(కరోనా స్టాక్).. పారాసెట్మాల్‌ ప్లే... గ్రాన్యూల్స్ ఇండియా

(కరోనా స్టాక్).. పారాసెట్మాల్‌ ప్లే... గ్రాన్యూల్స్ ఇండియా

జ్వరమా? మలేరియా కావచ్చు... క్లోరోక్విన్ మాత్రలు వేసుకోండి.

- 1980వ దశకంలో.. గ్రామీణ, పట్టణాల్లో స్కూళ్లు-ఆసుపత్రులు, పబ్లిక్ ప్లేసెస్‌లో గోడల మీద రాసి ఉండే స్లోగన్ ఇది.
- ఈ హెచ్చరిక ఇప్పుడు కూడా వర్తిస్తుంది. ఎలా అంటే

జ్వరమా? కరోనా కావచ్చు... పారాసెట్మాల్ మాత్రలు వేసుకోండి.

ప్రస్తుతం ఈ భూగోళాన్ని అతలాకుతలం చేస్తున్నది ఏదైనా ఉందంటే, అది కరోనా వ్యాధి మాత్రమే. సాధారణంగా ప్రపంచ యుద్ధాలు వచ్చినప్పుడు ప్రజలంతా ఎప్పుడేం జరుగుతుందోనని భయభ్రాంతులకు గురికావడం, ఎక్కడ బాంబుదాడిలో ప్రాణాలు పోతాయోనని వణికిపోవడం జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం అంతకంటే అధికంగా ప్రజలంతా ఎక్కడ కరోనా బారిన పడిపోతామేమోనని కలవరపాటుకు గురవుతున్నారు. ఒకవేళ కరోనా వ్యాధి సోకితే... మొదట కనిపించే లక్షణం జ్వరం రావడం. ఆ తర్వాత ఇతర కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఇప్పటికి అయితే ఈ వ్యాధి సోకి జ్వరం రాగానే వాడాల్సిన మొదటి మాత్ర - పారాసెట్మాల్. దాదాపు వారం రోజుల వరకూ జ్వరం వచ్చిపోతూ, తగ్గుతూ హెచ్చుతూ ఉంటుంది కాబట్టి క్రమం తప్పకుండా జ్వరం తగ్గేవరకూ పారాసెట్మాల్ మాత్రలను వాడుతూ ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఒక సంక్షోభం, కొందరికి అద్భుతమైన వ్యాపారావకాశం అవుతుంది. అదే అదృష్టం అవుతుంది. అటువంటి అవకాశమే ఇప్పుడు పారాసెట్మాల్ మందు తయారీ చేసే ఫార్మా కంపెనీలకు వచ్చింది. అటువంటి దేశీయ ఫార్మా కంపెనీల్లో అగ్రగామిగా ఉన్న సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా. ఇది ఎక్కడిదో కాదు, మన హైదరాబాద్ కంపెనీయే దాదాపు పాతికేళ్లుగా పారాసెట్మాల్‌ను గ్రాన్యూల్స్ తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్న ఈ సంస్థకు ఇప్పుడు కాలం కలిసివచ్చి లాభాలపంట పండుతోంది. ఈ కంపెనీ ప్రధనాంగా పారాసెట్మాల్, మెట్‌ఫామిన్, ఐబూప్రూఫెన్ ఔషధాలు తయారు చేస్తోంది. ఇంకా అనేక రకాలైన ఇతర ఔషధాలు తయారు చేస్తున్నప్పటికీ, ఇప్పటికీ ఈ కంపెనీ మెయిన్‌స్టే మాత్రం పారాసెట్మాల్ కావడం గమనార్హం. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో అధికాదాయాలు, లాభాలు నమోదు చేస్తూ స్టాక్ మార్కెట్లో మదుపరుల మనసు కొల్లగొడుతోంది. షేర్ కొనుక్కున్నవారికి లాభాల పండ పండిస్తోంది.

APIలో అగ్రగామి
గత కొంతకాలంగా చైనా నుంచి డ్రగ్ ఇంటర్మీడియేట్స్, ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్) సరఫరా కాకపోవడం, కొరత ఏర్పడడం, చైనా మీద ఆధారపడడం దేశీయ ఔషధ పరిశ్రమ తగ్గించుకోవాలనే వాదన బయలుదేరడం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీఐలకు అధిక డిమాండ్, అధిక ధర లభించింది. తత్ఫలితంగా ఈ విభాగంలోని కంపెనీలకు ఆదాయాలు, లాభాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కోవలోకి వచ్చే కంపెనీల్లో గ్రాన్యూల్స్ ఇండియా ఒకటి. గ్రాన్యూల్స్ ఇండియా ప్రధానంగా పారాసెట్మాల్, మెట్‌ఫామిన్, గాఫెనెసిన్, మెథోకార్బమాల్ ఏపీఐలు తయారు చేస్తోంది. ఈ ఔషధాల తయారీలో గ్లోబల్ లీడర్స్‌లో గ్రాన్యూల్స్ ఒకటని చెప్పవచ్చు. కంపెనీ ఆదాయాల్లో 31 శాతం ఏపీఐ ఔషధాల నుంచే సమకూరడం మరొక ఆసక్తికరమైన విషయం.

ఇంకా మీడియమ్ వాల్యూమ్, మీడియం వాల్యూ గల లోసార్టన్, సిట్రిజెన్, ఫెగ్జోఫెనడైన్ ఔషధాలను ఈ కంపెనీ తయారు చేస్తోంది. గత కొంతకాలంగా హై వాల్యూ కల కంట్రోల్డ్ సబ్‌స్టాన్సెస్, డిఫెరెన్సియేటెడ్ మోడిఫైడ్ ఔషధాలు, ఎక్స్‌టెండెడ్ రిలీజ్ డ్రగ్స్ తయారీపై దృష్టి కేంద్రీకరించింది. అంతేగాకుండా రెగ్యులేటెడ్ - హై వాల్యూ - హై మార్జిన్ మార్కెట్లు అయిన అమెరికా, కెనడా, ఐరోపా దేశాలకు విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ మార్కెట్లో పలు ఔషధాల విక్రయానికి దరఖాస్తు చేసి అనుమతులు సంపాదించడం, ఔషధాలు విక్రయించడం జరుగుతోంది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి...
కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి గ్రాన్యూల్స్ ఇండియా రూ. 2635 కోట్ల మొత్తం ఆదాయాన్ని, రూ. 335 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వార్షిక ఈపీఎస్ రూ. 13.19 నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2018-19)లో మొత్తం ఆదాయం రూ. 2305 కోట్లు, నికర లాభం రూ. 236 కోట్లు, ఈపీఎస్ రూ. 9.30 మాత్రమే ఉన్నాయి. రూ. 100 కోట్ల మేరకు నికర లాభం పెరగడం ఆకర్షణీయమైన విషయం.

2020-21 మొదటి త్రైమాసికం
* గ్రాన్యూల్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి త్రైమాసికంలో అత్యంత ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. వాస్తవానికి మొదటి త్రైమాసికం... అంటే ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అధిక భాగం దేశం అంతా, ఆ మాటకొస్తే ఎన్నో దేశాల్లో కరోనా లాక్‌డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. సరుకు రవాణా సక్రమంగా సాగలేదు. దీనికి మించి సిబ్బందిని ఫ్యాక్టరీలకు తెప్పించి ఉత్పత్తి కార్యకలాపాలను ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించడం అనేది కత్తిమీద సాములా మారింది. అయినప్పటికీ గ్రాన్యూల్స్ ఇండియా అటు ఉత్పత్తిలో, ఇటు విక్రయాల్లో మెరుగ్గా వ్యవహరించింది.

* మొదటి త్రైమాసికంలో ఎంతో ఆకర్షణీయంగా రూ. 735 కోట్ల ఆదాయాన్ని, రూ. 111 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

* క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ. 595 కోట్లు, నికరలాభం రూ. 57 కోట్లు మాత్రమే ఉండడం గమనార్హం.

* ఇంతకంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... నికరలాభాల మార్జిన్ 19.9 శాతం నుంచి 25 శాతానికి పెరగడం.

* ఇంతటితో పూర్తి కాలేదు... ఇదే తరహా ఆదాయాలు, లాభాలను ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద నమోదు చేసే అవకాశం ఉందని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేయడం గమనార్హం.

 

సీఎండీ ఏం చెబుతున్నారు...?

మొదటి త్రైమాసికానికి మంచి ఫలితాలు నమోదు చేసిన తర్వాత గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ చిగురుపాటి కృష్ణప్రసాద్ కొన్ని టీవీ ఛానల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కంపెనీకి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలు, పనితీరు అంచనాలను వెల్లడించారు.

అందులో ముఖ్యమైన అంశాలు ఏమిటంటే...

*కరోనా వల్ల ముడి పదార్ధాలు సకాలంలో సరఫరా కాకపోవడం, లాజిస్టిక్స్ సమస్యలు ఎదురయ్యాయి. సిబ్బంది జబ్బు పడకుండా, వారిని ఐసొలేషన్‌లో ఉంచి ఫ్యాక్టరీకి తీసుకవచ్చి జాగ్రత్తగా పని చేయించడం అనేది పెద్ద సవాలు అయ్యింది. అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ సవాళ్లను అధిగమించాం.

* కంపెనీ తయారు చేసే ఔషధాలను విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆదాయాలు, లాభాలు పెరగడానికి ఇదే ప్రధాన కారణం.

* ఉత్పత్తి సామర్ధ్యాన్ని నూరు శాతానికి పైగా ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఉంది.

* మొదటి త్రైమాసికం (క్యూ1) ఆదాయాలు, లాభాలను ఈ ఏడాదికి బెంచ్‌మార్క్‌గా పెట్టుకోవచ్చు. ఇక ముందు త్రైమాసికాల్లోనూ ఇదే స్థాయిలో లేదా ఇంతకంటే అధికంగా ఆదాయాలు, లాభాలు ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లాభాల్లో 30 శాతం కనీస వృద్ధి ఉంటుంది.

* "కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కేఎస్ఎం), ఇంటర్మీడియేట్ల కోసం చైనా మీద ఆధారపడడాన్ని క్రమంగా తగ్గించే ఆలోచనలో ఉన్నాం. వాస్తవానికి చైనా నుంచి కాకుండా ఈ ముడి పదార్ధాలను వేరే దేశం నుంచి కానీ, మన దేశంలో ఇతర సంస్థల నుంచి కానీ సేకరించడం అనేది ఖరీదైన వ్యవహారం. చైనా కంపెనీలు ఈ ముడి పదార్ధాలను ఇచ్చే ధరకు ఏ ఇతర సంస్థ సరఫరా చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఇతర సరఫరాదార్లతో పోల్చితే చైనా ధరలు 20-30 శాతం తక్కువ. అయినప్పటికీ ప్రస్తుత సమీకరణాలు, భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం" అని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.

*  చైనాపై ఆధారపడకుండా దేశీయంగానే బల్క్ ఔషధాలు తయారు చేయడాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 7000 కోట్లతో వచ్చే 8 ఏళ్ల కాలానికి ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ఇది దేశీయ ఔషధ పరిశ్రమకు ఎంతో మేలు చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పథకం గ్రాన్యూల్స్ ఇండియా వంటి  కంపెనీలకు లాభదాయకమే

* మేం ప్రధానంగా తయారు చేసే పారాసెట్మాల్ ఔషధానికి సంబంధించి ఎగుమతులపై ప్రభుత్వ నిషేధం వల్ల రెండు మూడు నెలల పాటు ఇబ్బందులు ఎదురయ్యాయి. నిషేధాన్ని ఎత్తివేసినందున ఇప్పుడ ఆ సమస్య లేదు. ప్రపంచ అవసరాల్లో 70 శాతం పారాసెట్మాల్ తయారీ సామర్ధ్యం మనదేశంలో ఉంది. అదే సమయంలో మన దేశం వినియోగం ఇందులో 15-20 శాతం మాత్రమే. కాబట్టి ఎగుమతులు మనకు ఎంతో ముఖ్యం.

