రూ.15లక్షల కోట్ల కంపెనీగా రిలయన్స్ రికార్డు

రూ.15లక్షల కోట్ల కంపెనీగా రిలయన్స్ రికార్డు

రూ.15లక్షల కోట్ల కంపెనీగా రిలయన్స్ రికార్డు
మార్కెట్ వాల్యూలో ప్రపంచంలోనే టాప్ 40
ఘనత సాధించిన తొలి దేశీయ కంపెనీ
ఆదాయం తగ్గినా.. వాటాల విక్రయంతో ట్రెండింగ్
గురువారం భారీగా పెరిగిన షేరు 

మార్కెట్లో రూపాయికి రూపాయి విలువ ఎలా పెంచాలో తెలిసినోడు నిజమైన వ్యాపారి. ప్రపంచమంతా కష్టాల్లో ఉన్నా.. ఏదో ఓ రూపంలో ఆస్తులు పెంచుకోవడంలో కొందరుంటారు.. వారికి వారే సాటి. ఈ కోవకు చెందినదే.. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇదంతా ఎందుకంటే తొలిసారి 200 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది. మనభాషలో.. మన డబ్బుల్లో చెప్పుకోవాలంటే రూ.15లక్షల కోట్లకు పైమాటే. అంటే దేశం బడ్జెట్ లో చూపించిన వ్యయంలో సగం. తెలంగాణ రాష్ట్రం అయితే పదేళ్ల బడ్జెట్ తో సమానం. శతాబ్ధానికి పైగా వ్యాపారం చేస్తున్న టాటా, బిర్లాలకు సాధ్యం కాని ఘనతను ముఖేష్ అంబానీ త్వరగానే అందుకున్నారు. అంతర్జాతీయ కంపెనీల సరసన నిలబడ్డాడు. ఇటీవలే ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ టెన్ లో చోటు సంపాదించిన ముఖేష్ కంపెనీ వాల్యూ అమాంతం  పెరిగింది.. కాదు కాదు.. పెంచేశారు. గురువారం మార్కెట్ ఇంట్రాడేలో 199.74 బిలియన్ డాలర్లుగా ఉంది. ఒక్కసారిగా మధ్యాహ్నానికి కేపిటలైజేషన్ వాల్యూ 215.75 బిలియన్లకు పెరిగింది. ప్రస్తుతం కంపెనీ వాల్యూ 15,84,908 కోట్లుకు చేరింది.
 
