దీర్ఘకాలిక లాభాల కోసం.. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ

దీర్ఘకాలిక లాభాల కోసం.. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ

హెచ్‌డీఎఫ్‌సీ గ్రూపు నుంచి ఇప్పటివరకూ మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చి స్టాక్ మార్కెట్లో నమోదయ్యాయి. ఆ మూడు కంపెనీలు మల్టీబ్యాగర్లు అయ్యాయి. దీర్ఘకాలిక మదుపరులకు ఎంత సంపద సృష్టించాయి. అవి: హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ.

 

అదే కోవలోకి వచ్చిన మరొక కంపెనీ - హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.

 

హెచ్‌డీఎఫ్‌సీ గ్రూపు నుంచి మరొక కంపెనీ ఎప్పుడు పబ్లిక్ ఇష్యూకు వస్తుందా, ఎప్పుడు మనకు పెట్టుబడి అవకాశం లభిస్తుందా…? అని ఇన్వెస్టర్లు ఎన్నో ఏళ్లపాటు ఎదురుచూశారు. ఎట్టకేలకు రెండేళ్ల క్రితం హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యకు వచ్చింది. పబ్లిక్ ఇష్యూలో లేదా ఆ తర్వాత స్టాక్ ఎక్స్‌ఛేంజీల్లో ఈ షేర్‌ను కొనుగోలు చేసిన వారికి ఇప్పటికే ఆకర్షణనీయమైన లాభాలు కనిపిస్తున్నాయి. కానీ ఇది ఇంతటితో అయిపోయే వ్యవహారం కాదు. వచ్చే కొన్నేళ్ల పాటు ‘క్యాష్ జనరేటింగ్ మెషీన్’ మాదిరిగా ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు లాభాలు పండిస్తూ ఉంటుంది. మన దేశంలో ఇప్పుడిపపుడే బీమా రంగం విస్తరణ వేగాన్ని సంతరించుకుంటోంది. దీనికి తగ్గట్లుగా ఈ రంగంలో ఉన్న ఈ కంపెనీలకు ప్రీమియం ఆదాయాలు, లాభాలు పెరుగుతున్నాయి. ఈ పరుగు అందిపుచ్చుకున్న వారికి తమ పెట్టుబడులను రెట్టింపు చేసుకునే అవకాశం ఉంటుందని వేరేగా చెప్పాల్సిన పని లేదు. లాభార్జన పరంగా ఈ రంగంలో అగ్రశ్రేణి కంపెనీగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి మించి దీర్ఘకాలిక పెట్టుబడికి మరొక కంపెనీ వైపు చూడాల్సిన పని లేదు.

 

కంపెనీ ముఖ చిత్రం

 • హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
 • షేర్ ముఖ విలువ: రూ. 10
 • ప్రస్తుత ధర: రూ. 604
 • మార్కెట్ కేపిటలైజేన్: రూ. 1,22,068 కోట్లు
 • 52 వారాల కనిష్టం – గరిష్టం: రూ. 339- 647
 • పీఈ: 92
 • ప్రైస్-టు-బుక్ వాల్యూ:18

 

ఈక్విటీ స్వరూపం:

 • ప్రమోటర్ల వాటా: 60.41 శాతం
 • విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు: 23.55 శాతం
 • మ్యూచువల్ ఫండ్లు: 5.40 శాతం
 • బీమా కంపెనీలు: 1 శాతం


HDFC Life to replace Vedanta in Nifty50 index from July 31పబ్లిక్ ఇష్యూ ధర: రూ. 311

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ దాదాపు ఏడాదిన్నర క్రితం పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. అప్పట్లో రూ. 10 ముఖ విలువ కల ఒక్కో షేర్‌ను రూ. 311 ధరకు ఇన్వెస్టర్లకు జారీ చేశారు. కానీ లిస్టింగ్ మాత్రం రూ. 352 ధర వద్ద అయింది. ఆ తర్వాత గరిష్ఠంగా రూ. 547 వరకూ పెరిగి, తదుపరి స్టాక్‌మార్కెట్ కరెక్షన్‌లో రూ. 340 వరకూ పడిపోయింది. ప్రస్తుతం రూ. 604 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇటీవల ఈ షేర్ ఎన్ఎస్ఈ ‘నిఫ్టీ-50’లో స్థానం దక్కించుకుంది. తత్ఫలితంగా షేర్ ధరలో హెచ్చుతగ్గులు (వోలటాలిటీ) బాగా తగ్గింది.

 

 

కరోనా ముందు.. తర్వాత..

కరోనా మహమ్మారి విస్తరించడానికి ముందు దేశీయంగా బీమా రంగం ఆకర్షణీయంగా ఉంది. రిస్క్‌ను తట్టుకోవడానికి అల్బాదాయ వర్గాల వారు సైతం టెర్మ్ బీమా, ఆరోగ్య బీమా పాలసీలు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. కేవలం నగర ప్రాంతాలకో పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం బీమా వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెరుగుతున్న దాఖలాలు ఉన్నాయి. ఈ విధమైన సామాజిక మార్పు వల్ల బీమా కంపెనీలకు ఆదాయాలు, లాభాలు ఆకర్షణీయంగా నమోదయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో కరోనా మహమ్మారి విస్తరించింది. దేశదేశాలను కబళించడమే కాకుండా మన దేశాన్నీ చుట్టుముట్టేసింది. దీనివల్ల ప్రజలకు తమ ఆర్థిక, ఆరోగ్య భద్రతకు బీమా అవసరం ఎంతగానో ఉందని గుర్తించే పరిస్థితి వచ్చింది. అందుకే లాక్‌డౌన్ అమల్లో ఉన్నా, సాధారణ కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడినా, ఎన్నో రంగాల్లో ఇంకా వ్యాపార వ్యవహారాలు మొదలుకాకపోయినా... బీమా కంపెనీలు మాత్రం వృద్ధి బాటలో కనిపిస్తున్నాయి. పాలసీల విక్రయం పెరగడమే కాకుండా అధిక ప్రీమియం ఆదాయాలు వసూలు చేయగలిగే సానుకూలత ఏర్పడింది. అధిక జనాభా ఉండడం, వేగంగా ఎదుకుతున్న ఆర్థిక వ్యవస్థ కావడం, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉండడంతో ఎన్నో ఏళ్ల పాటు బీమా రంగానికి ఎదుగుదల ఉంటుందనడంలో ఎటువంటి సందేహంలేదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారు ఇటువంటి మార్పును ముందే గుర్తించి, తదనుగుణంగా పెట్టుబడులు పెడితే అత్యంత అధిక లాభాలు ఆర్జించవచ్చు.

 

వృద్ధి బాటలో దూకుడుగా...

HDFC Life IPO plans: Own an insurance stock along with your policy - The Hindu BusinessLineఆదాయాల పరంగా, రీచ్ (వినియోగదారుడి దగ్గరకు వెళ్లగల శక్తి)... విషయంలో చూస్తే, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అగ్రగామిగా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న ఎస్‌బీఐ శాఖల ద్వారా లక్షలాది మంది వినియోగదార్ల వద్దకు ఎస్‌బీఐ లైఫ్ చురుకుగా చేరుకోగలదు. దాని ప్రకారం చూస్తే హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వెనుకబడి ఉంది. కానీ ఆదాయాలు, వృద్ధి, లాభదాయకతను పరిగణలోకి తీసుకుంటే హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ అగ్రస్థానంలో కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఎదురైన ఒడిదుడుకుల ప్రభావం ఇతర జీవిత బీమా కంపెనీల మీద కనిపించగా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం వాటిని తట్టుకుంటూ వృద్ధి బాటలో కొనసాగింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ఏపీఈ (యాన్యువలైజ్డ్ ప్రీమియం ఈక్వలెంట్) ఆదాయాలను, క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు ఈ విషయం స్పష్టమవుతుంది.

