ఫార్మా 'ర్యాలీ'లో ఇంకా పార్టిసిపేట్ చేయని షేర్.. 'ఎస్ఎంఎస్ ఫార్మా'

ఫార్మా 'ర్యాలీ'లో ఇంకా పార్టిసిపేట్ చేయని షేర్.. 'ఎస్ఎంఎస్ ఫార్మా'

జిన్‌ట్యాన్, ర్యాన్‌టాక్... అనే బ్రాండెడ్ ట్యాబ్లెట్లు వినే ఉంటారు. ఒక్కో ట్యాబ్లెట్ రూ. 1 కంటే తక్కువ ధరకే లభించే ఈ ట్యాబ్లెట్లను కడుపులో అల్సర్లు, గ్యాస్ సమస్యలు ఉన్నవారు రోజుల తరబడి వినియోగిస్తూ ఉంటారు. ఈ ట్యాబ్లెట్లలో ఉండే ఔషధమే 'ర్యానిటిడిన్.' దీన్ని తయారు చేయడంలో దేశంలోనే అగ్రగామి కంపెనీ ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ గత పాతికేళ్లుగా ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్), ఇంటర్మీడియేట్ ఔషధాల తయారీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ర్యానిటిడిన్‌తో పాటు యాంటీ-మైగ్రేన్, యాంటీ-డయాబెటిక్, యాంటీ-రిట్రోవైరల్స్ విభాగాలకు చెందిన పలు ఔషధాలను (ఏపీఐ, ఇంటర్మీడియేట్స్) ఎస్ఎంఎస్ ఫార్మా తయారు చేసి దేశీయ కంపెనీలకు, విదేశీ సంస్థలకు సరఫరా చేస్తోంది. యూఎస్‌కు చెందిన అగ్రశ్రేణి జనరిక్ ఔషధాల కంపెనీ మైలాన్ ల్యాబ్స్‌కు గత ఐదారేళ్లుగా ఎన్నో ఔషధాలు అందిస్తూ, ఆ సంస్థకు ప్రిఫర్డ్ పార్టనర్‌గా మారింది.

ఈ కంపెనీకి హైదరాబాద్ సమీపంలో బాచుపల్లి వద్ద ఒకటి, విశాఖపట్నం వద్ద మరొకటి మందులు తయారు చేసే యూనిట్లు ఉన్నాయి. ఈ రెండు యూనిట్లలలో కలిపి దాదాపు 30 రకాలైన ఔషధాలు తయారు చేయగల సామర్ధ్యం ఈ కంపెనీకి ఉంది.

ఇది కాక క్రామ్స్ (కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్) కార్యకలాపాలను కూడా విశాఖపట్నం యూనిట్లో నిర్వహిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఔషధ పరిశ్రమను పరిశీలిస్తే క్రామ్స్ విభాగం అత్యంత ఆకర్షణీయమైనదనేది స్పష్టమపుతోంది. మన దేశంలో సువెన్ ఫార్మా, గ్లెన్‌మార్క్, దివీస్, లారస్ ల్యాబ్స్ వంటి ఎన్నో కంపెనీలు క్రామ్స్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఎంతగానో లాభాలు ఆర్జిస్తున్నాయి.

హైదరాబాద్ సమీపంలో ఎస్ఎంఎస్ ఫార్మాకు సొంతంగా అతి పెద్ద ఆర్అండ్‌డీ కేంద్రం ఉంది. కాంప్లెక్స్ కెమికల్స్, ఏపీఐ లను ఈ కేంద్రంలో అభివృద్ధి చేస్తున్నారు.

ఈ కంపెనీ తయారు చేసే కొన్ని ముఖ్యమైన ఏపీఐ ఔషధాలు -
* యాంటీ అల్సర్: ర్యానిటిడిన్ హెచ్‌సీఎల్, ఫమోటిడిన్, పెంటప్రజోల్ సోడియమ్.
* యాంటీ ఫంగల్: ఇట్రాకానజోల్, లానోకానజోల్.
* యాంటీ మైగ్రోన్: సుమట్రిప్టాన్ సక్సినేట్, ఆల్మోట్రిప్టాన్, జోల్మిట్రిప్టాన్. 
* యాంటీ డయాబెటిక్: విల్దాగ్లిప్లిన్, సీటాగ్లిప్టిన్, రాసిగ్లిటాజోన్.
* యాంటీ వైరల్: పెన్సిక్లోవిర్, వాలసిక్లోవిర్.
* యాంటీ రిట్రోవైరల్: టెనోపోవిర్ డిసోప్రాగ్జిల్, ఎఁట్రిసిటబైన్

ఇంకా ఎన్నో రకాలైన ఇంటర్మీడియేట్స్‌ను తయారు చేస్తోంది.

