మరిన్ని చైనా యాప్స్‌పై నిషేధం?

మరిన్ని చైనా యాప్స్‌పై నిషేధం?

సరిహద్దుల్లో తోకజాడిస్తున్న చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే చైనా ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టిన భారత్‌, త్వరలో మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. గత నెల్లో 59 ప్రధాన మొబైల్ యాప్స్‌ను నిషేధించిన భారత్‌ త్వరలోనే మరో 47 యాప్స్‌పై కూడా వేటు వేసేందుకు సిద్ధమైంది. 

జాతీయ భద్రతకు, ప్రైవసీకి ముప్పుగా ఉన్న మరో 275 యాప్స్‌ను కేంద్రం పరిశీలిస్తోంది. ఇందులో 47 యాప్స్‌పై నిషేధం విధించవచ్చని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో గేమింగ్‌ యాప్స్‌ పబ్‌జీ మొబైల్‌, లూడో వాల్డ్‌, ఇ-కామర్స్‌ సంస్థ అలీ ఎక్స్‌ప్రెస్‌లు కూడా ఉండే అవకాశముంది. వీటితో పాటు షావోమికి చెందిన జిలీ, బైట్‌ డ్యాన్స్‌కు చెందిన మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ యాప్‌ రెస్సో లాంటివి కూడా ఉండే ఛాన్స్‌ ఉంది. అయితే ఈ యాప్స్‌ నిషేధంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఈ నిషేధిత యాప్‌ల వివరాలను కేంద్రం అతి త్వరలో ప్రకటించే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

గతనెల్లో 59 చైనా యాప్స్‌పై భారతప్రభుత్వం వేటు వేసింది. ఇందులో హెలో లైట్‌, షేర్‌ ఇట్‌ లైట్‌, బిగో లైట్‌, వీఎఫ్‌వై లైట్‌ యాప్స్‌ని గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి తొలగించింది. ఇక దేశ భద్రతకు ముప్పు అని భావిస్తే మొత్తం 275 యాప్స్‌పైనా కేంద్రం నిషేధం విధించే అవకాశముంది. ఇందులో భాగంగా చైనాలో సర్వర్లు ఉన్న యాప్‌ల వివరాలను గుర్తించేందుకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది.