కార్పొరేట్ వర్గాల మధ్య మారటోరియం ఫైట్

కార్పొరేట్ వర్గాల మధ్య మారటోరియం ఫైట్

కార్పొరేట్ వర్గాల మధ్య మారటోరియం ఫైట్

బ్యాంకులకు నష్టాలే.. ఇక చాలు ఆపండి
స్థోమత ఉన్నా తప్పించుకుంటున్నారు
ప్రమాదంలో బ్యాంకింగ్ రంగం
మారిటోరియం ఉండాలంటున్న కార్పొరేట్
ఎకానమీని ద్రుష్టిలో పెట్టుకుని నిర్ణయమన్న శక్తికాంతదాస్

దేశంలో మారటోరియం కొనసాగింపు వద్దని HDFC ఛైర్మన్, సీనియర్ బ్యాంకర్ దీపక్ పారేఖ్ RBIని కోరారు. కొనసాగించడం వల్ల దేశీయ బ్యాంకింగ్ రంగం కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నెలలో మళ్లీ మారటోరియం ఎక్స్ టెన్షన్ చేస్తారని వినిపిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవద్దని వేడుకుంటున్నామన్నారు దీపక్ పారేఖ్. చాలామంది దీనిని అడ్వాంటేజ్ గా తీసుకుని చెల్లించే స్థోమత ఉన్నా EMIలు కట్టడం లేదన్నారు. కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వాళ్లు మారిటోరియం మిస్ యూజ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది బ్యాంకులకే కాదు.. చిన్నిచిన్న నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలకు హాని చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే బ్యాంకింగ్ రంగం ఇబ్బందుల్లో ఉందని.. కోవిడ్ కారణంగా 8 నుంచి 12.5శాతానికి NPAలు పెరిగాయని.. 14.7శాతానికి చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది బ్యాంకింగ్ రంగం. దీనికి తోడు మారిటోరియం బ్యాంకింగ్ లిక్విడిటీపై ప్రభావం చూపిస్తుందంటున్నారు. కొనసాగించే ఆలోచన మంచిది కాదని సలహా ఇస్తున్నారు. 

భిన్నంగా ఇండస్ట్రీ వర్గాల స్వరం
మార్చి27న తొలిసారిగా రుణాల చెల్లింపుపై మారిటోరియం విధించింది RBI. మే31 వరకూ అన్ని రుణాలకు వర్తించేలా ప్రకటన చేసింది. తర్వాత ఆగస్టు 31 వరకూ దీనిని కొనసాగిస్తున్నట్టు ప్రకటన చేసింది RBI. అయితే చాలా బ్యాంకులు తమ నిబంధనలకు అనుగుణంగానే వాటిని అమలు చేస్తున్నాయి. అధిక వడ్డీ వేస్తున్నట్టు విమర్శలూ ఉన్నాయి. అయినా ప్రస్తుతం ఉన్న మారిటోరియం కొనసాగించాలని కంపెనీలు కోరుతున్నాయి. బ్యాంకింగ్ నిపుణులు దీపక్ పారేఖ్ అభిప్రాయాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇప్పడిప్పడే కోలుకుంటున్న పరిశ్రమలకు, వ్యాపారసంస్థలకు మారిటోరియం ఉపశమనం కలిగిస్తుందని.. దీనిని ఎత్తేయడం ద్వారా మళ్లీ సంక్షోభంలో పడే ప్రమాదం ఉందంటున్నాయి పారిశ్రామిక వర్గాలు. 

ఇంకా నిర్ణయం తీసుకోలేదు...
అయితే ఇటీవల ఇండస్ట్రీ వర్గాలతో సమావేశమైన RBI గవర్నర్ శక్తికాంతదాస్ HDFC చైర్మన్ దీపక్ పారేఖ్ వ్యాఖ్యలపై ఆచితూచి స్పందించారు. దీనిపై ఎలాంటి కామెంట్ చేయడం లేదని... ఎకానమీని ద్రుష్టిలో పెట్టుకుని నిర్ణయాలు ఉంటాయన్నారు శక్తికాంతదాస్. మొత్తానికి అటు మారిటోరియం వద్దని బ్యాంకింగ్ రంగం.. ఉండాలని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి RBI ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.