* గ్రాన్యూల్స్ ఇండియా ఆదాయాల్లో 20 శాతం దేశీయంగా లభిస్తోంది. 80 శాతం ఎగుమతులే.

* మొదటి త్రైమాసికంలో రెగ్యులేడెట్ మార్కెట్లలో అయితే కొత్త ఔషధాలకు అనుమతి వచ్చింది. త్వరలో మరో 4 ఔషధాలకు అనుమతి రావచ్చు. ప్రధానంగా అధిక వాల్యూమ్, అధిక మార్జిన్ ఉన్న ఔషధాలపై దృష్టి సారించాం. అంతేగాకుండా ఇప్పటికే యూఎస్‌లో విక్రయిస్తున్న ఔషధాలను యూరోప్, కెనడాలో విక్రయించడానికి అనుమతుల కోసం దరఖాస్తు చేశాం. దీనివల్ల "స్కేల్" లభిస్తుంది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్ అండ్ డీ కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేస్తాం. న్యూ టెక్నాలజీ మీద, కొత్త ఔషధాల మీద ప్రధానంగా పరిశోధనలు చేస్తున్నాం.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 400 కోట్ల వరకూ కేపెక్స్ (మూలధన వ్యయం) ఉంటుంది. వచ్చే ఏడాదిలో మరొక రూ. 300 కోట్ల కేపెక్స్ ఉండవచ్చు. దీనివల్ల ఉత్పత్తి సామర్ధ్యం గణనీయంగా పెరుగుతుంది. దీనికి కంపెనీ చేతిలో ఉన్న సొమ్ము ఖర్చు చేస్తాం. కొంత అప్పు తీసుకోవలసి వస్తుంది. కంపెనీకి దీర్ఘకాలిక అప్పు రూ. 450 కోట్లు ఉంది. మిగతాది వర్కింగ్ కేపిటల్ లోన్ మాత్రమే. కాబట్టి విస్తరణకు అవసరమైన నిధుల సేకరణ పెద్ద సమస్య కాబోదు.

* పారాసెట్మాల్ తయారీకి అవసరమైన ప్రధాన ముడిపదార్ధం - పీఏపీ. పీఏపీ మేం ఇప్పుడు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అలా కాకుండా దీన్ని సొంతంగా తయారు చేసుకోవాలనే లక్ష్యంతో 30,000 టన్నుల సామర్ధ్యం గల ప్లాంట్ నిర్మిస్తున్నాం. ప్రస్తుతం చైనా వద్ద ఉన్నదానికంటే అధునాత టెక్నాలజీతో ఈ ప్లాంట్ కడుతున్నాం.

* ప్రస్తుతం కంపెనీ ఆదాయాల్లో 85 శాతం మేరకు అయిదు ఔషధాల నుంచే లభిస్తోంది. భవిష్యత్తులో కొత్త ఔషధాలు వచ్చాక ఈ అయిదు ఔషధాల మీద ఆధారపడడం తగ్గుతుంది. సమీప భవిషత్తులో ఆదాయాల్లో ఈ అయిదు ఔషధాల వాటా 60 శాతానికి తగ్గవచ్చు. ఇది కంపెనీకి సంబంధించినంత వరకు సానుకూలమైన పరిణామం.