2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1), ఏపీఈ (యాన్యువలైజ్డ్ ప్రీమియం ఈక్వలెంట్) ఆదాయాల ప్రకారం ఐదు అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలా ఉన్నాయి...

 

ఇతర ప్రత్యేకతలు

 • ఇటీవల కాలంలో యూలిప్ పాలసీల వ్యాపారం కొంత తగ్గింది. కానీ అదే సమయంలో ప్రొటెక్షన్ బిజినెస్‌లో వృద్ధి అధికంగా ఉంది. లాభదాయకత పరంగా ఇప్పటికే ఈ కంపెనీ ‘ఇండస్ట్రీ లీడర్’గా ఉంది.
 • అదే సమయంలో కంపెనీ యాజమాన్యం, నిర్వహణ వ్యయాలను, కమిషన్ ఖర్చులను తగ్గించుకుంటూ వస్తోంది. దేశవ్యాప్తంగా మార్కెటింగ్, విక్రయ విభాగాలను విస్తరిస్తోంది. ఏజెన్సీల సంఖ్య ఒక లక్షకు మించిపోయింది. బ్యాంకష్యూరెన్స్ ఛానళ్ల సంఖ్య 200కు దగ్గరగా ఉంది.
 • నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (అస్సెట్స్ అండర్ మేనేజ్‌మెంట్) రూ. 1.5 లక్ష కోట్లకు దరిదాపుల్లో ఉంది.
 • హెచ్‌డీఎఫ్‌సీ గ్రూపు సంస్థల ద్వారా లభించే వ్యాపారంపై ఆధారపడడం తగ్గుతోంది. సొంతంగా పాలసీల విక్రయాలను పెంచుకోవడంపై అధికంగా దృష్టి సారిస్తోంది.
 • 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ పని తీరు ఇతర జీవిత బీమా కంపెనీలతో పోల్చితే మెరుగ్గా ఉంది. ఉదాహరణకు 2019-20లో ‘కొత్త వ్యాపారం పై నమోదైన లాభాల విలువ’ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ విషయంలో 25.9 శాతంగా ఉండగా, అదే ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌కు 18.7 శాతం, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌కు 21.7 శాతం మాత్రమే ఉన్నాయి.
 • 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ కంపెనీ ఆదాయాలపై కొవిడ్-19 లాక్‌డౌన్ ప్రభావం కనిపించింది. కానీ అదే సమయంలో లాభాలను మాత్రం కాపాడుకోగలిగింది. కొత్త పాలసీల ప్రీమియం ఆదాయం 33 శాతం తగ్గినప్పటికీ లాభాలు 24.1 శాతం నమోదయ్యాయి. ఎస్‌బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కొత్త పాలసీల వ్యాపారంలో ఎంతో క్షీణత నమోదైన విషయం గమనార్హం.
 • కొవిడ్-19 ప్రభావం నుంచి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ త్వరగా కోలుకుంటోంది. ఏపీఈ (యాన్యువలైజ్డ్ ప్రీమియం ఈక్వలెంట్) ప్రకారం చూస్తే.. ఈ విషయం స్పష్టమవుతుంది.

