నష్టాలతో ముగిసిన జూలై ఎఫ్‌అండ్‌ఓ సిరీస్‌

నష్టాలతో ముగిసిన జూలై ఎఫ్‌అండ్‌ఓ సిరీస్‌

ఫైనాన్షియల్ స్టాక్స్‌ డ్రాగ్‌ చేయడంతో ఇవాళ దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఇవాళ జూలై ఎఫ్‌అండ్‌ఓ క్లోజింగ్‌ ఉండటంతో దేశీయ సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీ, ఫార్మా మినహా అన్ని రంగాల కౌంటర్లు నష్టాలను చవిచూశాయి. మార్నింగ్ సెషన్‌లో ఫ్లాట్‌గా కదలాడినప్పటికీ మిడ్‌సెషన్‌ తర్వాత మార్కెట్లో ఒక్కసారిగా సెల్లింగ్‌ ప్రెజర్‌ పెరిగింది. దీంతో సెన్సెక్స్‌ 335 పాయింట్ల నష్టంతో 37,736 వద్ద, నిఫ్టీ 101 పాయింట్ల నష్టంతో 11102 వద్ద ఇవాళ్టి ట్రేడింగ్‌ను ముగించాయి. ఇండియా ఒలటాలిటీ ఇండెక్స్‌ 3 శాతం పెరిగి 24.90 స్థాయికి చేరింది.

చమురు శుద్ధి కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం వరుసగా మూడోసారి బిడ్డింగ్‌ గడువును పొడిగించింది. తాజాగా ఈ గడువును కేంద్రం సెప్టెంబర్ 30కి పెంచింది. దీంతో ఇవాళ చమురు రంగ స్టాక్‌ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీపీసీఎల్‌ దాదాపు 8 శాతం నష్టపోయి రూ.419 వద్ద ముగిసింది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీలు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 4.98 శాతం, సన్‌ ఫార్మా 3.44 శాతం, విప్రో 2.56 శాతం, మారుతీ సుజుకీ 1.30 శాతం, ఇన్ఫోసిస్‌ 0.77 శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. బీపీసీఎల్‌ 7.65 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 5.57 శాతం, ఐఓసీ 4.37 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 3.55 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 3.41 శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.