లారస్ ల్యాబ్స్ షేర్ ధర ఇంకెంత పెరగవచ్చు?

లారస్ ల్యాబ్స్ షేర్ ధర ఇంకెంత పెరగవచ్చు?

'కరోనా' పుణ్యమా అని... గత మూడున్నర సంవత్సరాలుగా ఏమాత్రం చలనం లేకుండా ఉన్న ఫార్మా కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో మండిపోతున్నాయి. ప్రతి రోజూ 52 వారాల గరిష్ట ధరను నమోదు చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఒఖపక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి, ఉద్యోగాలు పోయి, ఉపాధి కరువైన పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్, సిమెంట్, ఇంజినీరింగ్, విద్యుత్తు, కేపిటల్ గూడ్స్... వంటి ముఖ్యమైన రంగాల షేర్లను పట్టించుకునేవారే లేరు. కానీ అదే సమయంలో ఫార్మా షేర్లు మాత్రం పైపైకి వెళ్లిపోతున్నాయి.

ఈ క్రమంలో ఇటీవల కాలంలో అత్యంత ఆకర్షణీయంగా పెరిగిన స్థానిక ఫార్మా కంపెనీల షేర్లలో లారస్ ల్యాబ్స్ ఒకటి. దాదాపు స్థానిక రిటైల్ ఇన్వెస్టర్లు అందరూ ప్రస్తుతం ఈ షేర్ మీద ఉన్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముంబై నుంచి హైదరాబాద్, వైజాగ్, భీమవరం... దాకా ప్రతి ఒక్క రిటైల్ ఇన్వెస్టర్ నోట్లో నానుతున్న స్థానిక ఫార్మా కంపెనీ ఏదైనా ఉందంటే, ఇప్పుడు అది లారస్ ల్యాబ్స్ మాత్రమే. దీనికి తగ్గట్లుగా ఈ షేర్ ధర అత్యంత ఆకర్షణీయంగా పెరుగుతూ ఈ షేర్ ను కొన్నవారికి లాభాలు పండిస్తోంది.

  • కానీ ఇంకా ఎంతవరకూ పెరగవచ్చు?
  • అసలు ఈ పెరుగుదలకు ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా?
  • ఇంత పెరిగాక ఇప్పుడు కూడా కొంటే లాభం ఉంటుందా?

అనేవి సగటు ఇన్వెస్టర్‌కు వచ్చే సందేహాలు...

ఈ షేర్ ధర ఆకర్షణీయంగా పెరగడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అవి:
1) స్టాక్ మార్కెట్లో ఫార్మా ర్యాలీ రావడం
2) కంపెనీ పనితీరు మెరుగుపడడం, వచ్చే రెండేళ్ల కాలానికి ఆకర్షణీయమైన లాభాలు నమోదు చేసే అవకాశం ఉండడం
3) పాత ఇన్వెస్టర్లు వెళ్లిపోయి ఆ స్థానంలో అగ్రెసివ్‌గా ఉండే కొత్త సంస్థాగ, హెచ్ఎన్ఐ మదుపరులు రావడం. నాలుగేళ్ల క్రితం పబ్లిక్ ఇష్యూకు వచ్చిన తరువాత ఇప్పటివరకూ ఈ షేర్ ర్యాలీ రాకపోవడం

ముందుగా ఒకసారి లారస్ ల్యాబ్స్ షేర్ హోల్డింగ్ పాట్రన్ ఎలా ఉందో చూడాల్సిన అవసరం ఉంది..

లారస్ ల్యాబ్స్ షేర్ హోల్డింగ్ పాట్రన్, జూన్ 2020 నాటికి...
(ఆధారం బీఎస్ఈ వెబ్‌సైట్)
 

లారస్ ల్యాబ్స్ షేర్ ముఖ విలువ: రూ. 10
జారీ మూలధనం: రూ. 106.91 కోట్లు (10,69,14,499 షేర్లు)
ప్రమోటర్ల వాటా: 32.13 శాతం
ఇతరులు: 67.87 శాతం
ఇతరుల్లో ముఖ్యమైన షేర్ హోల్డర్లు

 

  • అమాన్సా హోల్డింగ్స్: 6.12 శాతం
  • ఆకాష్ బన్సాలీ: 1.01 శాతం
  • ఆది ఫైనాన్షియల్ అడ్వైజర్: 1.09 శాతం
  • ఆంబిట్ క్యాపిటల్: 11.96 శాతం
  • అనుకార్ ప్రాజెక్ట్స్: 2.62 శాతం
  • వైవి లక్ష్మి: 1.14 శాతం
కేపెక్స్ దాదాపుగా పూర్తి
గత రెండేళ్లుగా ఈ సంస్థ కొత్త మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు నిర్మించింది. దాదాపు రూ. 1000 కోట్లకు పైగా మూలధన పెట్టుబడి పెట్టింది. బల్క్ డ్రగ్, ఏపీఐ నుంచి ఫార్ములేషన్స్ వరకూ అన్ని దశల్లోనూ ఔషధాల తయారీ చేపట్టగల సత్తా ఈ కంపెనీకి ఉంది. చైనా నుంచి ముడి పదార్ధఆలు ఏపీఐలు రాకపోతే, కొంతవరకూ సొంతంగా తనకు తానే తయారు చేసుకోగల సాంకేతిక నైపుణ్యం,. ఫ్యాక్టరీ, సిబ్బంది కంపెనీకి ఉన్నారు. దాదాపుగా కేపెక్స్ పూర్తి కాగా, దాని తాలూకు ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. వచ్చే రెండేళ్లలో ఇంకా బాగా కనిపిస్తాయని అంటున్నారు.