దీర్ఘకాలిక పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరి

స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టే వారికి లాభాలను బాగా పెంచుకోవాలనే లక్ష్యం ప్రతిఒక్కరికీ ఉంటుంది. కానీ స్వల్పకాలంలో సాధ్యం కాదు. దీర్ఘకాలిక దృష్టితో స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని క్రమబద్ధంగా ఈక్విటీ షేర్ల పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవడం తప్పనిసరి. ఒక క్రమ పద్ధతిలో తమ ఈక్విటీ షేర్ల పోర్ట్‌ఫోలియోను నిర్మించుకునేవారికి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆకర్షణీయమైన కంపెనీ అని చెప్పవచ్చు. ఈ షేర్ తప్పనిసరిగా పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సిన షేర్. అందువల్ల దీన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తున్నామనేది కాకుండా, కొనుగోలు చేసి, ఎన్నాళ్లు వేచి ఉన్నామనేది ముఖ్యాంశం అవుతుంది. అందువల్ల ఈ షేర్‌ను ఏదైనా ధరలో కొనుగోలు చేసి, ఆ తర్వాత ధర తగ్గిన ప్రతిసారి అదనంగా కొనుగోలు చేస్తూ పోవాలి. అలా చేస్తే తప్పనిసరిగా లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. గత రెండేళ్లలో ఈ షేర్ ధర దాదాపు రెట్టింపు అయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తించాలి. అందువల్ల స్వల్పకాలిక ప్రతిఫలాన్ని ఆశించకుండా, దీర్ఘ కాలంలో ఆకర్షణీయమైన లాభాలు, స్థిరత్వాన్ని, తక్కువ రిస్క్‌ను కోరుకునే వారు ఈ షేర్‌ఫై పెట్టుబడి పెట్టవచ్చు.

 

షేర్ ధర ఎంతవరకూ పెరగవచ్చు..

 • ఎంతైనా కావచ్చు. బీమా రంగానికి వచ్చే దశాబ్ద కాలం పాటు పెరగడమే కానీ.. వృద్ధి క్షీణించే అవకాశం లేదు. కాకపోతే మధ్యలో ఆటుపోట్లు వస్తుంటాయి. అయినా ఎదురునిలిచి ఈ రంగం వృద్ధి బాట కొనసాగిస్తుందనేది ఎక్కువ మంది విశ్వాసం. దాని ప్రకారం చూస్తే, ఆ కంపెనీ ప్రస్తుత స్థాయిలో కూడా పెట్టుబడికి అనుకూలమే.
 • ప్రస్తుతానికి దాదాపు 90కి పైగా పీఈలో, రూ. 1 లక్షల కోట్లకు పైగా మార్కెట్ కేపిటలైజేషన్‌తో ‘హై-వాల్యూ’, ‘హైలీ ప్రైస్డ్’ షేర్‌గా కనిపిస్తోంది. కానీ ఆదాయాలు- లాభాల పరంగా ఇండస్ట్రీ లీడర్‌గా ఉండడం, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ సంస్థ కావడం, బీమా రంగంలో ఉన్న వృద్ధి అవకాశాలను పరిగణలోకి తీసుకుంటే, అది పెద్ద అవరోధం కాదు.
 • ఇటీవల ఈ షేర్ నిఫ్టీ-50లో స్థానం సంపాదించింది. అందువల్ల సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టే అవకాశాలు పెరిగాయి. ఈ షేర్ అధిక ధర పలుకడానికి అది కూడా ఒక కారణం.
 • సాంకేతికంగా చూస్తే రూ. 560 కంటే దిగువకు ఈ షేర్ పడిపోయే అవకాశం కనిపించడం లేదు. స్టాక్ మార్కెట్‌లో భారీగా కరెక్షన్ వస్తే, రూ. 520-500 వరకూ దిగిరావచ్చు.
 • అదే సమయంలో స్వల్ప కాలంలో రూ. 645 వరకూ ఈ షేర్ ధర పెరిగే అవకాశం ఉంది. అక్కడ బ్రేక్ అవుట్ వస్తే, రూ. 700 లక్ష్యం దిశగా ఈ షేర్ ముందుకు కదులుతుంది.
 • ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో తమ పెట్టుబడిపై ఎటువంటి రిస్క్ లేకుండా ఏటా కనీసం 10 శాతం లాభాలు ఆర్జించి పెట్టగల సత్తా ఈ కంపెనీకి ఉందని చెప్పవచ్చు.