ఆర్‌బీఐ వడ్డీరేట్లు ఎంత తగ్గాయంటే..?

ఆర్‌బీఐ వడ్డీరేట్లు ఎంత తగ్గాయంటే..?

కీలక వడ్డీరేట్లు 40 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తూ ఆర్‌బీఐ మానిటరీ పాలసీలో నిర్ణయం తీసుకున్నారు. వడ్డీరేట్ల తగ్గింపునకు 5-1 ఓట్లతో ఆరుగురు సభ్యుల కమిటీ ఆమోదం తెలిపిందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. దీంతో లాక్‌డౌన్‌తో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఇండస్ట్రీ వర్గాలకు కొంతమేర ఊరట లభించినట్లయింది.

కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కీలక విషయాలను వెల్లడించారు. మే 20 నుంచి 22 వరకు జరిగిన ఎంపీసీ సమావేశంలో రెపో, రివర్స్‌ రెపో రేట్లను 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించాలని నిర్ణయించినట్టు శక్తికాంతదాస్‌ తెలిపారు. దీంతో రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి , రివర్స్‌ రెపోరేటు 3.75 శాతం నుంచి 3.35శాతానికి తగ్గాయి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని, ఆర్థికరంగ అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో సిమెంట్‌, ఉక్కు పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. లాక్‌డౌన్ కాలంలో సిమెంట్‌ ఉత్పత్తి 25శాతం తగ్గిందని, పెట్టుబడుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం పడిందని శక్తికాంత్‌దాస్‌ వెల్లడించారు.

వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరగడంతో  ఇది వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహకం ఉంటుందన్నారు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌. లాక్‌డౌన్‌తో కూరగాయలు, నూనె గింజల ధరలు భారీగా పెరిగాయని ఆయన చెప్పారు. డిమాండ్‌ ఆధారంగా ద్రవ్యోల్బణం భవిష్యత్తు, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన సవాళ్లు పొంచి ఉన్నాయని ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు.

ఆర్థిక మందగమనంతో ప్రభుత్వ ఆదాయాలు దెబ్బతిన్నాయని, మరిన్ని నిధులు అందుబాటులో ఉంచేందుకు రెపో రేటు తగ్గించామన్నారు ఆర్బీఐ  గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌. రుణాలపై మారటోరియం జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు అంటే మరో మూడు నెలల పాటు మారటోరియం పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు.