ఎస్ఎంఎస్ ఫార్మాకు ‘దివీస్’ అండ..

ఎస్ఎంఎస్ ఫార్మాకు ‘దివీస్’ అండ..

 

  • అనుబంధ కంపెనీలో వాటా కొనుగోలు చేసే అవకాశం

హైదరాబాద్‌కు చెందిన ఎస్ఎంఎస్ ఫార్మాకు అగ్రశ్రేణి ఔషధ సంస్థ అయిన దివీస్ ల్యాబ్స్ ప్రమోటర్లు అండగా నిలవబోతున్నారు. ఎస్ఎంఎస్ ఫార్మా అనుబంధ కంపెనీ అయిన వీకేటీ ఫార్మాలో కొంత వాటాను దివీస్ ప్రమోటర్లు కొనుగోలు చేయబోతున్నారని స్థానిక మార్కెట్ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతోంది. దివీస్ ప్రమోటర్లతో, ఎస్ఎంఎస్ ఫార్మా ఎండీ పొట్లూరి రమేష్ బాబుకు వ్యక్తిగతంగా ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. ఎస్ఎంఎస్ ఫార్మా ప్రారంభించిన తొలినాళ్లలో, రమేష్ బాబుకు అన్ని రకాలు దివీస్ ల్యాబ్స్ ఛైర్మన్ దివి మురళి ఎంతగానో చేయూతనిచ్చినట్లు స్థానికంగా చెప్పుకుంటారు. ఆ తర్వాత కూడా అదే స్థాయిలో మంచి సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి ఎస్ఎంఎస్ ఫార్మా ఎండీ రమేష్ బాబుకు, దివీస్ ఛైర్మన్ అండదడలు అందించబోతున్నారని చెప్పుకుంటున్నారు.

 

వాటాల మార్పిడి తీరు..

కొంతకాలం క్రితం ఎస్ఎంఎస్ ఫార్మా రెండు కంపెనీలుగా విడిపోయింది. అందులో ఒకటి మాతృ సంస్థ అయిన ఎస్ఎంఎస్ ఫార్మా కాగా, మరొకటి ఎస్ఎంఎస్ లైఫ్‌సైన్సెస్. ఎస్ఎంఎస్ ఫార్మాలో పొట్లూరి రమేష్ బాబుతో పాటు ఆయన సహచరుడైన తాళ్లూరి మూర్తికి వాటాలు ఉన్నాయి. ఇద్దరూ ప్రమోటర్ల కేటగిరీలోనే ఉన్నారు. తమ తర్వాతి తరం కుటుంబ సభ్యులు వ్యాపారంలోకి వస్తుండడంతో, ఇద్దరూ విడిపోయి ఎవరి కంపెనీని వారు నిర్వహించుకోవాలనే అభిప్రాయానికి వచ్చిన దరిమిలా, రెండేళ్ల క్రితం ఎస్ఎంఎస్ ఫార్మా నుంచి ఎస్ఎంఎస్ లైఫ్‌సైన్సెస్‌ను విడదీశారు. Ramesh-babu-Potluriఅనంతరం ప్రధానంగా ఎస్ఎంఎస్ ఫార్మాను రమేష్ బాబు, ఎస్ఎంఎస్ లైఫ్‌సైన్సెస్‌ను తాళ్లూరి మూర్తి చూసుకుంటున్నారు. కానీ రెండు కంపెనీల్లో ఇద్దరికీ షేర్లు అలాగే ఉండిపోయాయి. ఈ షేర్లను పరస్పరం మార్చుకుంటే కానీ, ఇద్దరూ పూర్తిగా విడిపోయినట్లు కాదు. అందుకు ఎస్ఎంఎస్ ఫార్మాలో మూర్తికి ఉన్న షేర్లను రమేష్ బాబు కొనుక్కుంటే, ఎస్ఎంఎస్ లైఫ్‌సైన్సెస్‌లోని రమేష్ బాబు షేర్లను మూర్తి కొనుగోలు చేయాలి. దాంతో ఎవరికి వారికి, వాళ్ల కంపెనీ వ్యవహారాలపై పూర్తి అజమాయిషీ దక్కినట్లు అవుతుంది. కానీ ఇది అంత సులువైన వ్యవహారం కాదు. ఎస్ఎంఎస్ ఫార్మాలో మూర్తికి ఉన్న షేర్ల విలువ (ప్రస్తుతం ఎస్ఎంఎస్ ఫార్మా షేర్ ధర ప్రకారం...) రూ. 150 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అదే సమయంలో ఎస్ఎంఎస్ లైఫ్‌లో రమేష్ బాబుకు ఉన్న షేర్ల విలువ రూ. 100 కోట్ల లోపే ఉంటుంది. అంటే అదనంగా రమేష్ బాబు రూ. 50 -60 కోట్లు తీసుకురావలసి వస్తుంది. ఇక్కడే ఆయనకు ఇతరుల మద్దతు అవసరమవుతోంది.

