దివీస్ ల్యాబ్స్ ప్రయాణం పైకా? కిందకా?

దివీస్ ల్యాబ్స్ ప్రయాణం పైకా? కిందకా?
  • దివీస్ ల్యాబరేటరీస్‌లో ఏం జరుగుతోంది?
  •  

"ఇన్‌సైడర్ ట్రేడింగ్"...
ఒక కంపెనీ షేర్ ధరను ప్రభావితం చేసే అంతర్గత సమాచారాన్ని ముందుగానే తెలుసుకుని ఆ కంపెనీ షేర్లు తక్కువ ధరలో కొని పెరిగిన తరువాత అమ్ముకోవడమే 'ఇన్‌సైడర్ ట్రేడింగ్.'

స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో మునిగితేలేవారికి ఇది తెలియని విషయం కాదు. సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నిబంధనల ప్రకారం ఇది పెద్ద నేరం. దీనికి భారీ పెనాల్టీలు చెల్లించాల్సి రావడంతో పాటు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల నుంచి సంబంధిత వ్యక్తులను నిషేధించడం వంటి శిక్షలు కూడా ఉంటాయి.

 

ఆరోపణల్లో ఇరుకున్న దివీస్ 

అనూహ్యంగా 'ఇన్‌సైడర్ ట్రేడింగ్' ఆరోపణల్లో అగ్రశ్రేణి ఔషధ సంస్థ అయిన దివీస్ ల్యాబరేటరీస్ చిక్కుకుంది. 2017 జూలై 7-10 తేదీల మధ్యకాలంలో దివీస్‌కు చెందిన విశాఖపట్టణం యూనిట్‌పై యూఎస్ఎఫ్‌డీఏ 'బ్యాన్' తొలగింపునకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే తెలుసుకుని కంపెనీ షేర్లు కొని ఆ విషయం అధికారికంగా బయటకు వచ్చిన తర్వాత అధిక ధరకు ఆ షేర్లు అమ్ముకుని లాభపడ్డారనేది సెబీ ఆరోపణ. దీనికి సంబంధించిన దివీస్ ల్యాబరేటరీస్ సీఎఫ్ఓ ఎల్.కిషోర్ బాబుతో పాటు ఆ సంస్థలోని మరికొందరిని దీనికి బాధ్యులను చేస్తూ సెబీ రూ. 96 లక్షల పెనాల్టీ విధించింది. అంతేగాకుండా తగిన సంచాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో కంపెనీ సీఎఫ్ఓ సెలవు మీద వెళ్లాల్సి వచ్చింది. తనపై వచ్చిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను పరిష్కరించుకోవడానికి సీఎఫ్ఓ ఎల్. కిషోర్ బాబు ఈ నెల 18 నుంచి మూడు నెలల పాటు సెలవులో ఉంటారు - అని దివీస్ ల్యాబరేటరీస్ లిమిటెడ్ ఈ నెల 18న బీఎస్ఈ(బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్) వెల్లడించింది. ఆయన స్థానంలో తాత్కాలికంగా జీఎం (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) పీవీ పెరుమాళ్లు సీఎఫ్ఓ బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొంది.

 

పెనాల్టీ చిన్నదే.. కానీ..

సెబీ విధించిన పెనాల్టీ చిన్నదే అయినప్పటికీ దివీస్ ల్యాబరేటరీస్ వంటి పెద్ద కంపెనీ మీద ఇటువంటి ఆరోపణలు రావడం, దానిపై సెబీ పెనాల్టీ విధించడంతో స్టాక్‌మార్కెట్లో ఇన్వెస్టర్లలో విశ్వాసం సన్నగిల్లేందుకు కారణమవుతుంది. కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను సక్రమంగా పాటించడం లేదనే అభిప్రాయం ఏర్పడుతుంది. దాదాపు రూ. 60,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న ఈ కంపెనీలో రిలయన్స్, ఎస్‌బీఐ, ఆక్సిస్ మ్యూచువల్ ఫఁడ్లు, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా వాటాదార్లుగా ఉన్నాయి. అందువల్ల కొంతకాలంపాటు ఈ వ్యవహారం ఇన్వెస్టర్లలో గుర్తుండిపోయే అవకాశం ఉంది.