* ఇటీవల కాలంలో పలు దేశాల్లో ప్రభుత్వాలు తమ దేశంలో తయారైన ఔషధాలనే కొనాలని నిర్దేశిస్తున్నాయి. అమెరికాలనూ ఇదే తరహా నిబంధనలు వచ్చాయి. అందువల్ల యూఎస్‌లో గ్రాన్యూల్స్ ఇండియా సొంత ప్లాంట్ ఏర్పాటు చేసింది. దీనివల్ల యూఎస్ ప్రభుత్వానికి అక్కడి నుంచి ఔషధాలు సరఫరా చేసే అవకాశం ఏర్పడింది. ఇప్పటివరకూ మన దేశంలో తయారు చేసి అమెరికా పంపించే ఔషధాలను సాధ్యమైనంతవరకూ ఇకపై యూఎస్‌లోనే తయారు చేస్తారు. అంతేగాక యూఎస్‌లో తయారీ సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి కూడా గ్రాన్యూల్స్ ఇండియా సన్నాహాలు చేస్తోంది.

వాల్యుయేషన్, షేర్ ధర...
గత ఆర్థిక సవంత్సరానికి లాభాల్లో దాదాపు 42 శాతం వృద్ధి కనబరిచిన గ్రాన్యూల్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రికార్డు స్థాయిలో రూ. 111 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇదే స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన త్రైమాసికాల్లోనూ లాభాలు కొనసాగుతాయని కంపెనీ చెబుతోంది. అంటే రూ. 400 కోట్లకు పైగా వార్షిక లాభం నమోదయ్యే అవకాశం ఉందన్న మాట. ఇదే పెద్ద ఆకర్షణ. కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.16-17 ఈఫీఎస్ నమోదు చేయవచ్చు. దీనికి 20 పీఈ ప్రకారం లెక్కిస్తే, రూ.320 నుంచి రూ.340 వరకూ "ఫెయిర్ వాల్యూ"నే కనిపిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22) రూ.19-20 ఈపీఎస్ నమోదు కావచ్చు. అంటే అప్పటికి రూ.400 ఫెయిర్‌ వాల్యూనే ఉంది. కానీ కరోనా వైరస్ వ్యాధి వల్ల ఔషధ కంపెనీలకు అనూహ్యంగా వ్యాపారాభివృద్ధి కనిపిస్తోంది. ఇంకా ఎటువంటి అవకాశాలు వస్తాయనేది చెప్పలేని పరిస్థితి. అందువల్ల ఔషధ కంపెనీలు, ప్రధానంగా ఏపీఐలు, ఫినిష్డ్ డోసేజ్‌లు తయారు చేసే కంపెనీలు ఆకాశామే హద్దుగా అవకాశాలు ఉండవచ్చు. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే వచ్చే రెండేళ్ల కాలం  పాటు గ్రాన్యూల్స్ వంటి దేశీయ ఫార్మా కంపెనీలకు అధిక లాభాలు నమోదు కావడం ఖాయం. అందువల్ల స్టాక్ మార్కెట్‌లో కొంత కరెక్షన్ చోటు చేసుకున్నప్పుడు గ్రాన్యూల్స్ షేర్‌ను కొనుగోలు చేసి రెండేళ్లు ఎదురు చూడగలిగితే 25 శాతం నుంచి 30 శాతం వార్షిక ప్రతిఫలం ఎక్కడికీ పోదు.

(* ప్రస్తుతం స్టాక్‌మార్కెట్లో ఎంఎన్‌సీ ఫార్మా కంపెనీల పీఈ (ప్రైస్ - ఎర్నింగ్స్ రేషియో)లు 60 నుంచి 100 వరకూ ఉన్నాయి. దేశీయ ఫార్మా కంపెనీల్లో అగ్రశ్రేణి కంపెనీల పీఈ లు 40 నుంచి 50 మధ్య కనిపిస్తున్నాయి. మధ్యస్థాయి ఫార్మా కంపెనీల (అంటే ఒక త్రైమాసికానికి రూ. 100 కోట్లకు పైగా నికర లాభాన్ని ఆర్జించేవి) షేర్లు 22 నుంచి 26 పీఈ ధర పలుకుతున్నాయి. ఇంకా కింది స్థాయి ఆదాయాలు, లాభాలు కల ఫార్మా కంపెనీల పీఈలు 15 నుంచి 20 మధ్య ఉన్నాయి.)