స్మాల్ క్యాప్ జెమ్... పోకర్ణ లిమిటెడ్

స్మాల్ క్యాప్ జెమ్... పోకర్ణ లిమిటెడ్

                              గ్రానైట్ వ్యాపారంతో మొదలుపెట్టి టెక్స్‌టైల్, ఇంజనీర్డ్ స్టోన్ విభాగాల్లోకి విస్తరించిన హైదరాబాద్ కంపెనీ పోకర్ణ లిమిటెడ్. దాదాపు రెండున్నర దశాబ్దాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీ ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, ప్రపంచ స్థాయి సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా, మార్కెట్లలో చైనా నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని గ్రానైట్, క్వార్ట్‌జ్ సర్ఫేసెస్ ఉత్పత్తులను విక్రయించడంలో క్రియాశీలకంగా ఉన్న భారతీయ కంపెనీ ఏదైనా ఉందంటే, అది పోకర్ణ లిమిటెడ్ అని వేరేగా చెప్పాల్సిన పని లేదు. ఈ కంపెనీకి ఆటుపోట్లు కొత్త కాదు. కానీ పట్టుదల కల యాజమాన్యం కావడంతో వాటిని అధిగమిస్తూ ఆకర్షణీయమైన లాభాలు ఆర్జిస్తూ ముందుకు సాగుతోంది. గత ఏడాదికాలంలో ఎదురైన ఇబ్బందులతో ఈ కంపెనీ షేర్ బాగా పతనమైంది. కానీ మళ్లీ వ్యాపారం గాడిన పడుతున్న సంకేతాలు వెలువడుతున్న ఫలితంగా షేర్ ధర కూడా కోలుకుంటోంది. "హ్యాంగింగ్ ఫ్రూట్స్" మాదిరిగా ముందుకొచ్చిన ఇన్వెస్టర్లకు పండిన ఫలాలు అందించడానికి సిద్ధంగా కనిపిస్తోంది.

 

ఎన్నో ప్రత్యేకతలు

 • ఈ కంపెనీ తయారు చేస్తున్న క్వార్ట్‌జ్ సర్ఫేసెస్ ఉత్పత్తులకు యూఎస్‌లో, యూరప్‌లో విశేషమైన గిరాకీ ఉంది. ఆయా దేశాల్లోని డిస్ట్రిబ్యూటర్లతో పోకర్ణ లిమిటెడ్‌కు దీర్ఘకాలిక అనుబంధం ఉంది. "విన్.. విన్..." పద్ధతిలో అటు కంపెనీకి, ఇటు డిస్ట్రిబ్యూటర్లకు మేలు కలిగే బిజినెస్ మోడల్ కావడంతో ఈ బంధం ఏటేటా బలపడుతూ వస్తోంది.
 • పోకర్ణకు హైదరాబాద్ సమీపంలోని షామీర్‌పేట- తుర్కపల్లి వద్ద ఒఖటి, చౌటుప్పల్ వద్ద మరొకటి గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి.
 • ఈ కంపెనీ 2009లో వైజాగ్‌లో ఇంజనీర్డ్ స్టోన్ (క్వార్ట్‌జ్ సర్ఫేసెస్ ఉత్పత్తులు) తయారీ యూనిట్ నెలకొల్పింది. దీనికి ఇటాలియన్ సంస్థ బ్రెటన్ నుంచి పేటెంటెడ్ బ్రెటన్‌స్టోన్ టెక్నాలజీని తెచ్చుకుంది. ఈ ఇటాలియన్ సంస్థ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం పోకర్ణ లిమిటెడ్‌కు మాత్రమే ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకోవడం ప్రత్యేకత. అందువల్ల అత్యంత నాణ్యమైన క్వార్ట్‌‌జ్ సర్ఫేసెస్ ఉత్పత్తులు తయారు చేసి అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ ఉత్పత్తులను ఇళ్లు, ఆఫీసు భవనాలకు ఎలివేషన్, లాబీ, వంటగదులు, డ్రాయింగ్ రూముల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు.
 • ఇంజనీర్డ్ స్టోన్ విభాగంలో అందివస్తున్న వ్యాపారావకాశాలను గమనించిన పోకర్ణ లిమిటెడ్ హైదరాబాద్ సమీపంలోని కొత్తూరులో కొత్త యూనిట్ నిర్మాణాన్ని చేపట్టింది. దీని ప్రాజెక్టు వ్యయం సుమారు రూ. 325 కోట్లు. ఇందులో రూ. 75 కోట్లు సొంతంగా అంతర్గత వనరుల నుంచి ఖర్చు చేశారు. రూ. 250 కోట్లకు యూనియన్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నారు. యూనిట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇటలీ నుంచి బ్రెటన్ ఇంజనీర్ల టీమ్ వచ్చి ఇంటిగ్రేషన్ చేయాల్సిన పని ఒక్కటే మిగిలింది. కొవిడ్-19 మహమ్మారి లేని పక్షంలో ఇప్పటిక ఆ పని కూడా ముగిసి ఈ యూనిట్ ఉత్పత్తి దశలోకి వచ్చి ఉండేది. కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలు లేక, ఇటలీ నుంచి ఇంజనీర్లు రాలేక పని నిలిచిపోయింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ పనిని పూర్తి చేసి యూనిట్‌ను ఉత్పత్తి దశలో ప్రవేశపెట్టాలని పోకర్ణ లిమిటెడ్ యాజమాన్యం భావిస్తోంది.
 • కొత్తూరు యూనిట్ సాంకేతికంగా, నాణ్యత పరంగా అత్యంత అధునాతనమైనది కావడం ప్రత్యేకత. దాదాపు 50,000 చదరపు మీటర్ల క్వార్ట్‌‌జ్ సర్ఫేసెస్ తయారీ సామర్ధ్యంతో దీన్ని నిర్మించారు.