ఎస్ఎంఎస్ లైఫ్‌సైన్సెస్
ఎస్ఎంఎస్ ఫార్మా నుంచి రెండేళ్ల క్రితం విడదీసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంపెనీ ఇది. ఈ కంపెనీ కూడా బల్క్ ఔషధాలు, ఏపీఐలు తయారు చేస్తోంది. దీనికి హైదరాబాద్ సమీపంలో పాశమైలారంలో ఒక యూనిట్ ఉంది. దీనికి ప్రస్తుతం ఎస్ఎంఎస్ ఫార్మాతో సంబంధం లేనప్పటికీ ఎస్ఎంఎస్ ఫార్మా ప్రమోటర్లకు దీన్లో వాటాలున్నాయి.

అనుబంధ కంపెనీ... వీకేటీ ఫార్మా
ఎస్ఎంఎస్ ఫార్మాసూటికల్స్‌కు వీకేటీ ఫార్మా అనే ఒక అనుబంధ కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీలో ఎస్ఎంఎస్ ఫార్మాకు 42.62 శాతం వాటా ఉంది. మిగిలిన వాటా ఎస్ఎంఎస్ ఫార్మా ప్రమోటర్లకు వ్యక్తిగతంగా ఉంది. వీకేటీ ఫార్మాకు శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద అధునాతన యూనిట్ ఉంది. దీనికి యూఎస్ఎఫ్‌డీఏ, ఈయూ-జీఎంపీ, డబ్ల్యూహెచ్ఓ-జీఎంపీ అనుమతులు ఉన్నాయి. ఫార్ములేషన్లు, పెల్లెట్స్, ఈ యూనిట్లో తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో వీకేటీ ఫార్మాలో వాటా విక్రయించే ఆలోచన ఎస్ఎంఎస్ ఫార్మా ప్రమోటర్లకు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఎస్ఎంఎస్ ఫార్మా వాటా విలువ కూడా పెరుగుతుంది.

ప్రమోటర్లు...
దాదాపు 30 ఏళ్ల క్రితం పి. రమేష్ బాబు ఎస్ఎంఎస్ ఫార్మాసూటికల్స్‌ను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించారు. టీవీవీఎస్ఎన్ మూర్తి ఆయన భాగస్వామి. గత మూడు దశాబ్దాల కాలంలో ఎస్ఎంఎస్ ఫార్మా తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సదుపాయాలను బహుముఖంగా విస్తరించింది.

పెయిడ్-అప్ ఈక్విటీ
ఎస్ఎంఎస్ ఫార్మా పెయిండ్-అప్ ఈక్విటీ కేపిటల్ ఒక్కొక్కటీ రూ. 8.46 కోట్లు (రూ. 1 ముఖ విలువ కల 8,46,52,030 షేర్లు). ఇందులో ప్రమోటర్లకు 67.27 శాతం వాటా ఉంది. సాధారణ వాటాదార్లలో 1 శాతం కంటే అధిక వాటా కలిగిన వారిలో పీవీ సుబ్బరాజు, ముధుసూధన్ కేలా, వివేక్ ముంద్రా, అనిరుద్ ముంద్రా ఉన్నారు.

డివిడెండ్
గత ఏడేళ్లుగా ఎస్ఎంఎస్ ఫార్మా క్రమం తప్పకుండా డివిడెండ్ చెల్లిస్తూ వస్తోంది...
ఎస్ఎంఎస్ ఫార్మా డివిడెండ్ చెల్లింపు రికార్డు
--------------
ఆర్థిక సంవత్సరం    డివిడెండ్ (రూ.)
-------------
2012-13        2
2013-14        2
2015-16        2
2016-17        0.20
2017-18        0.20
2018-19        0.25
2019-20        0.25
* 26.03.2020న ఒక్కో షేర్‌కు మరో రూ. 0.25 చొప్పున చెల్లించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అప్పటికే చెల్లించిన రూ. 0.25కు ఇది అదనం.
-----------