 

కొత్త ఇన్వెస్టర్లు
ఈ కంపెనీలో పబ్లిక్ ఇష్యూకు ముందు, పబ్లిక్ ఇష్యూలో పెట్టుబడి పెట్టిన సంస్థాగత మదుపరులు కొందరు, ఒక ప్రమోటర్ డైరెక్టర్ ఇటీవల కాలంలో తమ షేర్లు విక్రయించి కంపెనీ నుంచి దాదాపుగా తప్పుకున్నారు. ఆ స్థానంలో కొత్త  ఇన్వెస్టర్లు వచ్చారు. వారిలో కొందరు స్టాక్ మార్కెట్లో అగ్రెసివ్ ఇన్వెస్టర్లు, మార్కెటింగ్ మేకింగ్లో నిపుణులుగా పేరున్నవారు కావడం గమనార్హం. దీంోత లారస్ ల్యాబ్స్ షేర్‌కు కొత్త కలర్ వచ్చినట్లు అయింది. అదే సమయంలో ఫార్మా ర్యాలీ రావడం, కంపెనీ ఆకర్షణీయమైన లాభాలు రాసే పరిస్థితి ఏర్పడడం జరిగాయి. కాలం కలిసి వస్తే, అన్నీ మంచి శకునాలే అంటారు కదా.. అలా ఇప్పుడు లారస్ ల్యాబ్స్‌కు అంతా కలిసి వస్తోంది.

 

పబ్లిక్ ఇష్యూ తర్వాత
దాదాపు నాలుగేళ్ల క్రితం ఈ కంపెనీ రూ. 430 షేర్ ధరలో పబ్లిక్ ఇష్యూక వచ్చింది. ఆ తర్వాత షేర్ దర పెద్దగా పెరిగింది లేదు. ఒకటి రెండుసార్లు మాత్రం రూ.600 దరిదాపుల్లోకి వచ్చి మళ్లీ వెనక్కు వెళ్లిపోయింది. పని తీరు ఆకర్షణీయంగా లేకపోవడానికి తోడు... స్టాక్ మార్కెట్లో ఫార్మా షేర్లకు 2017 తర్వాత గ్లామర్ తగ్గింది. దీంతో ఈ షేర్ కిందక పడిపోయింది. దాదాపు రెండేళ్ల కాలం రూ. 330 దరిదాపుల్లో ఉండిపోయింది. కిందకూ రూ. 300కు పడిపోవడం, రూ. 370 వరకూ వెళ్లడం జరుగుతూ వచ్చింది. ఈ ప్రైస్ బ్యాండ్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే బ్రేక్-అవుట్ వచ్చింది.
ఒక్కసారిగా పెరగడం మొదలై రూ. 536 వరకూ వెళ్లింది. అక్కడి నుంచి రూ. 440కి పడిపోయింది. ఆ దశలో రెండు విదేశీ సంస్థలు పెద్ద మొత్తంలో షేర్లు విక్రయించారు. ఆ తర్వాత రూ. 430-450 వద్ద కొంతకాలం ఉండి తర్వాత పెరగడం మొదలై రూ. 578 వరకూ వెళ్లింది. మళ్లీ రూ. 510కిపడింది. అక్కడి నుంచి పెరుగుదల మొదలై ఇప్పుడు రూ. 626 పలుకుతోంది. ఇదీ గత కొంతకాలంగా ఈ షేర్ పరిణామ క్రమం. దీన్ని బట్టి ఈ షేర్‌కు రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయనేది అర్ధమైపోతుంది.

రూ. 2 షేర్ ధర

రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ. 2 ముఖ విలువ గల ఐదు షేర్లుగా విభజించాలని కొంతకాలం క్రితం కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ సమావేశంలో నిర్ణయించారు. దీనికి గత వారంలో జరిగిన ఏజీఎంలో ఆమోదముద్ర లభించింది. ఈ రికార్డు తేదీ ప్రకటించడమే తరువాయి. వచ్చే నెలలో కానీ లేదా సెప్టెంబర్ నాటికి ఈ షేర్ రూ. 2గా విడిపోయే అవకాశం వచ్చింది. 

కనీసం రూ. 150 ధర వద్ద లేదా ఆ పైన షేర్-డివిజన్ జరుగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ప్రస్తుతం ఈ కౌంటర్‌లో సెల్లింగ్ లేదు, అంతా కొనడమే కనిపిస్తోంది. ప్రతిరోజూ గరిష్ట ధర వద్ద క్లోజింగ్‌ను నమోదు చేస్తూ, బలమైన బుల్లిష్ సంకేతాలు ఇస్తోంది. దీన్ని బట్టి ఈ షేర్‌లో సందడి అప్పుడే ముగిసిపోలేదు. ఇంకా ఆకర్షణ ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ పనితీరు, ప్రస్తుత సమీకరణాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే.. ఈ షేర్ ఎంతవరకూ పెరగవచ్చనేవిషయంలో మీరే ఒక అంచనాలు రావచ్చు??