image

 • యూఎస్- చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో చైనా నుంచి అధికంగా అమెరికాకు దిగుమతి అయ్యే ఇంజనీర్డ్ స్టోన్‌పై యూఎస్ ప్రభుత్వం గత రెండేళ్లలో భారీగా డంపింగ్ డ్యూటీలు విధించింది. దీంతో మన దేశం నుంచి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు యూఎస్‌లోని డిస్ట్రిబ్యూటర్లు, కస్టమర్లు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే యూఎస్‌లోని పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు పోకర్ణ లిమిటెడ్‌ను సంప్రదిస్తున్నారు. కొత్త యూనిట్‌లో ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఇప్పటికే ఎక్స్‌క్లూజివ్‌గా తమకు కేటాయించాలని ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా యూఎస్‌లోని డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ముందుకు వచ్చినట్లు సమాచారం.
 • పోకర్ణ లిమిటెడ్‌కు టెక్స్‌టైల్ వ్యాపారం కూడా ఉంది. అంతగా లాభదాయకంగా లేని ఈ వ్యాపారాన్ని విక్రయించేందుకు కంపెనీ యాజమాన్యం కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. సరైన ధర లభించే పక్షంలోఈ విభాగాన్ని విక్రయించే అవకాశం ఉంది. అదే సమయంలో అంతగా ఆకర్షణీయంగా లేని గ్రానైట్ వ్యాపారంపై కూడా "ఫోకస్" తగ్గించారు. దాని స్థానంలో ఇంజనీర్డ్ స్టోన్ తయారీపై కంపెనీ యాజమాన్యం ప్రధాంగా దృష్టి సారించింది. కేవలం ఎగుమతులే కాకుండా ముందుముందు దేశీయ మార్కెట్లోనూ గ్రానైట్‌కు బదులు ఇంజనీర్డ్ స్టోన్ అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పు పోకర్ణకు కలిసి వస్తుంది.
 • ఇప్పటికే దేశీయ మార్కెట్‌కు హైదరాబాద్‌లోని హౌస్‌హోల్డ్ అప్లియన్సెస్ సంస్థ అయిన ఐకియాతో ఒప్పందం కుదుర్చుకుని కిచెన టాప్‌లు పోకర్ణ సరఫరా చేస్తోంది. ముంబైలో, ఆ తర్వాత దిల్లీలో ఐకియా స్టోర్లకు కూడా పోకర్ణనే కిచెన్ టాప్‌లను సరఫరా చేయబోతోంది. తద్వారా దేశీయ మార్కెట్లో విస్తరించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.
 • ఈ పరిస్థితుల్లో కంపెనీ ఆదాయాలు, లాభాలు ఇక్కడి నుంచి వచ్చే రెండు మూడేళ్లలో బాగా పెరిగే అవకాశం ఉంది.