 

వీకేటీ ఫార్మాలో డీల్...

ఎస్ఎంఎస్ ఫార్మాకు వీకేటీ ఫార్మా అనుబంధ కంపెనీగా ఉంది. అందులో రమేష్ బాబుకు, ఆయన సన్నిహితులకు వ్యక్తిగతంగా 58 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వాటా విక్రయించి, వచ్చే ఆ సొమ్ముతో ఎస్ఎంఎస్ ఫార్మాలో షేర్లు కొనుగోలు చేయాలని రమేష్ బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఈ వాటా కొనుగోలుదార్ల కోస ఆయన చూస్తున్నట్లు, ఈ క్రమంలో దివీస్ ల్యాబ్స్ ప్రమోటర్లు తమ వ్యక్తిగత హోదాలో వీకేటీ ఫార్మా వాటా తీసుకుంటారని అనుకుంటున్రు. తదుపరి ఆ సొమ్ముతో రమేష్ బాబు ఎస్ఎంఎస్ ఫార్మాలోని మూర్తి షేర్లు కొనుగోలు చేసేందుకు వీలు కలుగుతుంది. అదే జరిగితే ఎస్ఎంఎస్ ఫార్మాకు, దాని ప్రమోటర్ అయిన రమేష్ బాబు ఎంతో బలమైన ‘దివీస్’ అండదండలు లభించినట్లు అవుతుంది.

 

ఈ వ్యవహారం గత కొద్దిరోజులుగా స్టాక్ మార్కెట్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అందుకే ఇటీవల కాలంలో ఎస్ఎంఎస్ ఫార్మా, ఎస్ఎంఎస్ లైఫ్‌సైన్సెస్ షేర్లకు కొనుగోలుదార్లు అధికంగా కనిపిస్తున్నారు. ఎస్ఎంఎస్ ఫార్మా కౌంటర్లో ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా బాగా అధికంగా నమోదు కావడానికి, షేర్ ధర పైపైకి ఉండడానికి కూడా ఇదే కారణమని భావిస్తున్నారు. దీంతోపాటు ఎస్ఎంఎస్ లైఫ్‌సైన్సెస్ షేర్ ధర బాగా పెరుగుతోంది. వాస్తవానికి ఎస్ఎంఎస్ లైఫ్‌సైన్సెస్ ‘ర్యానిటిడిన్’ ఔషధంపై అధికంగా ఆధారపడిన కంపెనీ. దీనికి ఇతర ఔషధాల తయారీ తక్కువ. ర్యానిటిడిన్‌పై యూఎస్ఎఫ్‌డీఏ నిషేధం ఉన్నందున మార్కెట్లో ఈ ఔషధానికి కొనుగోలుదార్లు లేరు. అందువల్ల ఇప్పటికిప్పుడు ఎస్ఎంఎస్ లైఫ్‌సైన్సెస్ ఆధాయాలు, లాభాలు పెరగడానికి కానీ... ఈ కంపెనీ షేర్ ధర పెరగడానికి కానీ పెద్దగా అవకాశాలు లేవు. అయినా అటు ఎస్ఎంఎస్ ఫార్మా, ఇటు ఎస్ఎంఎస్ లైఫ్‌సైన్సెస్ షేర్లు స్టాక్‌మార్కెట్లో ఆకర్షణీయంగా పెరుగుతున్నాయంటే... దానికి పరస్పరం ఈక్విటీ షేర్ల మార్పిడి, ఎస్ఎంఎస్ ఫార్మాకు దివీస్ ల్యాబ్స్ ప్రమోటర్ల అండదండలు ఉండమే కారణమని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 

దివీస్ ల్యాబ్స్ ప్రత్యేకతల గురించి చెప్పాలంటే..

దివీస్ ల్యాబ్స్ ప్రత్యేకతల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. దేశంలోని అగ్రగామి ఫార్మా కంపెనీల్లో ఇది ఒకటి. దాదాపు రూ. 80,000 కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్‌తో, త్రైమాసికానికి దాదాపు రూ. 400 కోట్ల నికర లాభంతో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఫార్మా కంపెనీగా ఉంది. బల్క్ డ్రగ్స్, ఏపీఐ ఔషధాల్లో ఈ కంపెనీకి తిరుగులేదు. ఈ కంపెనీ ఒక్కో త్రైమాసికానికి రూ. 500 కోట్ల నికర లాభాన్ని త్వరలో మించిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. కేవలం పాతికేళ్ల ప్రస్థానంలో అనూహ్యంగా ఎదిగిన కంపెనీ అయిన దివీస్ ప్రమోటర్లకు రూ. 50 కోట్లు – రూ. 100 కోట్లు పెద్ద సొమ్ము కాదు. అందువల్ల వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా, ఎస్ఎంఎస్ ఫార్మాకు అండగా నిలవాలనుకుంటే, వారికి అది పెద్ద సమస్య కాదని స్థానికంగా కార్పొరేట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.