భారత్‌-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత

భారత్‌-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత

భారత్‌-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గత కొద్ది రోజులుగా పరిస్థితి అదుపులోకి వస్తోందని వార్తలు రాగా, తాజాగా ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. సరిహద్దుల్లో భారత్‌-చైనా సైనికులు మరోసారి బాహాబాహీకి దిగడంతో భారత సైన్యానికి చెందిన ఓ కల్నర్‌ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికలు అమరులయ్యారు. ఈ వార్తలను ఆర్మీ అధికారులు ధృవీకరించారు.  ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరు వర్గాలకు చెందిన ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.

పెరిగిన చైనా కవ్వింపు చర్యలు..
భారత సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించింది. లద్దాక్‌లోని గల్వాన్ వాలీలోకి చైనా ఆర్మీ చొచ్చుకువచ్చింది. భారత భూభాగంలోకి రావడమే కాకుండా ఏకపక్షంగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో భారత సైన్యానికి చెందిన ఓ ఆర్మీ అధికారి, ఇద్దరు జవాన్లు మృతిచెందారు. ఇటీవలికాలంలో డ్రాగన్ కవ్వింపు చర్యలు ఎక్కవవుతున్నాయి. కొద్దిరోజుల కిందట ఇలాగే చైనా ఆర్మీ బోర్డర్ దాటేందుకు ప్రయత్నించింది. భారత సైన్యం అడ్డుకోవడంతో వెనక్కు తగ్గింది. ఇరు దేశాల ఆర్మీ అధికారుల మధ్య చర్చలు కూడా జరిగాయి. రెండు దేశాలు తమ బలగాలను ఉపసంహరించుకున్నాయి. దీంతో పరిస్థితులు సద్దుమణిగాయని అనుకుంటున్న తరుణంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం ఆందోళనకరంగా మారింది.

ఆదినుంచి అదే వైఖరి..
కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం అట్టుడుకుతుంటే మరోసారి చైనా తన వక్రబుద్ధిని చాటుకుంది. గత ఏప్రిల్‌ నుంచి లద్దాఖ్‌ ప్రాంతంలో చైనా గస్తీని పెంచింది. సరిహద్దు ప్రాంతంలో చైనా పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. దీనిపై అప్రమత్తమైన భారత సైన్యం వారి కదలికలపై నిఘా వేసింది. వెంటనే అప్రమత్తమైన భారత్‌ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. వందలాది సైనికులను లద్దాఖ్‌ సరిహద్దుకు తరలించింది. 

ఇరు దేశాల సైనికుల ఘర్షణ..
గత నెల్లో ఇరు దేశాల సైనికులు పాంగాంగ్‌ సరస్సు ఒడ్డున ఘర్షణకు దిగారు. ఇరు దేశాలకు చెందిన జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి రోజురోజుకీ ఘర్షణపూరితంగా మారుతుండడంతో ఉన్నతస్థాయి అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఈ నెల ఓ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. దీనిపై రెండు రోజుల క్రితం స్పందించిన ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణె.. పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని ప్రకటించారు. ఇరు దేశాలు బలగాల్ని ఉపసంహరించుకుంటున్నాయని తెలిపారు. 

సరిహద్దుల్లోనే చైనా యుద్ధ వాహనాలు.. 
అయితే సైనికులను ఆ ప్రాంతం నుంచి వెనక్కి పిలిపించుకున్నప్పటికీ భారీ స్థాయిలో యుద్ధ వాహనాలను చైనా ఇంకా సరిహద్దుల్లోనే మోహరించింది. దీంతో సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య భారీ స్థాయిలో ఘర్షణ జరిగింది. ఓ సైనికాధికారి సహా ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. 

మళ్ళీ యుద్ధ వాతావరణం..
గత ఆరు దేశాల మధ్య భారత్‌, చైనాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి. 1962 యుద్ధం తర్వాత భారత భూభాగంలోని వందలాది కిలోమీటర్ల మేర ప్రాంతం తమదేనని చైనా వాదిస్తోంది. ఆ వ్యాఖ్యలను భారత్‌ ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. తాజాగా చైనా మళ్ళీ తన పాత పాట అందుకోవడంతో పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తంగా మారాయి.