image

"ట్రేడ్ వార్" చిక్కులు
చైనా కంపెనీలపై అమెరికా ప్రభుత్వం భారీగా డంపింగ్ డ్యూటీలు విధించడంతో ఈ వ్యాపారంలో అధిక భాగం మన దేశానికి చెందిన కంపెనీలకు, ముఖ్యంగా పోకర్ణ లిమిటెడ్‌కు లభించింది. దీనివల్ల గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో, అంతకు ముందు కొన్ని త్రైమాసికాల్లో ఎగుమతులను గణనీయంగా పెంచుకుని అధిక ఆయాలు, లాభాలు ఆర్జించే అవకాశాన్ని పోకర్ణ సొంతం చేసుకుంది. దీన్ని గమనించి పోకర్ణ లిమిటెడ్‌ను దెబ్బ తీసేందుకు ఈ కంపెనీపై యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్... పోకర్ణపై భారీగా డంపింగ్ డ్యూటీలు విధించింది. ఈ సంఘటనల క్రమం కింది విధంగా ఉంది...

 • 15-11-2019 నాడు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్.. పోకర్ణ లిమిటెడ్ ఉత్పత్తులపై అంతకు ముందు విధించిన 4.32 శాతం సీవీడీ (కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ)ని ఎంతో అధికంగా 83.79 శాతానికి పెంచింది.
 • దీన్ని వ్యతిరేకిస్తూ పోకర్ణ లిమిటెడ్ తన వాదన దాఖలు చేసింది.
 • బదులుగా యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి బృందం ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో రెండు దఫాలుగా ఆడిట్‌కు వచ్చి పోకర్ణ యూనిట్లను పరిశీలించింది. యాజమాన్యం వాదనతో సంతృప్తి చెందింది.
 • ఫలితంగా పోకర్ణకు సంబంధించిన క్వార్ట్‌జ్ సర్ఫేసెస్ ప్రొడక్ట్స్ (క్యూఎస్‌పీ) పై... ఏడీ (యాంటీ-డంపింగ్ డ్యూటీ) ని 2.67 శాతానికి, సీవీడీ (కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ) ని 2.34 శాతానికి తగ్గిస్తూ యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంది.
 • ఈ విషయాన్ని పోకర్ణ లిమిటెడ్ 29 ఏప్రిల్, 2020 నాడు వెల్లడించింది.
 • దీని ప్రకారం యూఎస్‌లో పోకర్ణ లిమిటెడ్‌కు ఎదురైన డంపింగ్ డ్యూటీల సమస్య దాదాపుగా పరిష్కారం అయినట్లే.

కొవిడ్-19 ప్రభావం
* కరోనా వైరస్ వ్యాధి (కొవిడ్-19) విస్తరణ వల్ల 22 మార్చి 2020 నుంచి ఉత్పత్తి కార్యకలాపాలు నిలిపివేసినట్లు పోకర్ణ ప్రకటించింది.
* తిరిగి ఉత్పత్తి కార్యకలాపాలను మే 29, 2020 నాడు ప్రారంభించింది.

image

ఆర్థిక ఫలితాలు
2019-20 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో పోకర్ణ లిమిటెడ్ ఆదాయాలు, లాభాలు గణనీయంగా క్షీణించాయి. దీనికి ప్రధాన కారణం యూఎస్‌లో భారీగా డంపింగ్ డ్యూటీలు విధించడమే. దీంతో ఆశించినట్లుగా ఎగుమతులు సాధ్యం కాలేదు. గత ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికాల వారీగా ఫలితాలు విశ్లేషిస్తే... ఈ విషయం స్పష్టం అవుతుంది.