 

 

పని తీరు ఆకర్షణీయమే...

దీన్ని పక్కన పెడితే దివీస్ ల్యాబరేటీస్ పనితీరు పరంగా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. గత మూడు నెలలుగా స్టాక్‌మార్కెట్లో ఫార్మా షేర్లకు విపరీతమైన గిరాకీ వచ్చిన విషయం తెలిసిందే. ఒక మాదిరి ఫార్మా కంపెనీల షేర్లు సైతం మండిపోతున్నాయి. కొద్దిరోజుల్లో 50 శాతం నుంచి నూరు శాతం, రెడు వందల శాతం షేర్ ధర పెరిగిన ఫార్మా కంపెనీలు ఉన్నాయి. కానీ ఈ ఫార్మా ర్యాలీలో దివీస్ ల్యాబరేటరీస్ పార్టిసిపేట్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. దీనికి తోడు తాజాగా ఇన్‌సైడర్ వ్యవహారం వెలుగు చూడడంతో కొంతకాలం పాటు ఈ షేర్‌కు దూరంగా ఉండడం మేలు - అని ఇన్వెస్టర్లు అనుకునే పరిస్థితి ఏర్పడింది.

 

 

ఫైనాన్షియల్స్ ఇలా ఉన్నాయి...

దాన్ని పక్కనపెడితే పనితీరు పరంగా ఎటువంటి సమస్య లేనందున సమీప భవిష్యత్తులో దివీస్ ల్యాబరేటరీస్ షేర్ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయమైన ప్రతిఫలాన్ని అందించే అవకాశం లేకపోలేదు. ఈ కంపెనీ గత రెండేళ్లుగా విశాఖపట్టణం, హైదరాహబాద్ సమీపంలోని ప్లాంట్లలో చేపట్టిన విస్తరణ పూర్తయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దీనికి సంబంధించిన ఫలితాలు కనిపిస్తాయి. 'కరోనా' తీవ్రత వల్ల కొంతమేరకు లాజిస్టిక్స్ సమస్యలు తలెల్తి కొంతమేరకు మొదటి త్రైమాసికంలో కంపెనీ పనితీరుపై ప్రభావం పడినట్లు చెప్పుకుంటున్నారు. కానీ ఈ కంపెనీ పూర్తి సంవత్సరానికి ఆకర్షణీయమైన ఆదాయాలు, లాభాలు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం దివీస్ ల్యాబరేటీస్ లిమిటెడ్ రూ. 5584 కోట్ల మొత్తం ఆదాయాన్ని, రూ. 1376 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. వార్షిక ఈపీఎస్ రూ. 51 ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ ధర రూ. 43 పీఈ (ప్రైస్ ఎర్నింగ్) నిష్పత్తిలో కనిపిస్తోంది. కానీ ఈ ఆర్థిక సంవత్సరం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదనపు ఉత్పత్తి సామర్ధ్యం వల్ల లాభాలు ఇంకా పెరిగి ఆ మేరకు ఈపీఎస్ పెరిగి పీఈ తగ్గుతుంది.

 

అప్పుడు ఈ షేర్‌కు ఇన్వెస్టర్ల నుంచి గిరాకీ పెరిగే అవకాశం ఉంటుంది. రెండేళ్ల తరువాత ఒక్కో త్రైమాసికానికీ రూ. 500 కోట్ల వరకూ లాభాన్ని ఆర్జించే స్థాయికి ఈ కంపెనీ చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో రెండు నుంచి మూడేళ్లపాటు ఎదురుచూడగలిగే ఇన్వెస్టర్లకు ఈ కంపెనీ షేర్‌పై పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఫార్మా షేర్లకు ప్రస్తుతం స్టాక్‌మార్కెట్లో ఉన్న ఆకర్షణను పరిగణలోకి తీసుకోంటే, స్వల్ప కాలంలో కూడా 20 శాతంవరకూ షేర్ ధర పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ కంపెనీ షేర్ పెద్దగా పెరగకపోవడానికి తోడు... త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్న పక్షంలో ఇన్వెస్టర్లు మళ్లీ ఈ షేర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.