తెలివిగా ఆస్తులు పెంచుకుంటున్న కంపెనీ..
టీవీ5 బిజినెస్ హెడ్ వసంతకుమార్ మాటల్లో చెప్పాలంటే.. అంతపెద్ద కంపెనీ, తనకున్న మార్కెట్ వాల్యూను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇప్పుడు రిలయన్స్ చేస్తుందీ అదే. రిలయన్స్ రిటైల్ లో అమెజాన్ పెట్టుబడులు పెడుతుందన్న వార్తతోనే తెల్లారింది గురువారం. అంతే మార్కెట్లో ఒక్కసారిగా షేర్ ప్రైస్ దూసుకపోయింది. ఒకదశలో 8.45శాతం పెరిగి 2343వద్దకు చేరింది. చివరకు 7.10శాతం పెరిగి 2314 వద్ద ముగిసింది. అమెజాన్ సంస్థకు రిలయన్స్ రిటైల్లో 20 బిలియన్ డాలర్లకు అంటే 1లక్ష 50వేల కోట్లకు కొంత వాటా విక్రయిస్తారన్న వార్త మార్కెట్లో గుప్పుముంది. చాలాకాలంగా రిలయన్స్ కంపెనీ వ్యూహాత్మకంగా ఇలాగే వ్యవహరిస్తోంది. కోవిడ్ పేండిమిక్ లో కూడా జియో ఫ్లాట్ ఫాంలో వాటాల అమ్మకం ద్వారా స్టాక్ పడిపోకుండా నిలబెట్టుకుంది. ఇటీవల ఫ్యూచర్ గ్రూపు టేకొవర్, తాజాగా సిల్వర్ లేక్ రూ.7500 కోట్ల పెట్టుబడులతో వార్తల్లో నిలిచింది. ఇక అమెజాన్ కూడా వస్తుందన్న ప్రచారంతో కంపెనీ ఆస్తులు ఏ రేంజిలో పెరిగాయో అర్ధమవుతుంది. గత ఏడాది కంటే కంపెనీ రెవిన్యూ తగ్గింది. అంతేకాదు ఆయిల్, కెమికల్ బిజినెస్ తగ్గింది. రిటైల్లో కూడా అంతంతమాత్రంగానే లాభాలున్నాయి. అయినా సిల్వర్ లేక్ రూ.7500 కోట్లకు దాదాపు 1.78శాతం వాటా కొనుగోలు చేసేలా చేసింది.  RILలో సిల్వర్ లేక్ ఇన్వెస్ట్ చేయడం కొత్తకాదు. జియోలో రెండు దశల్లో మే, జూన్ లో వరసగా 10వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. అంటే మార్కెట్లో షేర్ ప్రైస్ విషయంలో స్ట్రాటజీ ప్లే చేసినట్టు అప్పట్లో వార్తలుగుప్పుమన్నాయి. తాజాగా మళ్లీ తెరమీదకు రిటైల్ స్టేక్ పేరుతో సిల్వర్ లేక్ వచ్చింది. అమోజాన్ పేరు వినిపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే.. మార్కెట్ క్యాపిటలైజేషన్ పడిపోకుండా.. రిలయన్స్ తెలివిగా వ్యవహరిస్తోందని అర్ధమవుతుంది.

వాల్డ్ టాప్ 50 కంపెనీల్లో RILకు చోటు
జూన్ 19న 150బిలియన్ డాలర్ల కంపెనీగా రిలయన్స్ అవతరించింది. అప్పట్లోనే అది పెద్ద సంచలనం. కేవలం 60 రోజుల్లోనే 65 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇది ఇంకా సంచలనం. జస్ట్ 2 మంత్స్. ఈరోజు పెరిగిన వాల్యూతో రిలయన్స్ ప్రపంచటాప్ 50 మార్కెట్ వాల్యూ కంపెనీల్లో చోటు సంపాదించింది. ప్రస్తుతం కంపెనీ నెంబర్ ఈ జాబితాలో 40. ఇదే స్థాయిలో పెరుగుతూ పోతే.. అమెరికాకు చెందిన అతిపెద్ద దిగ్గజాలను కూడా ఇట్టే దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. యాపిల్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అలిబాబా కంపెనీలకు అందుకోవడం సాధ్యం కాకపోయినా, వెరిజాన్, డిస్నీ, అడోబ్, నెట్ ఫ్లిక్స్, కోకాకోలో సంస్థలను త్వరలోనే దాటుతుందని అంచనా. మొత్తానికి ఫైజర్, నోవార్టీస్ వంటి సంస్థలతో మార్కెట్ వాల్యూలో పోటీపడుతున్నRIL త్వరలోనే మరింత ఎత్తుకు ఎదగడం ఖాయం. 

గ్రోత్ ఈజ్ లైఫ్ అని ట్యాగ్ లైన్ పెట్టుకున్న ముఖేష్ దానికి వందశాతం న్యాయం చేస్తున్నారు. ఏదో రూపంలో ఆస్తులను భారీగా పెంచుతున్నారు. కేవలం 60 రోజుల్లో 4లక్షల20వేల కోట్లకు కంపెనీ వాల్యూ పెంచాడంటే అర్ధం చేసుకోండి. దటీజ్ RIL.కంపెనీ ఆదాయం పెరిగితే సహజంగానే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. పరిస్థితులు అనకూలంగా లేకపోతే.. వాటిని మనకు సానుకూలంగా మలుచుకుని.. మార్కెట్లో ట్రెండ్ స్రుష్టించాలి. రిలయన్స్ తరహాలో అందనంత ఎత్తుకు ఎదగాలి.