image


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి త్రైమాసికానికి ఈ కంపెనీ  ఇంకా ఫలితాలు ప్రకటించలేదు. కానీ పెద్ద ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే.. కొవిడ్-19 లాక్‌డౌన్‌తో ఉత్పత్తి కార్యకలాపాలు సజావుగా సాగలేదు. పైగా ఎగుమతులకు కూడా అవాంతరాలు ఎదురయ్యాయి. నౌకల రవాణా ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. అందువల్ల భారీగా ఆదాయుల, లాభాలు నమోదయ్యే అవకాశాలు లేవు. కానీ రెండో త్రైమాసికం నుంచి పరిస్థితులు కాస్త మెరుగుపడినందున ఆదాయాల్లో, లాభాల్లో పెరుగుదల కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ సమీపంలోని కొత్త ప్లాంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఆదాయాలు, లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. దీని ప్రకారం చూస్తే... వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి అద్భుతమైన ఫలితాలను ఈ కంపెనీ నుంచి ఆశించవచ్చు.

చిన్న ఈక్విటీ
పోకర్ణ లిమిటెడ్ జారీ మూలధనం 3.10 కోట్ల షేర్లు మాత్రమే (ఒక్కో షేర్ ఫేస్ వాల్యూ రూ.2). దీని ప్రకారం ఈ కంపెనీ పెయిడ్ అప్ కేపిటల్ రూ. 6.20 కోట్లు అవుతోంది. దీనివల్ల ఈక్విటీ సర్వీసింగ్ సులువు. క్రమం తప్పకుండా డివిడెండ్ చెల్లించడానికి యాజమాన్యం వెనకాడవలసిన పరిస్థితి ఉండదు. పైగా ప్రమోటర్లకు ఇందులో మెజార్టీ వాటా ఉంది.

ప్రమోటర్ల వాటా
-గౌతమ్‌చంద్ జైన్ కుటుంబం: 56.66 శాతం

సంస్థాగత ఇన్వెస్టర్లు
- హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్: 1.97 శాతం
- నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్: 6.91 శాతం

హెచ్ఎన్ఐలు
- సంజీవ్ ధీరేష్‌భాయ్ షా: 2.36 శాతం

image

వాల్యుయేషన్ - షేర్ ధర

ప్రస్తుత షేర్ ధర రూ. 146 ప్రకారం చూస్తే, ఈ కంపెనీ మార్కెట్ కేపిటలైజేషన్ రూ. 455 కోట్లు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఫ్రీ-ఫ్లోట్ మార్కెట్ కేపిటలైజేషన్ అయితే రూ. 195 కోట్లే. కంపెనీ ఉత్పత్తులకు ఉన్న డిమాండు, బ్రాండు విలువ, ఆదాయాలు, ఆస్తులను పరిగణలోకి తీసుకుంటే ఇది చాలా తక్కువ. ట్రెయిలింగ్ ఈపీఎస్ ప్రకారం 6.6 పీఈలో ఈ షేర్ లభ్యమవుతోంది. సమీప భవిష్యత్తులో ఎంతో వృద్ధి కనబరిచే అవకాశం ఉన్నందున ఈ షేర్‌కు 10 పీఈ వరకూ ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు ముందుకు రావచ్చు. పైగా ఈ ఆర్థిక సంవత్సరంలో క్రితం ఏడాది కంటే కొంత మెరుగైన ఫలితాలు నమోదు చేసే అవకాశం ఉంది. ఆపై రెండేళ్లు (అంటే 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో...) కంపెనీ ఆదాయాలు, లాభాలు అనూహ్యంగా పెరుగుతాయి. అందువల్ల వచ్చే రెండు- మూడేళ్ల కాలానికి పెట్టుబడికి ఇది ఎంతో అనువైన షేర్. స్వల్పకాలంలో ఇన్వెస్టర్లకు తమ పెట్టుబడి మీద ఆకర్షణీయమైన ప్రతిఫలం లభిస్తుంది. రెండు మూడు త్రైమాసికాల్లోనే షేర్ ధర రూ. 180 నుంచి రూ. 220 వరకూ పెరుగుతుందని నమ్మకంగా చెప్పవచ్చు.