వీగార్డ్‌కు కోవిడ్‌ దెబ్బ

వీగార్డ్‌కు కోవిడ్‌ దెబ్బ

కోవిడ్‌-19 లాక్‌డౌన్‌తో వీగార్డ్‌ ఆదాయం భారీగా పడిపోయింది. మార్చి 31తో ముగిసిన నాల్గో త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 75శాతం క్షీణతతో రూ.541 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.745 కోట్లుగా ఉంది. ఇక కంపెనీ నికరలాభం 48శాతం క్షీణతతో రూ.32.2 కోట్లకు పడిపోయింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికరలాభం రూ.60.8 కోట్లుగా ఉంది.

వీగార్డ్‌ ఇండస్ట్రీస్‌ ఎబిటా విషయానికి వస్తే 43శాతం క్షీణతతో రూ.82 కోట్ల నుంచి రూ.46 కోట్లకు తగ్గింది. ఎబిటా మార్జిన్స్‌ 11 శాతం నుంచి 9శాతానికి పడిపోయింది. లాక్‌డౌన్‌తో దేశంలోని తమ ప్లాంట్స్‌లో ఉత్పత్తి కార్యకలాపాలు ఆపివేశామని, కొద్ది రోజుల క్రితమే పాక్షికంగా ప్రారంభించామని కంపెనీ తెలిపింది. 

కంపెనీ ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో మార్నింగ్‌ సెషన్‌లో లాభాల్లో ట్రేడైన వీగార్డ్‌ ప్రస్తుతం నష్టాల్లోకి జారుకుంది. డే గరిష్టం నుంచి నుంచి ప్రస్తుతం షేర్‌ 4శాతం నష్టపోయింది. ప్రస్తుతం 2శాతం లాభంతో రూ.180.50 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి ఇవాళ ఇప్పటివరకు 6.20 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.