మార్కెట్లను ఆకట్టుకోని ఆర్‌బీఐ నిర్ణయం

మార్కెట్లను ఆకట్టుకోని ఆర్‌బీఐ నిర్ణయం

మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఆర్‌బీఐ నిర్ణయాలు లేకపోవడంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ స్టాక్స్‌ భారీ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ దాదాపు 500 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టీ 100 పాయింట్లు, సెన్సెక్స్‌ 350 పాయింట్ల నష్టంతో కొనసాగుతోన్నాయి. దీంతో నిఫ్టీ మళ్ళీ సైకలాజికల్‌ ఫిగర్‌ 9వేల దిగువకు పడిపోయింది. ఐటీ టెక్నాలజీ మినహా అన్ని రంగాల సూచీలు కరెక్షన్‌కు గురవుతోన్నాయి. 

రూపాయి మారకం విలువ భారీగా క్షీణించి 76 మార్కును అధిగమించడం, ప్రపంచ మార్కెట్ల సపోర్ట్‌ లేకపోవడం, యూఎస్‌-చైనాల మధ్య మళ్ళీ ఉద్రికత్తలు... మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపర్చాయి. దీనికి తోడు ముందుగా మార్కెట్‌ వర్గాలు అంచనాలకు అనుగుణంగా వడ్డీరేట్లలో కోత లేకపోవడం మార్కెట్లను నిరాశపర్చాయి. ఇక కమోడిటీ విషయానికి వస్తే జూన్‌ కాంట్రాక్ట్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ.46,690గా ఉంది. నిన్నటి ముగింపుతో పోలిస్తే వెండి ధర దాదాపు అదే స్థాయి వద్ద ట్రేడవుతోంది.

బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు చురుగ్గా కదలాడుతోన్నప్పటికీ నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. ఇన్ఫోసిస్‌ 3.14 శాతం, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 3.15 శాతం, ఏషియన్‌ పెయింట్స్‌ 2.25 శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 1.72 శాతం, బ్రిటానియా 1.13 శాతం లాభంతో నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 5.28 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 4.76శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 4.53 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 4.60 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 4.18 శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.