ఆర్థిక ఫలితాలు
గత మూడేళ్ల కాలంలో ఎస్ఎంఎస్ ఫార్మా పనితీరును గమనిస్తే.. వార్షిక ఆదాయం రూ. 450 కోట్లకు దగ్గరగా ఉంటోంది. అదే సమయంలో నికర లాభం రూ. 40 కోట్లకు దరిదాపుల్లో నమోదవుతోంది. ఇప్పటివరకూ ఆదాయాలు, లాభాల్లో పెద్దగా పెరుగుదల లేని విషయం ఈ ఫలితాలను విశ్లేషిస్తే స్పష్టమవుతుంది.

స్టాండ్ అలోన్ ఆర్థిక ఫలితాలు (రూ. కోట్లలో., ఈపీఎస్: రూ. లలో)
----------------------------
సంవత్సరం    స్థూల అమ్మకాలు    నికర లాభం    ఈపీఎస్

2017-18    436.59    40.45    4.78
2018-19    448.13    41.45    4.90
2019-20    411.94    32.68    3.86
2020-21*    112.89    9.20    1.09
* క్యూ1 ఆర్థిక ఫలితాలు

సానుకూలతలు
* ఫార్మా ర్యాలీలో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు.
* వచ్చే మూడేళ్ల కాలంలో ఏపీఐ ఔషధాలు, బల్క్ ఇంటర్మీడియేట్స్‌కు గిరాకీ ఉంటుందని అంచనా. అదే జరిగితే కంపెనీకి లాభాలు పెరుగుతాయి.
* చైనా నుంచి బల్క్, ఏపీఐ ఔషధాల సరఫరా తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ విభాగానికి చెందిన దేశీయ కంపెనీలకు ఆదాయాలు, లాభాుల పెరిగే అవకాశం ఉంది. అలా చూస్తే, ఎస్ఎంఎస్ ఫార్మా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
* ఇటీవల కాలంలో రెండు మూడు కొత్త ఔషధాలను (ఎయిడ్స్, యాంటీ-అల్సర్ విభాగాల్లో...) ఈ కంపెనీ అభివృద్ధి చేసింది. వాటికి సంబంధించి కాంట్రాక్టులు అధికంగా వస్తున్నట్లు సమాచారం.
* మైలాన్, మరికొన్ని ఇతర కంపెనీల నుంచి ఎస్ఎంఎస్‌కు కాంట్రాక్టులు అధికంగా దక్కుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో తన ఉత్పత్తి సామర్ధ్యానికి మించి ఔషధాల తయారీ కాంట్రాక్టులు సంపాదిస్ున్న హైదరబాద్ కంపెనీ ఒకటి, ఆ కాంట్రాక్టులు కొన్నింటిని ఎస్ఎంఎస్ ఫార్మాకు ఇస్తున్నట్లు తెలిసింది. తత్ఫలితంగా ఎస్ఎంఎస్ ఫార్మా ఆదాయాలు సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* ఎస్ఎంఎస్ ఫార్మాకు స్టాక్ మార్కెట్లో పెద్ద మదుపరుల అండదండలు ఉన్నాయి.

వ్యతిరేకాంశాలు
ప్రస్తుత ప్రమోటర్లు... ఎస్ఎంఎస్ ఫార్మా నుంచి ఎస్ఎంఎస్ లైఫ్‌సైన్సెస్ విడిపోయిన తరువాత తాము కూడా విడిపోయి, చెరొక కంపెనీ యాజమాన్య బాధ్యతలు చేపట్టి ఎవరికి వారు సొంతంగా అభివృద్ధి చెందాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా రెండు కంపెనీల్లో వారికి ఉన్న షేర్లను పరస్పరం మార్పిడి (స్వాప్) చేసుకోవలసి ఉంది. ఈ వ్యవహారం ఏడాదిన్నరక కాలం నుంచి నలుగుతోంది. వాల్యుయేషన్ ఇబ్బందుల వల్ల అది ఇంతవరకూ సాధ్యం కాలేదు. ఇటీవల ఈ మార్పిడికి పరస్పరం సిద్ధం అయ్యారు. ఆ మేరకు స్టాక్ ఎక్స్‌ఛేంజీలకు సమాచారం కూడా ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల షేర్ మార్పిడి కుదరలేదు. ఈ వ్యవహారం పూర్తయ్యేవరకూ ఈ కంపెనీ షేర్‌కు స్టాక్ మార్కెట్లో సరైన ధర లభించే అవకాశం లేదు.

