2 నెలల గరిష్టానికి ఐషర్‌ మోటార్స్‌

2 నెలల గరిష్టానికి ఐషర్‌ మోటార్స్‌

స్టాక్‌ విభజన ప్రణాళికలతో ఐషర్‌ మోటార్స్‌ జోరు మీదుంది. గత 3 రోజుల్లో ఈ స్టాక్‌ 12శాతం పైగా లాభపడి ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచెత్తింది. స్మాల్‌ రిటైల్‌ ఇన్వెస్టర్లకు స్టాక్‌ను మరింత అందుబాటులో ఉంచేలా కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేయడం ఈ స్టాక్‌కు జోష్‌నిస్తోంది. దీంతో ఇవాళ 4శాతం పైగా లాభపడిన ఈ స్టాక్‌ రూ.15,589కు చేరింది. ఇది రెండు నెలల (మార్చి 20, 2020) గరిష్ట స్థాయి కావడం విశేషం. 

షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 12న సమావేశమయ్యే ఐషర్‌ మోటార్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు Royal enfieldస్టాక్‌ స్ప్లిట్‌పై నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే అదేరోజూ కంపెనీ నాల్గో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనుంది. వ్యాపార వృద్ధికి అవసరమైన అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. 

ఈ కంపెనీ తయారు చేస్తోన్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బ్రాండ్‌కు ప్రీమియం మోటార్‌ సైకిల్‌ సెగ్మెంట్లో దేశీయంగా చక్కని డిమాండ్‌ ఉంది. జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 17శాతం క్షీణతతో 1.63 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. బలహీన డిమాండ్‌, లాక్‌డౌన్‌లు తమ అమ్మకాలపై ప్రభావం చూపాయని కంపెనీ వెల్లడించింది.