అప్పుల్లేని కంపెనీగా రిలయన్స్ అవతరణ

అప్పుల్లేని కంపెనీగా రిలయన్స్ అవతరణ

లాక్‌డౌన్ కాలంలో.. ఓ కంపెనీ గురించి మాట్లాడుకున్నామంటే.. అది రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే. ప్రపంచం మొత్తం వాణిజ్యం స్తంభించిపోయిన పరిస్థితుల్లో.. ఒక్క రిలయన్స్ సంస్థలోకి మాత్రం వేల కోట్లు చొప్పున నిధులు ప్రవహించాయి. అనేక అంతర్జాతీయ కంపెనీలతో పలు డీల్స్ చేసుకోగా... ఇప్పుడవన్నీ కలిపి లక్ష కోట్లను కూడా దాటిపోవడం విశేషం. రిలయన్స్ సంస్థను రుణ రహితంగా మార్చుతానంటూ.. గత వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ ఛైర్మన్ ముకేష్ అంబానీ ప్రకటించగా.. ముందుగా చెప్పిన గడువుకు 8 నెలల ముందే.. ఈ టార్గెట్‌ను అందుకోవడం విశేషంగా చెప్పాలి.

మార్చ్ 31, 2021 నాటికి.. అప్పులు లేని కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను తీర్చిదిద్దుతానని.. సంస్థ అధినేత ముకేష్ అంబానీ గతేడాది ప్రకటించారు. ఇందులో భాగంగా.. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ సంస్థలో వాటా విక్రయాలను వరుసగా చేపట్టారు. ఏప్రిల్ 22న ఈ డీల్స్ కుదుర్చుకోవడం ప్రారంభం కాగా.. ఇప్పటివరకూ మొత్తం 11 డీల్స్ జరిగాయి. ఫేస్‌బుక్‌తో ప్రారంభించి.. తాజాగా సౌదీ సంస్థ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో కలిపి.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటివరకూ రెండు నెలల్లో మొత్తం రూ.1.16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లుగాను, ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ.5.16 లక్షల కోట్లుగాను లెక్కించారు.

రూ.11,367 కోట్లను సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేసింది. పీఐఎఫ్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.32 శాతం వాటా విక్రయించింది. కంపెనీలో దాదాపు 24.7 శాతం వాటాను 2 నెలల వ్యవధిలో రిలయన్స్‌ విక్రయించగా.. భిన్న సాంకేతితలు, ప్లాట్‌ఫామ్‌లు ఒకే గ్రూప్‌ కింద ఉండటం వల్లే జియో ప్లాట్‌ఫామ్స్‌పై దిగ్గజ పెట్టుబడిదారుల ఆసక్తి చూపుతున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.53,124 కోట్లను రిలయన్స్‌ సమీకరించింది. ప్రస్తుతం రూ.1.61 కోట్ల విలువైన రుణాలు ఆర్‌ఐఎల్‌కు ఉన్నాయి. జియో ఫ్లాట్‌ఫామ్స్‌కు వచ్చిన పెట్టుబడులు, రైట్స్‌ ఇష్యూ నిధులతో కలిపి మొత్తం అప్పులను తీర్చివేయనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గతంలోనే ప్రకటించగా.. మరోవైపు వ్యాపార విస్తరణపై కూడా దృష్టి నిలిపింది. ఫ్యూచర్‌ రిటైర్‌లో వాటాలను కొనేందుకు రిలయన్స్‌ సిద్ధమవుతోందని.. ఆ గ్రూప్‌తో సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది.

రైట్స్ ఇష్యూతో కలిపి ఇప్పటివరకూ రూ. 168,818 కోట్లను రిలయన్స ఇండస్ట్రీస్ సమీకరించింది. నాన్ ఫైనాన్షియల్ సంస్థ చేపట్టిన ప్రపంచంలోనే అతి పెద్ద రైట్స్ ఇష్యూగా రిలయన్స్ రైట్స్ ఇష్యూ రికార్డ్ సృష్టించగా.. దీనికి 1.59 రెట్లు ఓవర్ సబ్‌స్క్రిప్షన్ లభించడం విశేషం. వచ్చే ఏడాది మార్చ్ నాటికి రుణరహిత కంపెనీగా రిలయన్స్‌ను మార్చుతానని తాను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినందుకు సంతోషంగా ఉందని ముకేష్ అంబానీ తెలిపారు. షేర్‌హోల్డర్లు, వాటాదారులే తమ సంస్థకు డీఎన్ఏ అని.. ఈ విషయం మరోసారి నిరూపితమైందని ఆయన అన్నారు. రాబోయే దశాబ్ద కాలం.. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు గోల్డెన్ డెకేడ్ అవుతుందని ఆశిస్తున్నట్లుగా ఆయన చెప్పారు.