* గత కొన్నేళ్ల ఆర్థిక ఫలితాలను చూస్తే.. కంపెనీ ఆదాయాలు, లాభాల్లో పెద్దగా పెరుగుదల ఉండడం లేదని తెలుస్ోతంది. అదే సమయంలో దేశీయ ఫార్మా కంపెనీలు కొన్ని శరవేగంగా ఎదిగి ఆదాయాలు, లాభాలు అనూహ్యంగా పెంచుకున్న విషయాన్ని గుర్తించాలి. ఆ ప్రకారం చూస్తే.. స్కేలబిలిటీ పై ఈ కంపెనీ యాజమాన్యం దృష్టి సారించాలి. ప్రస్తుతం ఫార్మా పరిశ్రమకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున యాజమాన్యం సత్వర వృద్ధి పై కసరత్తు చేయాల్సి ఉంది. అది జరిగితేనే కంపెనీకి అధిక విలువ లభించి షేర్‌హోల్డర్ల విలువ కూడా పెరుగుతుంది.

* ఆర్ అండ్ డీ సమార్ధ్యాన్ని ఈ కంపెనీ ఇంకా బహుముఖంగా పెంచుకుంటే భవిష్యత్తు అవకాశాలు అందిపుచుచ్చుకున్నట్లు అవుతుంది.

వాల్యుయేషన్ - షేర్ ధర

ఎస్ఎంఎస్ ఫార్మా షేర్ ధర రెండేళ్ల క్రితం వరకూ రూ. 120 దరిదాపుల్లో ఉండేది. ఆ తర్వాత రూ. 60 వరకూ పతనమై చాలాకాలం పాటు అక్కడే ఉండిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో స్టాక్ మార్కెట్ పతనంలో రూ24 వరకూ పడిపోయింది. కానీ తర్వాత వేగంగా కోలుకుని రూ. 60 వద్దకు వచ్చింది. ప్రమోటర్లకు ఎస్ఎంఎస్ ఫార్మా, ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్‌లో ఉన్న షేర్లను పరస్పరం మార్పిడి చేసుకోబోతున్నారనే విషయం వెలుగులోకి రావడం. అదే సమయంలో ఫార్మా షేర్లకు అనూహ్య గిరాకీ లభించడంతో ఎస్ఎంఎస్ ఫార్మా షేర్ ధర ఇంకా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలిాల నాటికి రూ. 100 వరకూ వెళ్లింది. ప్రస్తుతం రూ. 85 వద్ద ట్రేడ్ అవుతోంది. కంపెనీ వార్షిక ఈపీఎస్ సగటున రూ. 5 ఉంటుందని అనుకుంటే, దానికి 20 పీఈ(ప్రైస్ ఎర్నింగ్స్) ప్రకారం రూ. 100 ఫెయిర్ వాల్యూ ఉండాలి.

భవిష్యత్తులో ఈ కంపెనీ వార్షిక ఈపీఎస్ రూ. 10  వరకూ పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే షేర్ ధర రూ. 150 నుంచి రూ. 200 వరకూ పెరగవచ్చు.

వచ్చే కొన్నేళ్ల పాటు ఫార్మాకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీఐలు తయారు చేస్తున్న కంపెనీలకు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు లభిస్తున్నాయి. అదే ఎస్ఎంఎస్ ఫార్మాకు కలిసిరావచ్చు. దీనికి తోడు ఎస్ఎంఎస్ ఫార్మా ఇటీవల కాలంలో కొన్ని కొత్త ఔషధాల తయారీని చేపట్టింది. దీనివల్ల సమీప భవిష్యత్తులో ఆదాయాలు, లాభాలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే రెండేళ్ల కాలంలో ఈ షేర్ మదుపరులకు  లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అనూహ్యంగా మార్కెట్ పడిపోవడం కానీ, మరేదైనా సందర్భంలో కానీ షేర్ ధర రూ. 60 వరకూ పడిపోవచ్చు. దీర్ఘకాలిక మదుపరులకు అదొక మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది.