్‌ పెర్ఫామెన్స్‌, డెట్‌ ఈక్విటీ రేషియో తక్కువగా ఉండటం ఈ కంపెనీకి ప్లస్‌ పాయింట్స్‌గా చెప్పొచ్చు‌. ఇక ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల్లో కేంద్రం 100 శాతం విదేశీ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో రాబోయే రోజుల్లో తమ సంస్థ పెద్ద ఎత్తున కాంట్రాక్టులను దక్కించుకునే అవకాశముందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.