నేలచూపులు చూస్తోన్న హాకిన్స్‌ కూకర్స్‌

నేలచూపులు చూస్తోన్న హాకిన్స్‌ కూకర్స్‌

నిరుత్సాహకర ఆర్థిక ఫలితాల విడుదలతో ఇవాళ హాకిన్స్‌ కూకర్స్‌ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. ఇంట్రాడేలో 12శాతం పైగా నష్టపోయిన షేర్‌ డే కనిష్ట స్థాయి రూ.3985కు పడిపోయింది. 2015 ఫిబ్రవరి తర్వాత ఇంట్రాడేలో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి.  బీఎస్‌ఈలో ప్రస్తుతం 6శాతం పైగా నష్టంతో రూ.4230 వద్ద షేర్‌ ట్రేడవుతోంది.

మార్చి 31తో ముగిసిన నాల్గో త్రైమాసికంలో హాకిన్స్‌ కూకర్స్‌ మొత్తం ఆదాయం 21 శాతం క్షీణతతో రూ.146 కోట్లుగా నమోదైంది. లాక్‌డౌన్‌తో ఉత్పత్తి, అమ్మకాలు తగ్గడం తమ ఆదాయంపై ప్రభావం చూపిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇక కంపెనీ నికరలాభం 30.4శాతం క్షీణతో రూ.9.4 కోట్లకు పరిమితమైంది. ఎబిటా 34.1శాతం క్షీణతతో రూ.14.5 కోట్లుగా నమోదైంది. ఎబిటా మార్జిన్స్‌ 11.9శాతం నుంచి 9.9శాతానికి తగ్గింది. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో తమ లాభాలు భారీగా తగ్గడంతో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డివిడెండ్‌ను ప్రకటించడం లేదని కంపెనీ తెలిపింది.